ఆదమరిస్తే ముఖాలకు కూడా రంగులు వేస్తాడు.. ఈ పిచ్చోడు!

by srinivas |
ఆదమరిస్తే ముఖాలకు కూడా రంగులు వేస్తాడు.. ఈ పిచ్చోడు!
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయిందని.. ఇక గెలిచే అవకాశం లేద అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్‌ను ఇంటికి పంపుదామని 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో ఆయన పిలుపునిచ్చారు. సైకో పోవాలని...సైకిల్ రావాలని చంద్రబాబు నినదించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. బాదుడే బాదుడుతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాడని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర ప్రజలపై 45 రకాల పన్నులు వేసిన ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం అని విమర్శించారు. చివరికి చెత్తపైనా పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఇది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


సంక్షేమం పేరుతో రూ.10 ఇచ్చి రూ.50 కాజేస్తున్నారు..

సంక్షేమం పేరుతో రూ.10 ఇచ్చి మీ నుంచి రూ.50 కాజేస్తున్న ప్రభుత్వం గురించి మీరు తెలుసుకోవాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ ఎలా దోచేస్తున్నాడు అనేది ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. 'జగన్ ఒక రంగుల పిచ్చోడు....ప్రతి దానికీ జగన్ తన పార్టీ రంగులు వేసుకుంటాడని, మౌనంగా ఉంటే మీ ముఖాలకు కూడా రంగులు వేస్తాడంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'మీ భూములు సర్వే చేసి..జగన్ తన బొమ్మలు వేసుకుంటున్నాడు. జగన్ ఇప్పుడు ప్రజల ఇళ్లపై నువ్వే మా నమ్మకం అని కొత్తగా స్టిక్కర్‌లు వేస్తాడట. నువ్వే మా నమ్మకం కాదు..నువ్వే మా దరిద్రం అని ప్రజలు అంటున్నారు'. అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.


మహిళల అభ్యున్నతికి పాటుపడిన పార్టీ టీడీపీ

మహిళల అభ్యున్నతికి పాటుపడిన పార్టీ టీడీపీ అని.. మహిళలకు ఆస్థిహక్కు, విద్యారంగంలో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీ అని చంద్రబాబు స్పష్టం చేశారు. అంతేకాదు మహిళల కోసం ప్రత్యేకంగా పద్మావతీ యూనివర్సిటీ తెచ్చింది ఎన్టీఆర్.. డ్వాక్రా సంఘాలను ప్రోత్సహించి మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు స్పష్టం చేశారు. నేడు మహిళలు పురుషులకంటే ఎక్కువ సంపాదిస్తున్నారంటే అందుకు టీడీపీయే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు.

చంద్రబాబుకు ఘన స్వాగతం

అంతకుముందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన నిమిత్తం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబుకు జిల్లా పార్టీ నాయకత్వం ఘన స్వాగతం పలికింది. అనంతరం భారీ వాహన శ్రేణితో రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టు నుంచి జగ్గంపేటలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు.

Next Story

Most Viewed