అంబేద్కర్ ఆశయాలకు జగన్ తూట్లు : అచ్చెన్నాయుడు

by Disha Web Desk |
అంబేద్కర్ ఆశయాలకు జగన్ తూట్లు : అచ్చెన్నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తూట్లు పొడుస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. సమసమాజాన్ని కోరుకున్న అంబేద్కర్ కలల్నిబుగ్గిపాలు చేస్తున్నారని మండిపడ్డారు. భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌కు తెలుగుదేశం పార్టీ ఘన నివాళులర్పించింది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్ 66వ వర్ధంతిని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి అచ్చెన్నాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...రాష్ట్రంలో పేద, బడుగు, బలహీనవర్గాల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక్క రెడ్డి సామాజివర్గం అభివృద్ధే ధ్యేయంగా జగన్ రెడ్డి పాలన కొనసాగుతోందని, ఇదేంటని ప్రశ్నించిన వారిని కృూరంగా చంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో రౌడీయిజం, అరాచకం రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. అంబేద్కర్ దేశానికి రాజ్యాంగం ద్వారా ప్రసాదించిన ప్రాథమిక హక్కులను జగన్ కాలరాస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు తమ భావాలను బహిరంగంగా, స్వేచ్ఛగా వ్యక్తపరుచుకునే అవకాశంపై వైసీపీ రౌడీలు, గూండాలు దాడులు చేస్తుంటే..వాటిని ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారని విరుచుకుపడ్డారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అరాచకశక్తులపై టీడీపీ నిరంతరపోరాటం చేస్తోందని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తుందని తెలిపారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులు రాష్ట్రంలో అమలు చేసేందుకు, ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా, సంతోషంగా, సమాన అవకాశాలు అందిపుచ్చుకునేలా టీడీపీ ప్రయత్నం చేస్తుందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు టీడీపీ కట్టుబడి పనిచేస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు.

డా.బి.ఆర్ అంబేద్కర్‌కు నివాళులర్పించిన వారిలో మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు, నక్కా ఆనందర్ బాబు, కొల్లు రవీంద్ర, బొండా ఉమామహేశ్వరరావు, పర్చూరి అశోక్ బాబు, బచ్చుల అర్జునుడు, బుద్దా వెంకన్న, దువ్వారపు రామారావు, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, ఏఎస్ రామకృష్ణ, బీకే పార్థసారథి, పల్లా శ్రీనివాసరావు, బుచ్చిరాంప్రసాద్, శేషు, సయ్యద్ రఫి, ఎం.ఎస్.రాజు, జి.కోటేశ్వరరావు, సునీల్, హసన్ బాషా, నాగేంద్రకుమార్, డాక్టర్ నిమ్మల శేషయ్య, వీరంకి గురుమూర్తి, దారపనేని నరేంద్రబాబులు ఉన్నారు.


Next Story

Most Viewed