నిజంగా నువ్వు చంద్రబాబు వారసుడివైతే నాపై పోటీ చేసి గెలువు

by Disha Web Desk 21 |
నిజంగా నువ్వు చంద్రబాబు వారసుడివైతే నాపై పోటీ చేసి గెలువు
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు దమ్ముంటే తనపై ఎంపీగా పోటీ చేసి గెలుపొందాలని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ సవాల్ విసిరారు. లోకేశ్‌ అనే పప్పుశుద్ధను చూసి రాష్ట్ర ప్రజలంతా నవ్వుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. అలాంటి అజ్ఞాని, రాజకీయాల్లో కమెడియన్ ఎంపీల గురించి పదే పదే విమర్శలు చేస్తున్నాడు అని మండిపడ్డారు. లోకేశ్‌కు ధైర్యం ఉంటే తనపై ఎంపీగా పోటీ చేసి గెలుపొందాలని ఛాలెంజ్ చేశారు. నన్ను రీల్స్ అంటున్నావ్..నువ్వు చంద్రబాబు వారసుడివైతే నాపై పోటీ చేసి గెలువు. నువ్వు హీరోవో..నేను హీరోనో తెలుస్తుంది అని ఎంపీ మార్గాని భరత్ సవాల్ విసిరారు. ఢిల్లీలో ఎంపీ మార్గాని భరత్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్లు మీరు బీజేపీతో అంటకాగారు కదా..అప్పుడేం ఏం చేశారు..? అసలు నీకు ఏ అర్హత ఉందని, మీ తండ్రి హయాంలో మూడు శాఖలకు మంత్రిగా చేశావు..? వారసత్వం ఉందని రాష్ట్రానికి మంత్రి అయ్యి, చివరికి రాజకీయాల్లో ఒక జోకర్ గా మిగిలావు అని సెటైర్లు వేశారు. వైసీపీ ఎంపీలు బెస్ట్‌ ఎంపీలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సైతం ప్రశంసించారు. దేశం మొత్తంలో ఏపీకి నేషనల్‌ హైవేస్‌ విషయంలో అధికంగా నిధులు తీసుకొచ్చాం. గతంలో మీ ఎంపీలంతా రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు’ అని లోకేశ్‌పై మార్గాని భరత్ ధ్వజమెత్తారు.

ఏపీకి జరిగిన అన్యాయంపై గళమెత్తుతాం

పార్లమెంటులో జరగబోయే అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీకి జరిగిన అన్యాయంపై గళమెత్తుతాం అని ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. దేశం అంతా మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించే విధంగా తామంతా మాట్లాడతాం అని చెప్పుకొచ్చారు. పది మంది ఎంపీలతో ఏపీ రీఆర్గనైజేషన్‌ అమెండ్‌మెంట్‌ బిల్‌–2023ను ప్రైవేటు మెంబర్‌ బిల్లుగా ప్రవేశ పెట్టబోతున్నాం అని చెప్పుకొచ్చారు. విభజన హామీల అమలుకు సంబంధించిన ప్రైవేటు మెంబర్ బిల్లును గతంలో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టారు అని చెప్పుకొచ్చారు. అయితే ఆ బిల్లు ఫైనాన్స్ తో ముడిపడిన అంశం కావడం వల్ల లోక్ సభలోనే ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ నేపథ్యంలో తాము ఆ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టాం అని చెప్పుకొచ్చారు. ఈ ప్రైవేటు మెంబర్‌ బిల్లులో ప్రత్యేక హోదా డిమాండ్‌ను ప్రధానంగా ముందు పెడుతున్నాం అని చెప్పుకొచ్చారు. పోలవరం నిధులకు సంబంధించి... ప్రాజెక్టు ఆథారిటీ సవరించిన అంచనాలపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ అంచనాలను ఆమోదించాలనే డిమాండ్‌ ఈ బిల్లులో ఉండబోతోంది అని చెప్పుకొచ్చారు. మరో వైపు వైసీపీ లోక్ సభా పక్ష నాయకుడు మిథున్‌ రెడ్డి కూడా పోలవరంపై మరొక ప్రైవేట్‌ మెంబర్‌ బిల్‌ కూడా పెట్టారు. అది ఇవాళ టేబుల్‌ అవుతోంది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548 కోట్లు ఆమోదించాలని ఆయన ప్రత్యేకంగా ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును పెట్టారు అని ఎంపీ మార్గాని భరత్ వెల్లడించారు.

ఢిల్లీ క్యాపిటల్‌ బిల్లుపై టీడీపీ వారిది గోడమీద పిల్లవాటం

నేషనల్‌ క్యాపిటల్‌ అమెండ్‌మెంట్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని ఈ బిల్లుకు వైసీపీ మద్దతు ఇచ్చిందన్నారు. ఇదే సందర్భంలో ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వారి స్టాండ్‌ ఏమిటో కూడా చెప్పకుండా గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నారు అని విమర్శించారు. ప్రతిపక్షాలన్నీ వాకౌట్‌ చేస్తే.. వారు మాత్రం సభలో కూర్చుని ఉన్నారు. ఇదే సమయంలో ఆ బిల్లుపై వారి వైఖరి ఏమిటో దేశానికి తెలియజేయాలి. కానీ కనీసం వారు లోక్‌సభలో దానిపై మాట్లాడను కూడా లేదు అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కేటగారికల్‌గా ఏపీ అప్పుల గురించి స్పష్టం చేసింది అని స్పష్టం చేశారు. పొద్దున లేస్తే టీడీపీ ఎంపీలు, ఒక శిఖండి ఎంపీ కలిసి, ఏపీ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అని ఎంపీ మార్గాని భరత్ ధ్వజమెత్తారు. దీని కోసం పార్లమెంటులో అడ్డగోలు ప్రశ్నలు వేస్తూ సెల్ఫ్‌ గోల్‌ వేసుకుంటున్నారు. వీరు వేసిన ప్రశ్నలకు కేంద్రం సమాధానంతో వీళ్ళ దిమ్మ తిరుగుతుంది అని ఎంపీ మార్గాని భరత్ ఎద్దేవా చేశారు.

Next Story