సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా..ఆందోళన వద్దు: ఎంపీ మోపిదేవి

by Disha Web Desk 21 |
సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా..ఆందోళన వద్దు: ఎంపీ మోపిదేవి
X

దిశ, డైనమిక్ బ్యూరో : రేపల్లె నియోజకవర్గం ఇన్‌చార్జి మార్పు విషయంలో వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నట్లు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు తెలిపారు. అధిష్టానం నిర్ణయానికి తాను కట్టబడి ఉన్నానని కాబట్టి కార్యకర్తలు కట్టుబడి ఉండాలి అని పిలుపునిచ్చారు. ఇన్‌చార్జి పదవి నుంచి తప్పించడంతో మోపిదేవి అభిమానులు, కార్యకర్తలు, మత్స్యకారులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోపిదేవి వెంకట రమణారావు స్పందించారు. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని వెల్లడించారు. కొన్ని టీవీ చానల్స్‌లో వస్తున్న వార్తలు వేరే నిర్ణయాలకి తావులేదు అని చెప్పుకొచ్చారు. అంత క్రమశిక్షణ లేని వ్యక్తిని కాదు అని మోపిదేవి వెంకట రమణారావు చెప్పుకొచ్చారు.

మళ్లీ వైసీపీదే అధికారం

ఎమ్మెల్యే అభ్యర్థి గ్రాఫ్ సరిగ్గా లేనప్పుడు కాకుండా కొన్ని ప్రత్యేక కారణాల వలన కూడా అధిష్టానం అభ్యర్థిని మారుస్తారు అని ఆ నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నట్లు ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు వెల్లడించారు. అలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలు, కిందిస్థాయి నాయకులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం సహజం.. అందర్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తాం అని తెలిపారు. అధిష్టానం ఏ అభ్యర్థినైతే సూచిస్తుందో ఆ అభ్యర్థికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో మరలా వైసీపీని అధికారంలోకి తీసుకు రావడానికి కష్టపడి పని చేస్తాను అని ఎంపీ మోపిదేవి వెంకటరమణా రావు క్లారిటీ ఇచ్చారు.

Next Story

Most Viewed