Ap News: ఏపీ రాజధాని అమరావతే

by srinivas |
Ap News: ఏపీ రాజధాని అమరావతే
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. అమరావతి ఎప్పటికైనా చారిత్రకమైన రాజధానిగా నిలిచిపోతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రిటైర్డ్ డీఎస్పీ బొప్పన విజయ్ కుమార్ సంకలనం చేసిన 'అజరామరం మన అమరావతి' పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రైతుల త్యాగాలకు ధీటుగా, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక సర్వోత్తమమైన రాజధానిగా అమరావతిని ఎంపిక చేసుకుని, అసెంబ్లీ భవనాలు, హైకోర్టు భవనాలు, సచివాలయ భవనాలు, సీడ్ యాక్సిస్ రోడ్డు, దానికి అనుగుణంగా ఇతర రహదారులు నిర్మించుకుంటే ఇప్పుడీ పెద్దమనిషి వచ్చి రాజధానిని ముక్కలు చేస్తానంటే మనం నోరుమూసుకు కూర్చోకూడదని పిలుపునిచ్చారు. భూములిచ్చిన రైతుల ఆవేదనని ఏమాత్రం పట్టించుకోని ఈ ముఖ్యమంత్రి రైతులు, ప్రజల ఉసురు తగిలి ఇంటికి పోయే సమయం వచ్చేసిందన్నారు. ఈ పెద్దమనిషి పిచ్చి చేష్టల వల్లే ఏపీలో భూముల ధరలు నేలమట్టమయ్యాయని చెప్పారు. బొప్పన విజయ్ కుమార్ అనారోగ్యంతో బాధ పడుతున్నప్పటికీ ఈ పుస్తకాన్ని పట్టుదలతో తీసుకొచ్చారన్నారు. నాలుగేళ్ళ అమరావతి ఉద్యమాన్ని, అమరావతి రైతుల ఆకాంక్షల్ని, ఆవేదనల్ని, ఇబ్బందుల్ని, అణచివేతల్ని ఈ పుస్తకంలో పొందుపరిచారన్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యుజేఎఫ్) నాయకులు ఎస్.వెంకట్రావు, జి.ఆంజనేయులు, బి.శ్రీనివాస్, కలిమిశ్రీ, శాంతిశ్రీ, బి.యన్. ప్రసాద్, గొట్టిపాటి. నాగేశ్వరరావు, జిలాని, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

Next Story