తాగడానికి నీళ్లు లేవు.. మళ్లీ డంపింగ్ యార్డు కడతారా?

by Disha Web Desk 16 |
తాగడానికి నీళ్లు లేవు.. మళ్లీ డంపింగ్ యార్డు కడతారా?
X
  • స్థానికులను అడగకుండా జియో ట్యాగ్ చేయడం ఏంటీ?
  • మంజేరులో పోరుబాట పట్టిన మహిళలు, రైతులు
  • కాకినాడ కలెక్టర్ కార్యాలయాన్ని నిర్బంధించేందుకు సన్నాహాలు

దిశ (కాజులూరు): గ్రామంలో తాగడానికి నీళ్లు లేవని, ఆర్టీసీ బస్సు సదుపాయం లేదని, ఈ సమస్యలను గాలికి వదిలేసి కంపోస్టు యార్డు కట్టడం దారుణమని మంజేరు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపోస్టు యార్డు కట్టడమే కాకుండా ప్రజలకు అంగీకారం లేని చోట్ల బలవంతంగా కట్టడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. మంజేరు గ్రామం శివారులో కంపోస్టు యార్డు కట్టడానికి పంచాయతీ తీర్మానించింది. అయితే అదే ప్రాంతంలో కూత వేటు దూరంలో పొలం మధ్యలో ఉన్న బావి నుంచి స్థానికులు దాహర్తి తీర్చుకొంటున్నారు. ప్రస్తుతం ఆ బావి ఒక రైతు పొలంలో ఉంది. అయితే ఆ రైతు అనుమతి నిరాకరిస్తే స్థానికులకు తాగడానికి నీళ్లు ఉండవు.

దీంతో స్థానికులు ఊరి చివరన బావి కట్టుకొనే ప్రయత్నంలో ఉన్నారు. సరిగ్గా అదే ప్రాంతంలో కంపోస్టు యార్డు కట్టడానికి పంచాయతీ తీర్మానించింది. అక్కడ కంపోస్టు యార్డు కడితే తమకు నీళ్లు ఎవరిస్తారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో ఇంకా చాలా ప్రదేశాలున్నాయని, వాటిని ఒదులుకొని ఇక్కడ కట్టడం ఏంటని నిలదీస్తున్నారు. ఈ విషయంపై పంచాయతీతో పోరాటానికి సిద్ధమయ్యారు. అయితే పంచాయతీ సిబ్బంది మాత్రం ససేమిరా అంటున్నారు. జియోట్యాగ్ అనుమతి వచ్చిందని.. తప్పని సరిగా కంపోస్టు యార్డు కట్టి తీరతామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు కాకినాడ కలక్టరేట్‌ను ముట్టడించే పనిలో పడ్డారు. సమస్య పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని అంటున్నారు.


Next Story

Most Viewed