పిఠాపురం ఎమ్మెల్యేకు అధిష్టానం ఝ‌ల‌క్‌

by Disha Web Desk 16 |
పిఠాపురం ఎమ్మెల్యేకు అధిష్టానం ఝ‌ల‌క్‌
X
  • పీఏను పార్టీ ద‌రిదాపుల్లోకి ఉంచొద్దని మిథున్‌రెడ్డి ఆదేశం
  • అలా చేయ‌కుంటే చర్యలు తప్పవని హెచ్చరిక
  • ఢీలా ప‌డ్డ దొర‌బాబు.. నియోజ‌వ‌క‌ర్గం వైసీపీలో హాట్ టాపిక్‌

దిశ , కాకినాడ : పిఠాపురం పేరు చెబితే చాలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఎంతో చ‌రిత్ర ఉన్న నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపు కూడా ఓ ప్రత్యేక‌త. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో నేత‌ల తీరు ఒక ఎత్తైతే, వారి అనుచ‌ర‌గ‌ణం తీరు మ‌రో ఎత్తు. మ‌నం ఏం చేసినా చెల్లుబాట‌వుతుందిలే అనే మొండి నమ్మకం. తీరా మీద వ‌ర‌కూ వ‌స్తే చేతులేత్తేయ‌డ‌మే ప‌రిపాటి. ఇక విష‌యంలోకి వ‌స్తే పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నాయ‌నే వార్త దావ‌నంలా వ్యాపించింది. దొర‌బాబుకు పీఏగా ఉన్న వ్యక్తిని ఏకంగా పార్టీ అధిష్టాన‌మే ప‌క్కనపెట్టమ‌ని హెచ్చరిక‌లు జారీ చేసింది. అస‌లు ఏం జ‌రిగింది. పిఠాపురం ఎమ్మెల్యే దొర‌బాబుకు అధిష్టానం హెచ్చరిక‌ల వెనుక కార‌ణాలేంటి..వైసీపీ శ్రేణుల్లో సంబ‌రాలేంటి?

ప్రస్తుతం పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే పెండెం దొర‌బాబుకి గ‌డ్డుకాల‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే ఆయ‌నకు అత్యంత ప్రియ‌మైన, ఆయ‌న కుడి భుజంగా ఉన్న పీఏగా ఉన్న వీరంరెడ్డి చ‌క్రిని, వెంట‌నే ప‌క్కన పెట్టేయాల‌ని అధిష్టానం ఓ ఝ‌ల‌క్ ఇచ్చింది. ఉహించ‌ని ఈ సంఘ‌ట‌న కొద్ది రోజుల కింద‌ట జ‌రిగిన‌ప్పటికీ దొర‌బాబుకు అధిష్టానం ఆదేశాల‌ను అమ‌లు చేసి ఇప్పుడేం చేయాలో అన్న ఆలోచ‌న‌లో ప‌డ్డారు. త‌న ప‌ర్సనల్ సెక్రట‌రీగా, అన్ని విష‌యాలు తెలిసిన చ‌క్రిని ప‌క్కన పెట్టేయ‌డం దొర‌బాబుకు ఇసుమంత కూడా ఇష్టం లేదు. కానీ భ‌విష్యత్తు చూస్తే అంతా చీక‌టిగా మారిపోయినంత‌లా వైసీపీ పార్టీలో పెండెం దొర‌బాబు ప‌రిస్థితి ఉంద‌ని వైసీపీ కార్యక‌ర్తలే చెవులు కొరుకుంటున్నారు. తన చుట్టూ ఇంత చీక‌టి తేవ‌డానికి కార‌కులు పార్టీలో వ్యక్తులేనా అంటే, అవున‌నే స‌మాధానం. ఎవ‌రికి అన్యాయం జ‌రిగింది. ఎవ‌రికి ఇబ్బంది క‌లిగింది. ఓ పీఏ కోసం ఇంత‌లా పార్టీ అధిష్టానం చ‌ర్య‌ల‌కు ఉప‌క్రమించిందంటే పీఏ చేసిందేంటి.?

అస‌లు ఎవ‌రీ పీఏ చ‌క్రి..

