Janasena ఎలా బరిలోకి దిగితే పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంది?

by Disha Web Desk 22 |
Janasena ఎలా బరిలోకి దిగితే పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంది?
X

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ ఆవిర్భవించి 8 ఏళ్లు గడుస్తున్నా ఆ పార్టీ సంస్థాగతంగా ఇంకా బలోపేతం కాలేదు. గ్రామాల్లో కనీసం బలమైన క్యాడర్ కూడా లేని పరిస్థితి జనసేనది. ఈ దశలో టీడీపీ- వైసీపీ లాంటి ప్రధాన పార్టీలకు ధీటుగా పోటీకి నిలవలేకపోతోంది. కనీసం మూడో ప్రధాన పార్టీగా కూడా ప్రజలు గుర్తించడం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆయన ఎప్పుడు ఏ పార్టీతో చేతులు కలుపుతారో ఆయనకే తెలియదని, ఏపీ రాజకీయ పార్టీల్లో వైసీపీతో తప్ప దాదాపు అన్ని పార్టీలను కవర్ చేశారని విమర్శలు ఉన్నాయి. ఇక వైసీపీతో చేతులు కలిపితే రాజకీయ పార్టీగా జనసేన రికార్డు సృష్టించినట్లే అని జోకులు కూడా వేసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ పొత్తుల విషయంలో జనసేనకు ఇప్పటికీ క్లారిటీ లేదనే చెప్పాలి.

ఇటీవల మంత్రి అంబటి రాంబాబు జనసేన పార్టీపై తీవ్రంగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పోటీకి దిగుతారో లేదో చెప్పాలని ప్రశ్నించారు. అయితే దీనిపై క్లారిటీ ఇవ్వని జనసేన నేతలు.. పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో ముందు చెప్పండి అంటూ ఎదురుదాడికి దిగారు. అంబటి చేసిన ప్రశ్న సమాధానం చెప్పదగినదే అయినా జనసేన మాత్రం మౌనం వహించింది. దీన్ని బట్టి చూస్తే పవన్ ఏదో ఆశిస్తున్నారని అర్థమవుతుంది. ఇందుకేనేమో పవన్ ప్రతిసారీ తన బహిరంగ సభల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనిచ్చేది లేదంటూ తేల్చి చెబుతున్నారు. దీన్ని గమనిస్తే పవన్ మరొకరితో పొత్తు కోసం ఎదురు చూస్తున్నారని అర్థమవుతుంది. బీజేపీతో పవన్ పొత్తులో ఉన్నారంటూ కమలం నేతలు తరచూ వ్యాఖ్యానిస్తున్నారు. కానీ పనన్ మాత్రం ఆ పార్టీతో మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.. అందుకు నిదర్శనం బీజేపీ కార్యక్రమాలకు పవన్ హాజరుకాకపోవడం.

అలాగే అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ కు వచ్చిన మోదీని కూడా కలవలేదు. దీనికి కారణం కూడా లేకపోలేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తన ప్రత్యర్థి జగన్‌తో మోదీ సన్నిహితంగా మెలుగుతున్నారని రాష్ట్రంలో పరిణామాలను గమనిస్తే వైసీపీ బీ పార్టీగా బీజేపీ వ్యవహరిస్తుందని అందుకే పవన్ బీజేపీకి దూరంగా ఉంటున్నారని రాజకీయ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో జనసేన గత ఎన్నికల్లో 6 శాతం ఓట్లు, ఒక అంసెబ్లీ స్థానాన్ని మాత్రమే గెలిచింది. ఈ సారి ఎన్నికల్లో పొత్తు లేకుండా పోటీ చేస్తే జనసేన ఘోరంగా నష్టపోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుని కొన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే జనసేన గెలిచే అవకాశం ఉందని ఆ పార్టీని కూడా గెలిపించే అవకాశం ఉందని సర్వేలు ఉద్ఘాటిస్తున్నాయి



Next Story