వైసీపీ నుంచి బయటకు రాలేదు.. ఆనం సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
వైసీపీ నుంచి బయటకు రాలేదు.. ఆనం సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ నుంచి నేను తప్పుకోలేదని, కావాలనే తప్పించారని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశాంతంగా ఉండే మా ప్రాంతంలో మైనింగ్ దగ్గర నుంచి అంతా మాఫియా లాగా మార్చేసి దందాలు చేస్తు్న్నారని, దానిపై ప్రశ్నించినందుకు నన్ను కావాలనే పార్టీ నుంచి తప్పంచారన్నారు. ఆ సమయంలో నేనే బయటకి వచ్చానని తెలిపారు. అనర్హత నోటీస్ పై ఆనం, స్పీకర్ తమ్మినేని సీతారాంతో మరోసారి పర్సనల్ హియరింగ్ కు హాజరయ్యారు.

అనంతరం మాట్లాడుతూ.. మొదటిసారి హాజరైనప్పుడు చాలా వివరాలు అడిగారని, అవన్నీ చెప్పి, దానికి సంబందించిన పేపర్స్ కూడా ఇచ్చానని తెలియజేశారు. మీడియాలో ప్రచురించిన వాటిని చీఫ్ విప్ ప్రసాదరాజు ఆథరైజ్ చేసి ఇచ్చారని, వేరే మేనేజ్మెంట్ కు చెందినవి మీరెలా పరిగణలోకి తీసుకుంటారని ప్రశ్నించానని అన్నారు. అయిన ఆరోపించిన ప్రసాదరాజు ఆథరైజ్ చేస్తే వాటికి విలువెలా ఉంటుందని అడిగానన్నారు. అవేవీ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం సరిపోవని, వాటి ఆధారంగా మీరెలా వేటు వేస్తారని అడిగినట్లు చెప్పారు.

అంతేగాక రాజకీయ స్వార్ధం కోసం వైసీపీ స్పీకర్ స్థానాన్ని వాడుకుంటోందని, అయిన ఈ విషయంలో జరుగుతున్న పరిణామాలను స్పీకర్ కు మాత్రమే ఆపాదించలేమని అన్నారు. వైసీపీ వల్ల రాజకీయాలే గందరగోళంలోకి వెళ్లాయని ఆరోపించారు. తన పదవి కాలంలో చివరి రోజు సమావేశాలకు హాజరు కావడం తృప్తి నిచ్చిందన్నారు. కొన్ని రోజుల ముందు నిర్ణయం వచ్చి ఉంటే హాజరుకాలేకపోయేవాడినని, ఈ బాధ నన్ను వెంటాడేది అని ఆనం అన్నారు.

Next Story

Most Viewed