2019లో ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున పెండెం దొర‌బాబు పోటీకి దిగారు. జ‌గ‌న్ గాలిలో విజ‌య‌దుంభిబి మోగించారు. ఎమ్మెల్యేగా ప‌గ్గాలు చేప‌ట్టిన దొర‌బాబు వ‌ద్ద‌కు ఆయ‌న అనుచ‌రులు కొంత మంది, కార్యాల‌యంలో ప‌నులు చూసుకునేందుకు, ఎమ్మెల్యేకు అధికారుల‌కు స‌మ‌న్వయం చేసేందుకు పీఏను ఎంపిక చేశారు. పిఠాపురం మండ‌లం జ‌ల్లూరుకు చెందిన వీరం రెడ్డి చ‌క్రి అనే యువ‌కుడు పీఏ పోస్టుకు ప‌ని చేస్తాడ‌ని దొర‌బాబు ముఖ్య అనుచ‌రులు కొంత మంది చెప్పడంతో వారి కోరిక మేర‌కు ఎమ్మెల్యే దొర‌బాబు త‌న పీఏ కింద చ‌క్రిని నియ‌మించుకున్నారు. చ‌క్రి ఉపాధి హామీలో ప‌థ‌కంలో చిరు ఉద్యోగిగా ప‌ని చేస్తున్నాడు. అక్కడి నుండి పీఏ ప‌గ్గాలు చేప‌ట్టిన‌ప్పటికీ, ఉపాధి హామీ ప‌థ‌కంలో ఇప్పటికీ జీతం తీసుకుంటున్నాడు. ఇలా మొద‌లైన ఇత‌డి రాక‌తో వైసీపీ సీన్ మొత్తం మారిపోయింది. ఏం ప‌నిచేయాల‌న్నా చ‌క్రి..ఎవ‌రు బ‌దిలీపై రావాల‌న్నా చ‌క్రి.. ఎమ్మెల్యే అడుగు తీస్తే చ‌క్రి..అడుగేస్తే చ‌క్రి అంత‌లా వ్యవహారం ఎమ్మెల్యే కంటే చ‌క్రి వైపే తిరిగింది. ఎమ్మెల్యే దొర‌బాబు ఓ సంత‌కం త‌ప్పితే , దాదాపు ఆయ‌న‌కున్న అధికారాల‌ను పీఏ చెంత‌కు చేరాయి. ఎమ్మెల్యే దొర‌బాబుకు ప్రభుత్వం కేటాయించిన అధికారిక పీఏ డ‌మ్మీ అయిపోయారు. అన్ని శాఖ‌లు పీఏ చ‌క్రి కింద‌కు వెళ్లిపోవ‌డంతో వైసీపీ శ్రేణులు కంగుతిన్నాయి.

అడుగ‌డుగునా అక్రమాలే..

ఎమ్మెల్యే దొర‌బాబు అండ చూసుకున్న పీఏ చ‌క్రి ఆడిందే ఆట‌. పాడిందే పాట‌. ఎమ్మెల్యే సొంత వ్యవ‌హారాల‌న్నింటికి చ‌క్రి ఒక్కడే దిక్కయ్యాడు. అధికారం చేతులో ఉంది. అన్నిశాఖ‌ల అధికారుల‌తో మంత‌నాలు, ఏం కావాల‌న్నా క్షణాల్లో అయ్యవారి ముందు వాలిపోవాలి. పోలీసు లేదు, రెవిన్యూ లేదు. అన్ని పంచాయ‌తీలు మొత్తం పీఏ ముందుండాలి. దీంతో రెచ్చిపోయిన పీఏ చాలా శాఖ‌ల అధికారుల‌తో ప‌లుమార్లు యుద్ధాలు కూడా తెచ్చిన సంద‌ర్బాలున్నాయి. లారీలు తోల‌కం ద‌గ్గర నుండి నియోజ‌క‌వ‌ర్గంలో ఇసుక ర‌వాణా, టెండ‌ర్లు ద‌గ్గర నుండి, మున్సిపాల్టీల్లో ప‌నుల కేటాయింపు, వాటాలా పంప‌కం ద‌గ్గర నుండి అన్నింటా చ‌క్రం తిరిగింది. పీఏ పై వ‌స్తున్న మ‌ర‌క‌ల‌న్నింటికి దొర‌బాబు కొండంత అండ‌గా నిలిచారు. ఎవరెన్ని చెప్పినా పీఏ చ‌క్రిపై ఈగ కూడా వాల‌నివ్వలేదు. కొన్ని సంద‌ర్భాల్లో అసాంఘిక కార్యక్రమాల‌కు డాన్‌గా మారిపోయార‌న్న ప్రచారం నియోజ‌క‌వ‌ర్గంలో బాగా పెరిగింది. దొర‌బాబు కుటుంబ‌సభ్యులు, ఆయ‌న ముఖ్య అనుచ‌రులు కూడా ఏం చేయ‌లేని స్థితికి ప‌రిస్థితి మారిపోయింది. ఇక చేసేది లేక వైసీపీ శ్రేణులు, దొర‌బాబు అభిమానులు, కార్యక‌ర్తలు చ‌క్రికి స‌రెండ‌ర్ అవ్వాల్సి వ‌చ్చింది.

చివ‌రికి ఏం జ‌రిగింది...?

పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ దెబ్బతినేలా ఉంది. జ‌గ‌న్ ప్రభావం మాట ప‌క్కన పెడితే , గ‌తంలో పార్టీకి క‌ష్టించి ప‌నిచేసిన‌ కార్యక‌ర్తలు ఢీలా ప‌డిపోతున్నారు. ఎమ్మెల్యేకు, నేత‌ల‌కు స‌మ‌న్వయం ఉండ‌టం లేదు. ఎమ్మెల్యే దొర‌బాబును క‌లిసి బాధ‌లు చెప్పుకోవాలంటే పీఏ చ‌క్రి అడ్డు. ఇక చేసేది లేక ఇటీవ‌ల కాకినాడ‌లో జ‌రిగిన వైసీపీ నేత‌ల స‌మావేశానికి హాజ‌రైన‌ ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల స‌మ‌న్వయక‌ర్త మిథున్‌రెడ్డికి మొత్తం వ్యవ‌హారం పూస గుచ్చిన‌ట్టుగా ఒక్కొక్కరు వివ‌రించారు. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వైసీపీ నేత‌లు. అప్పటికే అధిష్టానం వ‌ద్ద ఇంటిలిజెన్స్ నివేదిక ఉండ‌టం, వైసీపీ నేత‌ల నుండి పీఏ వైఖ‌రిపై పార్టీకి ఫిర్యాదులు చేసిన నివేదిక‌ల‌ను దొర‌బాబు ముందుంచ‌డంతో దొర‌బాబు షాక్ గుర‌య్యారు. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితి అంతంత మాత్రంగానే ఉంద‌న్న సంకేతాలతో, దిద్దుబాటు చ‌ర్యల్లో భాగంగా తొలుత పీఏ చ‌క్రిని త‌ప్పించాల‌ని మిథున్‌రెడ్డి స్వయంగా ఎమ్మెల్యే దొర‌బాబుకే చెప్పడంతో కంగుతిన్నారు. పీఏ చ‌క్రి చాలా మంచి కుర్రాడ‌ని స‌వ‌రించే ప్రయ‌త్నం చేసిన‌ప్పటికీ దొర‌బాబు మాట‌ల‌ను ప‌ట్టించుకోలేదు. మీ మంచికే చెబుతున్నాం, విన‌కుంటే మీ ఇష్టం, అని తేగేసి చెప్పడంతో మిథున్ రెడ్డి చెప్పిన‌ట్టే పీఏ చ‌క్రిని, అదే రోజు పీఏ విధుల నుండి తొల‌గించారు. భ‌విష్యత్తులోనూ అత‌డితో అంత‌ర్గత సంబంధాలు కొన‌సాగించిన‌ట్లు తెలిసినా తీసుకోబోయే చ‌ర్యల్లో వెనుకాడేదిలేద‌ని మిథున్‌రెడ్డి దొర‌బాబుకి చెప్పిన‌ట్లు కూడా తెలుస్తోంది.

పోలీసుశాఖ నివేదిక ప్రభావం కూడా

పిఠాపురంలో పీఏ చ‌క్రి ఆధ్వర్యంలో జ‌రుగుతున్న అక్రమాల‌పై ఎప్పటిక‌ప్పుడు ఇంటిలిజెన్స్ విభాగం దృష్టి పెట్టింది.పోలీసు కేసుల్లో త‌ల‌దూర్చడంతోపాటు ప‌లానా వారిపై కేసు పెట్టమ‌ని, ప‌లానా వారిని వ‌దిలేయ‌మ‌ని పోలీసుల‌పై అదే ప‌నిగా ఒత్తిడి తేవ‌డం, కేసుల పూర్వప‌రాల్లో త‌ల‌దూర్చడం, ల్యాండ్ సెటిల్‌మెంట్లు, ఉద్యోగాల‌కు సంబంధించి డ‌బ్బులు తీసుకోవ‌డం, కాంట్రాక్టర్లను బెదిరించ‌డం ఇలా ఒక్కటి కాదు చెప్పుకుంటూ పోతే ప్రతీ విష‌యాన్ని పోలీసులు ఉన్నతాధికారుల‌కు చేర‌వేశారు. ముఖ్యంగా పోలీసు బదిలీల్లో సైతం భారీగా డ‌బ్బులు డిమాండ్ చేయ‌డం, పోలీసు ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇంటిలిజెన్స్ ఐజీ స్థాయి అధికారి పిఠాపురం ప‌రిస్థితిపై ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చారంటే ఇక్కడ జ‌రిగిన త‌తంగం ఏ రేంజ్‌లో ఉందో వేరే చెప్పన‌క్కర్లేదు. ఇటీవ‌ల తాటిప‌ర్తి గ్రామంలో నిర్వహించిన డ్యాన్సు ప్రోగ్రాంలో క‌లిగిన ఇబ్బందుల‌పై పోలీసుల‌తో వాగ్వాదం కూడా పోలీసు ఉన్నతాధికారులు దృష్టిపెట్టే వ‌ర‌కూ వెళ్లింద‌నేది ఇక్కడ చ‌ర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద పీఏను సాగ‌నంప‌డంలో పోలీసుల నివేదిక కూడా ఉంద‌నే స్పష్టమ‌వుతోంది.


Next Story

Most Viewed