విజయవాడలో హై అలర్ట్... తూ.గో.లో 144 సెక్షన్

by Seetharam |
విజయవాడలో హై అలర్ట్... తూ.గో.లో 144 సెక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, ఏసీబీ కోర్టు తీర్పు వంటి పరిణామాల నేపథ్యంలో విజయవాడలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఏసీబీ కోర్టులో స్కిల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కాంపై వాదనలు ముగిశాయి. ఇక తీర్పు మాత్రమే వెల్లడించాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో విజయవాడ ఏసీబీ కోర్టుకు భారీగా టీడీపీ శ్రేణులు తరలివస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు రోడ్లెక్కి నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఏసీబీ కోర్టు దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా ఏసీబీ కోర్టు వద్దకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. పోలీసు ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు.

తూర్పుగోదావరిలో ఆంక్షలు

ఇదిలా ఉంటే తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు ఆంక్షలు విధించారు.144 సెక్షన్ అమలులో ఉన్నట్లు ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రిమాండ్ విధిస్తారనే ప్రచారం జరిగింది. రిమాండ్ విధిస్తే చంద్రబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు ప్రకటించారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొనసాగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తుగా ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed