పొగడ్తలతో పొట్ట నిండేనా.. లీడర్లను చేస్తామంటూ ఆర్భాటపు ప్రకటనలు

by Disha Web Desk 9 |
Ys Jagan
X

రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు కళ్లూ, చెవులూ వలంటీర్లే. స్థానిక ప్రభుత్వాలను పక్కన పెట్టేశారు. వైసీపీ సర్కారు వచ్చాక నియమించిన సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల వ్యవస్థతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అందుకే వలంటీర్లకు వందనమంటూ పొగడ్తలతో పురస్కారాలను అందజేస్తున్నారు. వాస్తవానికి వలంటీర్లు అడుగుతుందేంటీ? కేవలం ఐదు వేల గౌరవ వేతనంతో ఎన్నాళ్లు బతకాలి? ఎదుగూబొదుగూ లేకుండా ఇంకెన్నాళ్లు చేయాలి? జీవితంలో స్థిర పడేది ఎప్పుడనే ఆక్రోశం నెలకొంది. సీఎం జగన్​ వలంటీర్లను లీడర్లను చేస్తామని ప్రకటించారు. అంటే ఎమ్మెల్యే, నామినేటెడ్​ పోస్టులు ఇస్తారా! ఎంతమందికి ఇస్తారనేది వలంటీర్లలో చర్చనీయాంశమైంది.

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ దేశ వ్యాప్తంగా ప్రశంశలు అందుకుంది. కరోనాలాంటి విపత్తుల సమయంలో వలంటీర్లు అందించిన సేవలు శ్లాఘనీయం. దాదాపు 26 రకాల సంక్షేమ పథకాలకు క్షేత్ర స్థాయిలో అర్హులను ఎంపిక చేసే కీలక పాత్ర పోషిస్తున్నారు. వీధుల్లో చెత్త పేరుకుంటే వలంటీరుకు ఫోన్​ వస్తుంది. తాగు నీటి సరఫరాలో ఇబ్బందులుంటే వలంటీరు అక్కడ వాలిపోతాడు. చివరకు కరెంటు పోయినా జనం వలంటీరుకే కాల్​ చేస్తారు. చౌక బియ్యం అందకపోయినా వలంటీర్లు ముందుంటారు. ప్రభుత్వం మంజూరు చేసే ధ్రువపత్రాల కోసం వలంటీర్లే దరఖాస్తు పెట్టిస్తారు. ఇలా ప్రతి 70 కుటుంబాలకు ఓ వలంటీరు చొప్పున మొత్తం 2.66 లక్షల మంది సేవలు అందిస్తున్నారు. ఆయా కుటుంబాలకు తలలో నాలుకలా మారిపోయారు.

పదోన్నతులు ఉండవు..

ఎక్కడైనా కొందరు పథకాల లబ్దిదారుల వద్ద చేతివాటం ప్రదర్శించినా ఈ అవినీతిని మొత్తం వ్యవస్థకు ఆపాదించడం సరైంది కాదు. ప్రభుత్వం వాళ్లకు ఇస్తున్న గౌరవ వేతనం కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే. రోజుకు కొన్ని గంటలే పనిచేసేది అని ప్రభుత్వం చెప్పినా ఆచరణలో ప్రతి పనికీ వలంటీరే ముందుండాల్సి వస్తోంది. ఈ కొద్దిపాటి వేతనంతో ఎన్నాళ్లు పనిచేయాలి ? జీవితంలో స్థిరపడేది ఎప్పుడనే ఆక్రోశం వలంటీర్లలో నెలకొంది. ఈ వ్యవస్థలో ఎంత చిత్తశుద్దితో పనిచేసినా పదోన్నతి అంటూ ఏమీ ఉండదు. మా భవిష్యత్తు ఏమిటో అర్థం కావడం లేదని తెలిసిన వాళ్ల దగ్గర వాపోతున్నారు. వలంటీరుగా నిర్ణీత కాలం పని చేస్తే ఎంతోకొంత ఎదుగుదల ఉండాలని ఆశిస్తున్నారు.

అవార్డులతో జీవితాలు మారతాయా?

వలంటీర్ల వ్యవస్థపై తొలుత ప్రతిపక్ష టీడీపీ కారాలు మిరియాలు నూరింది. తర్వాత నాలిక్కరుచుకొని వలంటీర్ల భవితకు బాటలు వేస్తామని చెబుతోంది. గతంలో వలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. కొందరు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇలా ఎంతకాలం చాకిరీ చేయాలని ఆందోళన వెలిబుచ్చారు. పరిస్థితులు చేయిదాటి పోతున్నాయని సీఎం జగన్​ గ్రహించారు. వలంటీర్లకు పురస్కారాలను ప్రకటించారు. ప్రతి ఏటా వజ్ర సేవ అవార్డు కింద రూ.30 వేలు, సేవారత్న కింద రూ.20 వేలు, సేవా మిత్ర ద్వారా రూ.10 వేలు అందిస్తున్నారు. ఇందులో 99 శాతం వలంటీర్లకు దక్కేది పది వేలు మాత్రమే. దీంతో తమ జీవితాల్లో ఏం మార్పు వస్తుందని పెదవి విరుస్తున్నారు.

ఇకనైనా పట్టించుకోండి..

వలంటీర్లలోని ఆక్రోశాన్ని గుర్తించిన సీఎం జగన్ వాళ్లను లీడర్లుగా ఎదిగేటట్లు ప్రోత్సహిస్తామని ప్రకటించారు. అంటే పార్టీలో పదవులు ఇస్తారా లేక ప్రభుత్వంలో నామినేటెడ్​ పదవులు ఇస్తారా అనేది చర్చించుకుంటున్నారు. నిర్ణీత కాలంపాటు వలంటీరుగా సేవలందిస్తే నాయకుడిగా ఎలాంటి గుర్తింపునిస్తారనేది అటు పార్టీ శ్రేణుల్లోనూ చర్చకు వస్తోంది. ఒకవేళ నామినేటెడ్​ పదవులు ఇచ్చినా ఎంతమందికి ఇవ్వగలరనే ప్రశ్న తలెత్తుతోంది. లక్షల సంఖ్యలో ఉన్న వలంటీర్ల భవిష్యత్తుకు ఓ భరోసా కావాలని కోరుకుంటున్నారు. అలాంటి ఆలోచన చేయకుండా నాయకులుగా ఎంతమందికి అవకాశం కల్పిస్తారనేది వలంటీర్లలో చర్చనీయాంశమైంది. ఇప్పటిదాకా తమ భవితకు జగనన్న ఏదో ఒకటి చేస్తారనే ధీమాతో ఉన్నారు. ఎన్నికల ఏడాదిలోనైనా వలంటీర్ల వ్యవస్థకు ఓ దిక్సూచి చూపాలని కోరుకుంటున్నారు.

Read more:

Naralokesh: యువగళానికి అడ్డొస్తే సైకో సైన్యానికి సినిమా చూపిస్తాం



Next Story

Most Viewed