అసమ్మతిపై ఫోకస్.. కన్నాకు కీలక బాధ్యతలు!

by Disha Web Desk 4 |
అసమ్మతిపై ఫోకస్.. కన్నాకు కీలక బాధ్యతలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీకి కృష్ణా, గుంటూరు జిల్లాలు ఒకప్పుడు కంచుకోట. కానీ 2019 ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. అమరావతిని చంద్రబాబు నాయుడు రాజధానిగా ప్రకటించినప్పటికీ ఆ ప్రాంత ప్రజలు వైసీపీకి జై కొట్టారు. దీంతో వైసీపీ అధికారంలోకి రావడం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి రావడంతో ఆ ప్రాంతంలో రైతులు ఆందోళన చెందారు. ఇప్పటికీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు.

అయినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం వైసీపీకి పట్టంకట్టారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోస్టుమార్టం నిర్వహించారు. అయితే పార్టీలోని నేతల మధ్య అసమ్మతిపోరు.. ఆధిపత్యపోరులే పార్టీని బలహీనం చేస్తోందని గమనించారు. ఇందులో భాగంగా అనేకసార్లు హితబోధ చేసినప్పటికీ ఎవరికివారే యమునా తీరే అన్న చందంగా తయారైంది.

అమరావతి రాజధాని ప్రాంత ప్రభావం అటు ఉమ్మడి గుంటూరు ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తున్నప్పటికీ ఆ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకోవడంలో టీడీపీ నాయకత్వం ఫెయిల్ అయ్యిందని గుసగుసలు వినిపించాయి. దీంతో కన్నా లక్ష్మీనారాయణకు చంద్రబాబు ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కన్నా విజయవాడలోని బుద్ధా వెంకన్న నివాసంలో పార్టీ కీలక నేతలతో అల్పాహార విందులో పాల్గొన్నారని తెలుస్తోంది.

అనుభవానికి బాధ్యతలు

మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాల్లో సీనియర్. అనేకమంది ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేశారు. అంతేకాదు గుంటూరు, కృష్ణా జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సైతం ఉంది. ముఖ్యంగా కాపు కులం నుంచి మంచి మద్దతు కూడా ఉంది. అలాంటి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడంతో చంద్రబాబు ఫుల్ జోష్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

కన్నా చేరిక సందర్భంగా వేదికపై పెదకూరపాడులో కన్నా లక్ష్మీనారాయణను ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశామని అయితే ఆయన ఎత్తుల ముందు చిత్తైపోయినట్లు బాహటంగా ప్రకటించారు. దీంతో పార్టీలో కన్నా లక్ష్మీనారాయణకు మంచి గుర్తింపు దక్కే అవకాశం ఉందని అంతా భావించారు. ఇందులో భాగంగా కన్నాకు చంద్రబాబు అప్పుడే పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. గుంటూరు-కృష్ణా జిల్లాలోని టీడీపీలో నెలకొన్న అసమ్మతిని చక్కదిద్దాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

అధినేత ఆదేశాలతో రంగంలోకి..

తెలుగుదేశం పార్టీలో చేరిన కన్నాకు చంద్రబాబు కృష్ణా, గుంటూరు జిల్లాలలోని పార్టీ బలోపేతంతో పాటు వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందేలా ప్రణాళికలు రచించాలని కన్నా లక్ష్మీనారాయణకు సూచించినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు, సత్తెనపల్లి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో కన్నాకు పట్టుంది. అలాగే కృష్ణా జిల్లా రాజకీయాల్లో కూడా ప్రత్యేక అనుచర గణం ఉంది.

