మాజీమంత్రి నారాయణ వైట్‌ కాలర్‌ క్రిమినల్ : అనిల్ కుమార్ యాదవ్

by Disha Web Desk 21 |
మాజీమంత్రి నారాయణ వైట్‌ కాలర్‌ క్రిమినల్ : అనిల్ కుమార్ యాదవ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీమంత్రి నారాయణపై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు. ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో సీఐడీ విచారణకు వెళ్లే ఓపిక లేదు కానీ...టీడీపీ దీక్షా శిబిరాలను విజిట్‌ చేయడానికి మాత్రం ఓపిక ఉందా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే తీరిక ఉందా నారాయణ..? అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఐఆర్ఆర్ కేసులో స్పష్టమైన ఆధారాలతో సీఐడీ విచారణకు హాజరుకావాలని కోరితే మాజీమంత్రి నారాయణ తప్పించుకొని తిరుగుతున్నాడని మండిపడ్డారు. అబద్ధాలతో న్యాయస్థానాలను సైతం మోసం చేస్తున్నాడని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ విరుచుకుపడ్డారు. నెల్లూరులోని తన కార్యాలయంలో డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ గురువారం మీడియాతో మాట్లాడారు. సీఐడీ విచారణకు రమ్మంటే జబ్బులు వచ్చాయి, వయసు మీదపడిందని, స్పెషల్‌ కేర్‌ అంటూ కోర్టులకు అబద్ధాలు చెబుతూ తప్పించుకొని తిరుగుతున్నాడని మండిపడ్డారు. సర్జరీలు చేసుకుంటే విశ్రాంతి తీసుకోవాలి కానీ, రెండు మూడురోజులకోసారి మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తారా..? అని మండిపడ్డారు. టీడీపీ దీక్షా శిబిరాలను సందర్శిస్తారా..? ప్రభుత్వాన్ని విమర్శించే తీరిక ఉన్న నారాయణకు.. విచారణకు వెళ్లే ఓపిక లేదా అని నిలదీశారు. మాజీమంత్రి నారాయణ అబద్ధాలతో కోర్టులను తప్పుదోవపట్టిస్తున్నాడని మండిపడ్డారు. మరోవైపు ఓటర్ల ప్రక్రియపై తెలుగుదేశం పార్టీ మోసాలకు పాల్పడుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీమంత్రి నారాయణ కాలేజీలను అడ్డం పెట్టుకొని వందలాది ఓట్లను చేరుస్తున్నారని ఆరోపించారు. నారాయణ కాలేజీ స్టాఫ్‌పై కూడా కేసులు పెడతామని అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు. ఓట్లు తొలగిస్తున్న అసలు దొంగలు టీడీపీ వాళ్లేనని చెప్పుకొచ్చారు. నారాయణ వైట్‌ కాలర్‌ క్రిమినల్‌ అని, రైతుల నుంచి వందల కోట్ల రూపాయలు దోచుకున్నాడని ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు.

Next Story

Most Viewed