ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంది: ఉండవల్లి అరుణ్ కుమార్

by Web Desk |
ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంది: ఉండవల్లి అరుణ్ కుమార్
X

దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ఉండవల్లి అరుణ్ కుమార్ స్వాగతించారు. అయితే విభజనకు కాంగ్రెస్‌తోపాటు బీజేపీ కూడా కారణమని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో అసలు ఏం జరిగిందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రధాని నరేంద్రమోడీయే చెప్తున్నారని మరి ఈ అంశంపై లోక్‌సభలో వైసీపీ ఎంపీలు నిలదీయాలి కదా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన అంశంపై చర్చకు వైసీపీ ఎంపీలు పట్టుబట్టాలని సూచించారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను సాధిస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం వల్లే నేడు వైసీపీ అధికారంలోకి ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు. దేశ చరిత్రలో ఇంత మెజారిటీ వచ్చిన పార్టీల్లో వైసీపీ ఒకటి అని చెప్పుకొచ్చారు. ఇకనైనా వైసీపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో పోరాటం చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు.

ఇక వచ్చేవన్నీ గడ్డు రోజులే..

వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను పరిశీలిస్తే ఆందోళన కలుగుతుందన్నారు. భవిష్యత్‌లో రాష్ట్ర ప్రజలు గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకునేందుకు కేంద్రం దగ్గర కూడా ఏమీ లేదన్నారు. కేంద్రం దగ్గర ఏముందో అన్నది ఇటీవల బడ్జెట్ చూస్తే తెలిసిపోతుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియడం లేదన్నారు. రాష్ట్రం గడ్డు పరిస్థితి ఎదుర్కోకుండా ఉండేందుకు సీఎం వైఎస్ జగన్ దగ్గర ఏమైనా సీక్రెట్ ఉంటే అది బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఇలాంటి తరుణంలో తన దగ్గర ఉన్న సీక్రెట్ బయటపెడితే ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకుంటారంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అసలు తెలియడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. నిరసనలు, ఆందోళనలతోనే సగం రోజులు గడిచిపోయాయని విమర్శించారు. ఉద్యోగుల జీతాల గొడవేంటో తెలియడం లేదని విమర్శించారు. జీతాలు పెరిగాయని ప్రభుత్వం అంటుంటే.. లేదు తగ్గాయని ఉద్యోగులు అంటున్నారు. మరోవైపు అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ బయటపెట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అవి బయట పెట్టకుండానే చర్చలు సఫలమయ్యాయని చెప్పారు. కమిటీ రిపోర్ట్ లేకుండానే చర్చలు ఫలించాయని చెప్పడం విడ్డూరంగా ఉంది. అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్‌ను ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడం లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు.

మే నెలలో ఇక తట్టుకోలేం

రాష్ట్రంలోని సమస్యలపై ప్రస్తావిస్తున్న తరుణంలో పవర్ పోయింది. దీంతో ఎప్పుడు కరెంట్ ఉంటుందో అనేది తెలియడం లేదని రాష్ట్రంలో కరెంట్ కోతలు ఎడాపెడా వాయించేస్తున్నారంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. కరెంట్ కోతలపై అడిగితే బొగ్గుకు డబ్బుల్లేవని చెబుతున్నారని.. ఫిబ్రవరిలో కోతలంటే ఏప్రిల్, మే లో పరిస్థితుల్ని ఊహించుకుంటే భయమేస్తోందన్నారు. ఇక ఉక్కపోత తప్పదని చెప్పుకొచ్చారు. ఇప్పటికే బహిరంగ మార్కెట్‌లో యూనిట్ ధర రూ.4గా ఉంటే ఏప్రిల్ నెలకు వచ్చే సరికి యూనిట్ ధర రూ.16 దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ అన్ని సమస్యలను సీఎం వైఎస్ జగన్ ఎలా అధిగమిస్తారోనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పెద్ద వ్యాపార వేత్త అంటూ సెటైర్లు వేశారు. వైఎస్ జగన్ చేసిన వ్యాపారాల్లో విజయం సాధించారని మరి.. ఈ రాష్ట్రం అనే వ్యాపారాన్ని ఎలా నడుపుతారో అంటూ సెటైర్లు వేశారు. ఇప్పటికీ చంద్రబాబు నిర్ణయాల వల్లే ఇలాంటి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందని సీఎం జగన్ ఇక చెప్పడం కట్టిపారేయ్యాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పడం వల్లే ప్రజలు జగన్‌ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడండి..

రాష్ట్రంలోని వైసీపీ ఎంపీలు ఇకనైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. వైసీపీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉందని.. ప్రజల బలం ఉందని అలాంటప్పుడు ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. లోక్‌సభలో చర్చకు నోటీసులు ఇస్తే ఎవరైనా చంపేస్తారా? అని నిలదీశారు. ఎందుకంత ఉదాసీనంగా ఉంటున్నారని వైసీపీ ఎంపీలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నిలదీశారు. రాష్ట్రంలోని ఎంపీలను గెలిపించి తనకు ఇస్తే ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానని ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పారని.. నిజమేమోనని నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఇప్పటి వరకు ప్రత్యేక హోదా సాధించలేకపోయారని అన్నారు. ఈ అంశంపై ప్రజలు చర్చించుకుంటున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే అడగలేని పరిస్థితుల్లో వైసీపీ ఎంపీలు ఉండటం దురదృష్టకరమన్నారు. అన్యాయం జరిగిందని.. అన్యాయం చేసిన వ్యక్తే నిండు సభలో చెప్తుంటే దానిపై చర్చకు ఎందుకు పట్టుబట్టడం లేదన్నారు. తమకేం పట్టనట్లు వైసీపీ ఎంపీలు వ్యవహరిస్తుండటం సరికాదని ఉండవల్లి హితవు పలికారు. మోడీ అంటే ఎందుకంత భయమని నిలదీశారు. విభజన హామీలపై ఎందుకు పోరాటం చేయడం లేదని చెప్పుకొచ్చారు. అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు అయ్యిందని ఇలాంటి సందర్భంలోనే చర్చకు పట్టుబట్టాలని ఉండవల్లి అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు.

పోలవరం బాధ్యత కేంద్రానిదే..

తెలుగు ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ బుర్రలో తొలిచిన ప్రాజెక్టు అని.. దాన్ని ఎంతసేపు పూర్తి చేయాలి.. రైతులకు ఎప్పుడు నీళ్లివ్వాలి అని వైఎస్ఆర్ పరితపించేవారని ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు. వైఎస్ఆర్ ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టును ఆయన తనయుడు వైఎస్ జగన్ పూర్తి చేస్తాడని అంతా భావిస్తున్నారని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ఇచ్చిన బిల్లులు ఆపేస్తున్నారని దీనిపై వైసీపీ ఎందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు బాధ్యతను నాడు చంద్రబాబు తామే పూర్తి చేసుకుంటామని తీసుకోవడం పెద్ద పొరపాటని చెప్పుకొచ్చారు. ఈ పొరపాటు వైఎస్ జగన్ కూడా చేస్తున్నారన్నారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాలని.. ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. పోలవరం కట్టాల్సిన బాధ్యత జగన్‌కు ఎందుకు.. బాధ్యత కేంద్రానిదేనని గంటా పథంగా చెప్పుకొచ్చారు. సీఎం వైఎస్ జగన్‌కు ప్రజాబలం ఉందని ఇలాంటి తరుణంలో ప్రజల కోసం పోరాడాలే తప్ప రాంగ్ స్టెప్పులు వేయడం సరికాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హితవు పలికారు.

Next Story

Most Viewed