వైసీపీ బస్సుయాత్రకు సర్వం సిద్ధం.. ఏం చెప్పబోతుందంటే!

by Disha Web Desk 21 |
వైసీపీ బస్సుయాత్రకు సర్వం సిద్ధం.. ఏం చెప్పబోతుందంటే!
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతున్న బస్సుయాత్రకు రంగం సిద్ధం అయ్యింది. అక్టోబర్ 26 నుంచి ఈ బస్సు యాత్రను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ బస్సు యాత్రకు సామాజిక సాధికారత బస్సు యాత్రగా నామకరణం చేసినట్లు వెల్లడించారు.ఆదివారం ఉదయం విశాఖ బీచ్ రోడ్‌లోని వెల్కం హోటల్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. గతేడాది నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ , ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలును తెలుసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పడు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సామాజిక సాధికారత బస్సు యాత్ర పేరుతో అక్టోబర్ 26 నుండి నవంబర్ 9 వరకు మొదటి విడత బస్సు యాత్రను నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ప్రతీ రోజూ ఒక నియోజకవర్గంలో ఈ బస్సు యాత్ర ఉంటుందని చెప్పుకొచ్చారు. ఉదయం అంతా వైసీపీ చేసిన అభివృద్ధిని నియోజవర్గంలో ప్రజలకు వివరిస్తామని తెలిపారు. అయితే నియోజకవర్గం హెడ్ క్వార్టర్‌లో మధ్యాహ్నం బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

షెడ్యూల్ వివరాలివే

ఈ సామాజిక సాధికారత బస్సు యాత్రకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అక్టోబర్ 26న శ్రీకాకుళం జిల్లా ఇచ్చపురం నుండి ప్రారంభం అయి అక్టోబర్ 27 గజపతినగరం, అక్టోబర్ 28 భీమిలి, అక్టోబర్ 30 పాడేరు, నవంబర్ 1 పార్వతీపురం, నవంబర్ 2 మాడుగుల, నవంబర్ 3 పలాస, నవంబర్ 4 ఎస్.కోట, నవంబర్ 6 గాజువాక, నవంబర్ 7 ఆమదాలవలస, నవంబర్ 8 సాలూరు, నవంబర్ 9 అనకాపల్లిలో మొదటి విడత సామాజిక సాధికార బస్సు యాత్ర ముగుస్తుందని చెప్పుకొచ్చారు. ఈ బస్సు యాత్రలో నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడంతో పాటు రాష్ట్రంలో ప్రతి పక్ష పార్టీలు చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. దీపావళి అనంతరం రెండో విడత సామాజిక సాధికారత బస్సు యాత్ర ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో అనకాపల్లి ఎంపీ సత్యవతి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన్ని కృష్ణదాస్, వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ విప్ కరణం ధర్మ శ్రీ, ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు ,పెట్ల ఉమాశంకర్, కోలా గురువులు ఇతర నేతలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed