అన్నమయ్య జిల్లా ఘటన వీడియో పై తీవ్రంగా స్పందించిన గజ్జల లక్ష్మి

by Jakkula Mamatha |
అన్నమయ్య జిల్లా ఘటన వీడియో పై తీవ్రంగా స్పందించిన గజ్జల లక్ష్మి
X

దిశ , రాయచోటి: ఆస్తుల పంపకం వృద్ధ తల్లిదండ్రులకు శాపంగా మారింది. కన్నకొడుకే కాలయముడిలా మారాడు. నవమాసాలు మోసి, కని పెంచిన తల్లిదండ్రుల పైనే అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు. వృద్ధ దంపతుల్ని నోటికొచ్చినట్లు అసభ్యకరమైన బూతులు తిడుతూ ఇష్టానుసారంగా చేతులతో పిడిగుద్దులు గుద్దుతూ.. కాళ్లతో ఎగిరెగిరి తన్నిన ఓ కొడుకు ఉన్మాదంపై రాష్ట్ర మహిళా కమిషన్‌ సీరియస్‌ అయ్యింది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆదివారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యి మహిళా కమిషన్‌ దృష్టికొచ్చింది. తక్షణమే స్పందించిన మహిళా కమిషన్‌ సభ్యురాలు శ్రీమతి గజ్జల లక్ష్మి జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. అనంతరం మదనపల్లె టౌన్‌ సీఐ యువరాజ్‌తోనూ మాట్లాడి.. వృద్ధ తల్లిదండ్రుల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించి దాడి చేసిన ఘటనపై సీరియస్‌గా స్పందించాల న్నారు.

సభ్యసమాజం తలదించుకునేలా క్రూరంగా దాడిచేసిన వైనంపై వీడియో వైరల్‌ కావడాన్ని చర్చించారు. దీనిపై సీఐ యువరాజ్‌ మాట్లాడుతూ.. మదనపల్లి టౌన్‌లోని అయోధ్య నగర్‌ ఏరియాలో ఆస్తి పంపకాల నేపథ్యంలో తనకు సరైన న్యాయం చేయలేదని లక్ష్మమ్మ, వెంకటరమణారెడ్డి దంపతులపై వారి చిన్న కొడుకు శ్రీనివాస్ రెడ్డి దాడికి పాల్పడినట్లు శనివారం బాధితులు ఫిర్యాదిచ్చారని చెప్పారు. వెంటనే ఆ ఫిర్యాదు పై కేసు నమోదు చేశారు. బాధిత తల్లిదండ్రులను ప్రభుత్వ ఆస్పత్రికి కూడా తరలించి చికిత్స చేయిస్తున్నామని మహిళా కమిషన్‌ సభ్యురాలు గజ్జల లక్ష్మికి ఆయన వివరించారు.

దాడికి పాల్పడిన వ్యక్తిని తక్షణమే అరెస్టు చేసి.. రిమాండ్‌కు పంపి.. అతనికి తగిన బుద్ధి చెప్పాలని ఆమె పోలీసులను కోరారు. అదేవిధంగా స్థానిక ఆర్డీవోతో కూడా ఆమె మాట్లాడి సీనియర్‌ సిటిజన్‌ యాక్టు కింద వృద్ధ తల్లిదండ్రుల రక్షణ, భద్రతతో పాటు వారి పోషణకు సంబంధించిన ఏర్పాట్లుపై మానవీయ కోణంలో తక్షణ స్పందన అవసరమని గజ్జల లక్ష్మీ చెప్పారు. ఆస్తుల పేరిట కన్న తల్లిదండ్రులను వేధించే కర్కశ కొడుకులకు తగిన గుణపాఠం చెప్పే విధంగా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని పోలీసు, రెవెన్యూ అధికారులను గజ్జల లక్ష్మి కోరారు.



Next Story

Most Viewed