తిన్నామా.. పడుకున్నామా..సస్పెండ్ అయ్యామా?

by Disha Web Desk 23 |
తిన్నామా.. పడుకున్నామా..సస్పెండ్ అయ్యామా?
X

దిశ, డైనమిక్ బ్యూరో : అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని రాష్ట్ర శాసన సభా వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. టీడీపీ సభ్యులకు చర్చతో పని లేదని వారికి కావాల్సిందే ప్రచారం మాత్రమేనన్నారు. కంటెంట్ వద్దు కెమెరాల ముందు నిరసనే కావాలి అని చెప్పుకొచ్చారు. మధ్యాహ్నం సస్పెన్షన్ అవడం..భోజనం తినడం, హాయిగా పడుకుని సాయంత్రం తీరిగ్గా ప్రెస్ మీట్ పెట్టి దుష్ప్రచారం చేయడం ఇవే పని విమర్శించారు. సభలో వాయిదా తీర్మానాలు ఏవేవో ఇవ్వడం, బ్యానర్లు, ప్లకార్డులు, వెల్‌లోకి ప్రవేశించడం ఇవన్నీ నారా వారి సృష్టేనంటూ ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన పై ప్రతిపక్షం వాయిదా తీర్మానం కోరడం హాస్యాస్పదం అని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.

సభలో మాట్లాడడానికేం లేకనే వితండవాదాలు, వింత వాయిదా తీర్మానాలు ప్రవేశపెడుతున్నారని బుగ్గన ఆరోపించారు. టిఫిన్ ఏం తిన్నారో చెప్పండి..లేదంటే వాయిదా తీర్మానం ఇస్తామని కూడా ప్రతిపక్షం కోరుతుంది అంటూ మంత్రి బుగ్గన సెటైర్లు వేశారు. దేశ చరిత్రలో సీఎం పర్యటనలపై వాయిదా తీర్మానం కోరింది ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతిపక్ష టీడీపీ మాత్రమేనని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు 30 సార్లు ఢిల్లీ వెళ్లిన విషయంపై కూడా చర్చిద్దామా అంటూ కౌంటర్ వేశారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనంతా రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ అంశాలు, పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలపైనేనని చెప్పుకొచ్చారు.

గత ప్రభుత్వం కేంద్రంతో నాలుగేళ్లు కలిసి ఉండి కూడా సాధించుకోలేని అంశాల పూర్తికే తమ ప్రభుత్వం కృషి చేస్తోందని బుగ్గన చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్ గా గుర్తించబడిన ప్పటికీ నిధులు తెచ్చుకోలేని వైనంపై ప్రతిపక్షం చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. పోలవరం నిర్మాణం అంచనాలు పెరగడంతో కావలసిన నిధులను సాధించుకునేందుకు ఢిల్లీకి వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. పరిమితికి మించి ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని అతిక్రమించి రూ.17వేల కోట్లు టీడీపీ చేసిన అప్పులపై చర్చకు ప్రతిపక్షం సిద్ధమా? అని చాలెంజ్ చేశారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం గత ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఆ ప్రభుత్వం చేసిన రూ.17వేల కోట్ల నిధులకు బదులు ప్రస్తుత ప్రభుత్వానికి నిధులు అందించాలని కోరడానికి సీఎం పర్యటన అని వివరణ ఇచ్చారు. ఏ ముఖ్యమంత్రైనా ప్రధాన మంత్రులను రాష్ట్ర ప్రయోజనాల గురించే చర్చిస్తారని కానీ 30 సార్లు ఢిల్లీకి వెళ్లిన మాజీ సీఎం చంద్రబాబు అక్కడ ఢిల్లీ పెద్దలతో వేరే విషయాలపై మాట్లాడారేమో! అంటూ బుగ్గన ఎద్దేవా చేశారు. జరగరాని సంఘటనలు , అనుకోని విపత్తులు వచ్చినప్పుడు వాయిదా తీర్మానాలిస్తారు కానీ ప్రతిపక్ష సభ్యులు అచ్చెన్నాయుడు వింత తీర్మానాలు ప్రవేశపెడుతున్నారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు.


Next Story

Most Viewed