ప్రొద్దుటూరులో నెగ్గేదెవరో! తగ్గేదెవరో!

by Mahesh |
ప్రొద్దుటూరులో నెగ్గేదెవరో! తగ్గేదెవరో!
X

దిశ ప్రతినిధి, కడప: పసిడిపురిగా ప్రసిద్ధిగాంచిన ప్రొద్దుటూరు టికెట్ రేసు ఉత్కంఠ భరితంగా మారింది. నాలుగు స్తంభాలాటలా నలుగురు నేతలు టిక్కెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తుండడంతో ఎవరికి పసుపు జెండా దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. నెల రోజులు లోపే ఎన్నికల నోటిఫికేషన్ రానున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ జిల్లాలో ఒకటి రెండు చోట్ల మినహా పార్టీ టికెట్లపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆశావహుల్లో అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి నియోజకవర్గాల్లో ప్రొద్దుటూరు అసెంబ్లీ టికెట్ వ్యవహారం ఉత్కంఠ గా మారడమే కాదు, అధిష్టానానికి తలనొప్పిగా, ఎన్నికల వేళ అసంతృప్తులకు దారి తీసేలా మారింది.

ప్రయత్నాల్లో ఆశావహులు

ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీలో టికెట్ రేసులో ఉన్న నలుగురిలో ఎవరు నెగ్గుతారు, ఎవరు తగ్గుతారు అన్న చర్చ బెట్టింగ్‌లదాకా సాగుతోంది. అసెంబ్లీ నియోజకవర్గ నుంచి టిక్కెట్ ఆశిస్తున్న వారిలో సీనియర్ నాయకుడు ,మాజీ శాసనసభ్యులు నంద్యాల వరదరాజులరెడ్డి, మరో మాజీ శాసనసభ్యులు మల్లెల లింగారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సోదరుడు సీఎం సురేష్ లు ఉన్నారు. వీరిలో ఇన్చార్జిగా ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి టికెట్ తనకే అన్న ధీమాతో ఉన్నారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి అండదండలు బాగా ఉన్నాయని చెప్పవచ్చు.

నంద్యాల వరద రాజుల రెడ్డి టికెట్ తనకే వస్తుందన్న నమ్మకంతో పార్టీ కార్యక్రమాలు చేపడుతూ, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని, అధికార పార్టీని ఎండగడుతూ టికెట్ రేసులో తన ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. మరో మాజీ ఎమ్మెల్యే, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి టికెట్ తనకే కావాలని గట్టిగా పట్టుబడుతున్నారు. ఇప్పటివరకు అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తామని చెప్పలేదని, టికెట్ తనకే కేటాయించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వీరే కాకుండా పొద్దుటూరులో కొన్ని నెలలుగా ఉచిత అన్నదానం చేస్తూ వస్తున్న సీఎం సురేష్ నాయుడు టికెట్ ఆశావహుల్లో ఉన్నారు. ఈ నలుగురు ప్రొద్దుటూరు టికెట్ కోసం కోసం చేస్తున్న ప్రయత్నాలు ప్రొద్దుటూరు దేశం రాజకీయలను వేడెక్కిస్తున్నాయి.

సర్వేలే ప్రామాణికమా..

తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు టికెట్ కోసం ఎవధీమాలో వారు ఉన్నా, అధిష్టానం సర్వేలే ప్రమాణికంగా అభ్యర్ధిని ఖరారు చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఒకరిద్దరు నేతలు తమకున్న గాడ్ ఫాదర్ ల ద్వారా టిక్కెట్టు దక్కుతుందనే ధీమాతో ఉన్నట్లు తెలిసింది. అయితే జరగబోయే ఎన్నికల తెలుగుదేశం పార్టీకి అత్యంత క్లిష్టతరంగా మారిన నేపథ్యంలో గాడ్ ఫాదర్లు, సిఫార్సులకు టికెట్ కేటాయిస్తే మొదటికే మోసం వస్తుందన్న అభిప్రాయాలు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదిలా ఉండగా, ఇటీవల టికెట్ పై ధీమాతో ఉన్న ఒక నాయకుడు, ఆయనకు అనుకూలంగా ఉండే మరో నేతతో కలిసి పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే అక్కడ కూడా చంద్రబాబు నాయుడు టికెట్‌పై సర్వేలు ఉంటాయని, ఇప్పుడు ప్రతి సీటు పార్టీకి ప్రాణ ప్రతిష్ట లాంటిదని చెప్పినట్లు సమాచారం. టిక్కెట్ ఆశిస్తున్న మరో నాయకుడుకు చెందిన వారు చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అమర్నాథరెడ్డిని కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో అధిష్టానం ఎవరికి టిక్కెట్ కేటాయిస్తున్నది అన్నదానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

సర్దుకు పోతారా! సమస్యగా మారుతారా!

ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆశావహుల్లో ఏ ఒక్కరికి టికెట్ లభించిన మిగతా వారి పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకరిద్దరి మధ్య అంతంతమాత్రంగా సంబంధాలు కొనసాగినా నలుగురి మధ్య సఖ్యత కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో టికెట్ ఖరారు చేసిన అభ్యర్థితో మిగతా ముగ్గురిలో ఎవరు సర్దుకుపోతారు. ఎవరు సమస్యగా మారుతారు అన్నది పార్టీకి తలభారమే అవుతుంది.



Next Story

Most Viewed