భావోద్వేగాలకు గురికావొద్దు..25 మంది మృతి కలచివేస్తోంది: నారా లోకేశ్

by Disha Web Desk 21 |
భావోద్వేగాలకు గురికావొద్దు..25 మంది మృతి కలచివేస్తోంది: నారా లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘సత్యమే గెలుస్తుంది. అధైర్య పడకండి’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ టీడీపీ కార్యకర్తలు, అభిమానులకు సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆవేదనతో ఉన్నారన్న ఆయన అంతా ధైర్యంగా ఉండాలన్నారు. చంద్రబాబు అరెస్టు, రిమాండ్ పరిణామాలు చూసి తట్టుకోలేక 25 మంది ప్రాణాలు కోల్పోవడంపై లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కొందరు బలవన్మరణాలకు పాల్పడ్డారని అలాంటివి చేయోద్దన్నారు. ఈ మరణాలు తనను ఎంతోగానో బాధించాయని చెప్పుకొచ్చారు. రాజమహేంద్రవరంలో మంగళవారం లోకేశ్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు అధైర్య పడాల్సిన అవసరం లేదని...అంతిమంగా సత్యమే గెలుస్తుందని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టు అనేది జగన్ కక్ష పూరిత చర్య అని ఇప్పటికే దేశం అంతా గుర్తించిందని...అరెస్టుపై న్యాయం పోరాటం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అధారాలు లేని కేసుతో వైసీపీ ఆడుతున్న డ్రామాకు త్వరలో తెరపడుతుందని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఎవరూ భావోద్వేగాలకు గురికావద్దని లోకేశ్ మరోసారి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేసినా వైసీపీలో పైత్యం తగ్గలేదన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ శాంతి యుత నిరసనలు చేసిన వారిపైనా హత్యాయత్నం కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు.జగన్ ఫ్రస్టేషన్ కు, భయానికి ఈ కేసులే నిదర్శనం అని చెప్పుకొచ్చారు. శ్రీకాళహస్తిలో సోమవారం సామూహిక నిరాహార దీక్షకు దిగిన 16 మంది టీడీపీ నాయకులపై హత్యాయత్నం కేసు పెట్టి రిమాండ్ కు పంపించడంపై లోకేశ్ తీవ్ర ఆగ్రమం వ్యక్తం చేశారు. నిరాహార దీక్షలకు, దిష్టబొమ్మ దహనాలకు కేసులుపెట్టి రిమాండ్‌కు పంపే పరిస్థితి దేశంలో మరే రాష్ట్రంలో కూడా లేదని లోకేశ్ అన్నారు. సీఎం జగన్‌కు పసుపు జండా చూసినా...పసుపు దళం గళం విన్నా వెన్నులో వణుకుపుడుతుందని అందుకే ఈ కుట్రలు కుతంత్రాలకు తెరలేపారని లోకేశ్ అన్నారు.

Next Story

Most Viewed