ఈ నేపథ్యంలో ఈ రెండు జిల్లాలలో పార్టీలోని లుకలుకలను సరిదిద్దేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఫోకస్ పెట్టాలని చంద్రబాబు ఆదేశించారనే ప్రచారం జరుగుతుంది. అధినేత ఆదేశాలతో కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం అందుకు ముహూర్తం పెట్టి రంగంలోకి దిగారని ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగానే టీడీపీ నేత బుద్ధా వెంకన్న నివాసంలో పార్టీకి చెందిన నేతలతో భేటీ అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

సాధారణంగా కొత్తగా పార్టీలో చేరిన వాళ్లు ఆయా జిల్లాల్లోని కీలక నేతలు, ఆ తర్వాత రాష్ట్ర నేతలతో మర్యాదపూర్వకంగా భేటీ అవ్వడం సహజం. కానీ కన్నా లక్ష్మీనారాయణ అందుకు భిన్నంగా వ్యవహరించారు. విజయవాడలో పార్టీలో దూకుడుగా ఉంటూ అసమ్మతి వర్గంగా ఉన్న బుద్ధా వెంకన్న అండ్ టీంతో కలవడం సంచలనంగా మారింది.

విజయవాడలో కుమ్ములాట

విజయవాడ తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు తీవ్రస్థాయిలో ఉంది. ఆ కుమ్ములాటల మహత్యమే స్దానిక సంస్ధల ఎన్నికలు, నగర పాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమికి కారణమని తెలిసిందే. చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగి ఇరువర్గాలతో భేటీ అయినా నేతల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. విజయవాడ ఎంపీ కేశినేని నాని వర్సెస్ బొండా ఉమా, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా, కేశినేని చిన్నిలుగా రాజకీయం మారిపోయింది.

నానికి వ్యతిరేకంగా వీరంతా రాజకీయం చేస్తుండటం పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణకు బుద్ధా వెంకన్న, కేశినేని చిన్ని, నాగుల్ మీరాలతో భేటీ కావడం చర్చకు దారి తీసింది. బుద్ధా వెంకన్న ఇంట్లో అల్పాహారం తీసుకున్న నేతలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. సీనియర్ పొలిటీషియన్ అయిన కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరినందుకు కేశినేని చిన్నా ధన్యవాదాలు తెలిపారు.

సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. కన్నా లక్ష్మీనారాయణ అనుభవంతో అందరూ కలిసి పని చేస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఈ రాక్షస పాలనను తరిమి కొట్టి.. ప్రజా పాలన అందిస్తామన్నారు. చంద్రబాబు సారధ్యంలో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని కేశినేని చిన్ని చెప్పుకొచ్చారు.

నేను ప్రజా నాయకుడిని : కన్నా లక్ష్మీనారాయణ

వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలన అందిస్తుందని మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అప్రజాస్వామిక విధానాలతో ముందుకు వెళ్తుందని ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపైనా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ప్రజలు సైతం సన్నద్ధంగా ఉన్నారని అందుకే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

అయితే ప్రజలంతా టీడీపీ-జనసేన పొత్తను ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మరోవైపు ప్రజా సమస్యలపై ప్రస్తావిస్తే ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని మండిపడ్డారు. ప్రతిపక్షం లేవనెత్తే ప్రజా సమస్యలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలే కానీ సమస్యలు చెబితే ఎదురుదాడి చేసి అక్రమ కేసులు పెడతారా అని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు పోరాటం చేయలేని పరిస్థితి నెలకొందన్నారు.

రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజాస్వామ్యవాదులంతా ఏకమై పోరాడాలని కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. రాష్ట్రాభివృద్ధి, అమరావతి రాజధానిని దృష్టిలో పెట్టుకునే తెలుగుదేశం పార్టీలో చేరినట్లు మరోసారి స్పష్టం చేశారు. తనను కేవలం కుల నాయకుడిగా చూడొద్దని ప్రజల నాయకుడినని.. రాజకీయ నాయకుడినని కన్నా చెప్పుకొచ్చారు. మెుత్తానికి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ అసమ్మతి నేతలతో భేటీ కావడంతో వారి అసమ్మతికి ఎలాంటి మందు రాశారోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.



Next Story

Most Viewed