నాగబాబు.. ఇదేం తంటా

by Mahesh |
నాగబాబు.. ఇదేం తంటా
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: నాగబాబు విశాఖ పర్యటన జనసేనలో విబేధాలకు చోటు కల్పిస్తోంది. పదేళ్లుగా పార్టీ జెండా మోస్తున్న వారిని, సీనియర్లను నాగబాబు పక్కన పెట్టడం వివాదంగా మారింది. కొండంత ఆశతో ఇటీవల పార్టీలో చేరిన ఉత్తరాంధ్ర సీనియర్ నేత కొణతాల రామకృష్ణకు అనకాపల్లిలో జరిగే పర్యటనకు నాగబాబు నుంచి ఆహ్వానం లేదు. ఆయన అనకాపల్లిలోనే ఉన్నా ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నాగబాబు చేసే నియోజకవర్గ సమీక్షలకు హాజరు కావడం లేదు.

నాగబాబు నుంచి ఆహ్వానం, సమాచారం లేకపోవడమే దీనికి కారణమని తెలిసింది. పదేళ్ల క్రితమే పార్టీలో చేరి అప్పటి నుంచి విశాఖ పార్టీ కార్యాయలం బాధ్యతలను చూస్తున్న రిటైర్డ్ ఉన్నతాధికారి శివశంకర్ మొన్నటి వరకు పెందుర్తి నియోజకవర్గ ఇన్చార్జి. పెందుర్తిలో గురువారం నాగబాబు నిర్వహించిన సమీక్షకు శివశంకర్ కు ఆహ్వానం అందలేదు. దీంతో ఆయన అనుచరులు సమావేశంలో గొడవకు దిగారు.

జనబలం లేని సతీశ్‌కే ప్రాధాన్యం

ఇటీవల పార్టీలో చేరిన వ్యాపారవేత్త సుందరపు సతీశ్‌కు జనబలం లేదు. గతంలో రాజకీయ నాయకులు కూడా కాదు. ఆయన సోదరుడు సుందరపు విజయ కుమార్ యలమంచిలి ఇన్చార్జి. ఆయన చేరిక సందర్భంగా విశాఖలో నిర్వహించిన సభకు జనం కరువయ్యారు. అయినా, ఆయనకే ప్రాధాన్యత లభిస్తుంది. 2009లో ప్రజారాజ్యం లో జరిగిన పొరపాట్లే నాగబాబు నేతృత్వంలో రిపీట్ అవుతున్నాయని జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చేరికల్లోనూ వివక్ష

మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు చేరడానికి వస్తుంటే నాగబాబు విముఖత చూపుతున్నారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేని వారిని, పోలీసు కేసులు ఉన్న వారిని చేర్చుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారని మండిపడ్డారు.

Read More : ఉత్తరాంధ్రపై మూడు పార్టీల ఫోకస్.. వైసీపీ ప్రభుత్వంపై ముప్పేట దాడి



Next Story

Most Viewed