Yanamala: ఎడాపెడా కోతలు..అందుకే అంత కోపం

by srinivas |
Yanamala: ఎడాపెడా కోతలు..అందుకే అంత కోపం
X

దిశ,డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఇంటికి పంపించాలనే కసి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుందని ఆయన చెప్పారు. గత నాలుగేళ్లలో ఏపీలో అభివృద్ధి లేదని, పేదల సంక్షేమానికి ఎడాపెడా కోతలు కోశారని యనమల ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ స్కీములు 83 రద్దు చేశారు అని యనమల ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

టీడీపీపై అక్కసుతోనే పేదల స్కీముల రద్దు చేశారని యనమల మండిపడ్డారు. ఇచ్చింది గోరంత, ప్రచారం కొండంత అని ధ్వజమెత్తారు. నాలుగేళ్లలో ప్రజాధనం పెద్ద ఎత్తున స్వాహా జరిగిందని ఆరోపించారు. జగన్‌కు, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య అవినీతి రేసు ఉందని..ఈ రేసులో పోటీ బడి జనం సొమ్ము మింగేస్తున్నారని యనమల ధ్వజమెత్తారు. ప్రతి మంత్రిత్వశాఖలోనూ అవినీతి కుంభకోణాలేనని ఆరోపించారు. ‘‘దోచుకో, పంచుకో, తినుకో’’ జగన్ డీపీటీ విధానం అని మండిపడ్డారు. ఇంత ప్రజావ్యతిరేకత ఎదుర్కొన్న సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. ప్రతివర్గంలోనూ వైసీపీపై వ్యతిరేకతే ఉందని అన్నివర్గాల్లో జగన్ రెడ్డి బాధితులే ఉన్నారని యనమల చెప్పారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలంతా జగన్ బాధితవర్గాలేనని యనమల ధ్వజమెత్తారు. డా. సుధాకర్, డా అచ్చెన్న, దోమతోటి విక్రమ్, అబ్దుల్ సలాం, మిస్బా, మంత్రూబాయి వంటి ఎందరో ప్రాణాలను బలిగొన్నారని ఆరోపించారు. ‘శిరోముండనాలు చేశారు..భూములు ఆక్రమించారు, తోటలు నరికేశారు, ఇళ్లు ధ్వంసం చేశారు, గ్రామ బహిష్కరణలు చేశారు, చివరికి సజీవ దహనాలకు తెగబడ్డారు అని యనమల ఆరోపించారు. వైసీపీ వాళ్లు చేసిన ఘోరాలు-నేరాలే శాపాలై వెంటబడి తరముతున్నాయి.’ అని చెప్పుకొచ్చారు. వీళ్లందరిలో ‘సైలెంట్ రివల్యూషన్’ ఉందని వ్యాఖ్యానించారు. అందరిలో జగన్‌పై తీవ్ర అసంతృప్తి ఉందని.. కేసుల భయంతో బయటపడటం లేదని గుంభనంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఏపీలో జగన్‌ను సమర్ధించేవాళ్లు ఎక్కడా లేరని.. ఏ కులంలోనూ, ఏమతంలోనూ జగన్‌పై సానుభూతి లేదన్నారు. వైసీపీపై తీరని కసితో అన్ని వర్గాలు రగిలిపోతున్నాయన్నారు. సానుభూతికి దూరం కావడం జగన్ స్వయంకృతమే నని ఎద్దేవా చేశారు. జగన్ కోట పునాదులు బీటలిచ్చిందని..బీటలు వారిన వైసీపీ కోట కూలడం తథ్యమని యనమల హెచ్చరించారు. రష్యాలో జరిగిన తిరుగుబాటే రాష్ట్రంలోనూ తప్పదని, పుతిన్ పెట్టుకున్న గ్రూపే పుతిన్‌పై తిరగబడిందని..అలాగే జగన్ తయారు చేసిన మూకలే జగన్‌పై తిరుగుబాటుకు దిగుతాయని జోస్యం చెప్పారు.

విశాఖలో వైసీపీ ఎంపీ కుటుంబం కిడ్నాపే ఇందుకు నిదర్శనం అని అన్నారు. భస్మాసురుడి పరిస్థితే జగన్మోహన్‌రెడ్డికి వర్తిస్తుందని శాపనార్థాలు పెట్టారు. పదవి తెచ్చిన అహం, డబ్బు గర్వంతోనే జగన్ విర్రవీగడం..ఆ రెండింటితోనే ఆయన పతనం కూడా అని యనమల రామకృష్ణుడు అన్నారు.Next Story

Most Viewed