డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం ఆందోళనకరం: ఎంపీ విజయసాయిరెడ్డి

by Disha Web Desk 21 |
Vijayasai Reddy
X

దిశ,డైనమిక్ బ్యూరో : దేశ ఆర్థిక రంగం శరవేగంగా విస్తరిస్తున్న ఈ తరుణంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా అంతే వేగంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోందని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. 2022లో ఆసియా కరెన్సీలోకెల్లా మారకం విలువలో తీవ్ర ఒడిదుకులకు లోనైన కరెన్సీ రూపాయి... మొదటిసారిగా డాలర్‌తో రూపాయి మారకం విలువ 80 రూపాయలు దాటేసింది అని గుర్తు చేశారు. ప్రస్తుతం ఒక డాలర్‌కు రూపాయి విలువ 83 రూపాయల 40 పైసలకు చేరిందని అన్నారు. గడిచిన అయిదేళ్ళుగా రూపాయి మారకం విలువ ఇలా క్షీణిస్తూనే ఉందని చెప్పుకొచ్చారు. ముడి సరుకులు, ఆయిల్‌ దిగుమతులపై భారత్‌ భారీగా ఆధారపడినందున దీని ప్రభావం దేశంలోని ఉత్పాదక రంగంపై తీవ్రంగా పడిందని వ్యాఖ్యానించారు. రూపాయి మారక విలువ క్షీణత ప్రభావంతో ఉత్పాదక రంగం తీవ్ర ఒడిదుకులను ఎదుర్కొంటోందన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ గణాంకాల ప్రకారం రూపాయి మారక విలువ క్షీణతతో ద్రవ్యోల్బణం 15 బేసిస్‌ పాయింట్లు పెరిగి సామాన్యుడిపై మరింత భారం పడిందని చెప్పుకొచ్చారు. విదేశి మదుపుదార్లు భారత మార్కెట్ల నుంచి 18 బిలియన్‌ డాలర్లను వెనక్కి తీసుకున్నారన్నారు. 2008లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ఆర్థిక మాంద్యంలో భారత మార్కెట్ల నుంచి విదేశి మదుపుదార్లు వెనక్కి తీసున్న మొత్తం 12 బిలియన్‌ డాలర్లు మాత్రమేనని.. అంటే రూపాయి మారక విలువ క్షీణత దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి దుష్ప్రభావం చూపగలదో ఇంతకంటే ఉదాహరణ లేదని ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.

ఆదాయం, సంపద మధ్య పెరుగుతున్న అగాధం

దేశంలోని 60 శాతం సంపద దేశ జనాభాలో కేవలం 10 శాతం మంది చేతుల్లో ఉందన్నది కఠోర వాస్తవం అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. జనాభాలో 50 శాతం ప్రజల చేతుల్లో ఉన్న సంపద కేవలం 6 శాతం మాత్రమేనని అన్నారు. 2014 నుంచి తలసరి ఆదాయం రెట్టింపు అయి ఒక లక్షా 97 వేల రూపాయలకు చేరినప్పటికీ 197 దేశాల తలసరి ఆదాయంతో పోలిస్తే భారత్‌ 142వ స్థానంలో ఉండటం పట్ల విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశ వాణిజ్య లోటు గత అక్టోబర్‌లో రికార్డు స్థాయికి చేరిందన్నారు. చైనాతో వాణిజ్య లోటు నానాటికీ విస్తరిస్తూ ఆందోళకర స్థాయికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2022లో చైనాతో ఇండియా వాణిజ్య లోటు 83 బిలియన్‌ డాలర్లకు చేరిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేనాటికి అది 100 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నట్లు ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే మేల్కొని తగిన విధంగా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుందని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి హెచ్చరించారు.


Next Story

Most Viewed