విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై విచారణ ముమ్మరం.. రంగంలోకి త్రిసభ్య కమిటీ

by Ramesh Naini |

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 8 మంది ప్రాణాలను బలిగొన్న భారీ ప్రమాదంపై కేంద్ర ఉక్కు శాఖ దర్యాప్తును వేగవంతం చేసింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై విచారణ ముమ్మరం.. రంగంలోకి త్రిసభ్య కమిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 8 మంది ప్రాణాలను బలిగొన్న భారీ ప్రమాదంపై కేంద్ర ఉక్కు శాఖ దర్యాప్తును వేగవంతం చేసింది. ప్రమాద కారణాలను విశ్లేషించేందుకు నియమించిన ఉన్నతస్థాయి త్రిసభ్య కమిటీ మంగళవారం బొకారో నుంచి విశాఖ చేరుకుంది.

కమిటీ వివరాలు.. మంత్రితో భేటీ

సెయిల్ (బొకారో) డైరెక్టర్ ఇన్‌ఛార్జ్ ప్రియారంజన్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. ఇందులో సెయిల్ సీజీఎం జితేంద్రకుమార్, మాజీ సీజీఎం గోపాల్‌సింగ్‌లు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ మంగళవారం సాయంత్రం కేంద్రమంత్రి శ్రీనివాసవర్మతో ప్రత్యేకంగా భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు, క్షేత్రస్థాయి నివేదికలపై లోతుగా సమీక్షించనున్నారు. మరోవైపు, ఈ దుర్ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి స్పష్టం చేశారు.

ప్రమాద నేపథ్యం..

కాగా, సోమవారం స్టీల్‌ ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌-2, ఎస్‌టీసీ-3 హీట్‌ ఎఫ్‌జీ వద్ద స్టీల్‌ మెటల్‌ లిక్విడ్‌ ల్యాడిల్‌ భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో ఉక్కుద్రవం లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు సజీవదహనం కాగా, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Next Story