ఉండేదెవరు? ఊడేదెవరు? మంత్రులకు జగన్ డిన్నర్

by Rajesh |
ఉండేదెవరు? ఊడేదెవరు? మంత్రులకు జగన్ డిన్నర్
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉగాది రోజు కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తుందనే వార్తలు వినిపించాయి. అయితే ఉగాదికి కాకుండా ఆ తేదీని ఏప్రిల్ 11కు మార్చినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ఈనెల 27న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుత మంత్రివర్గంలోని సభ్యులకు డిన్నర్ ఏర్పాటు చేశారు. డిన్నర్ అనంతరం పార్టీ భవిష్యత్ కార్యాచరణ, మంత్రి పదవులు కోల్పోయిన వారికి భరోసా ఇస్తారని తెలుస్తోంది. అనంతరం ఏప్రిల్ 11న కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. రెండున్నరేళ్ల తర్వాత మంత్రులను మారుస్తానని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాడే జగన్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఉన్న కేబినెట్ మంత్రులు కాస్త సమయం కోరడంతో అది కాస్త మూడేళ్లకు వాయిదా పడింది. అయితే ఇటీవల సీఎం జగన్ మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని తెలిపారు. ఈనెల 27న మంత్రివర్గం రాజీనామా చేస్తుందని, ఉగాదినాడు కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. ఏప్రిల్ 1న అమావాస్య కావడంతో ఆ తర్వాతి రోజున ఉగాది, అనంతరం ఆదివారం కావడంతో విస్తరణపై చర్చించే అవకాశం ఉండదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11న మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

మంత్రులందరికీ డిన్నర్

మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో మరో కీలక రాజకీయ పరిణామానికి తెరలేపారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ చాలా దూకుడుగా వ్యవహరించింది. మంత్రుల పనితీరుపై సీఎం జగన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీని సభలో మాట్లాడకుండా చేయడంతోపాటు రాజకీయంగా టీడీపీని వైసీపీ అసెంబ్లీలోనూ అటు మండలిలోనూ బలంగా ఢీ కొట్టిందని సీఎం జగన్ భావిస్తున్నారట. ఇదే ఊపులో మంత్రివర్గ విస్తరణపై కూడా ఓ నిర్ణయం తీసుకోవాలనే భావనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే శాసన సభాపక్ష సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం తన నివాసంలో మంత్రులందరికీ డిన్నర్ ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే రోజు కేబినెట్‌లో ఉండేదెవరో? ఊడేదెవరో తేల్చి చెప్పనున్నారట. ఈ నెల 27న సీఎం జగన్ డిన్నర్ ఇవ్వబోతున్నారని మంత్రులకు సీఎం వ్యక్తిగత సిబ్బంది తెలిపినట్లు సమాచారం. తనకు గత 34 నెలలుగా మంత్రులుగా సహకరించిన వారందరికీ పేరుపేరునా జగన్ ధన్యవాదాలు చెబుతూ వారికి భవిష్యత్తులో పార్టీ బాధ్యతలు అప్పగించే విషయాన్ని కూడా వివరిస్తారని తెలుస్తోంది. ఉద్వాసన పలికిన వారు పార్టీపై ఎలాంటి అసంతృప్తి వెళ్లగక్కకుండా ముందస్తుగానే సీఎం జగన్ వారిని ఊరడించి.. భవిష్యత్‌పై ఒక భరోసా ఇస్తారని తెలుస్తోంది. అనంతరం మంత్రుల నుంచి రాజీనామాలు తీసుకుంటారని తెలుస్తోంది. ఆ తర్వాత ఆ రాజీనామాలను గవర్నర్ బీబీ హరిచందన్‌కు పంపించి ఆమోదింపచేయిస్తారని రాజకీయ వర్గాల్లో టాక్. ఆ విధంగా పూర్తి స్థాయిలో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారని పొలిటికల్ సర్కిల్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుత కేబినెట్‌లో జగన్ కాకుండా 24 మంది మంత్రులు ఉన్నారు. అయితే వారిలో ఇటీవలే మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చెందగా మంత్రుల సంఖ్య 23కి తగ్గింది. ఇకపోతే మంత్రివర్గ విస్తరణ విషయానికి వస్తే ముగ్గురు లేదా ఐదుగురు సీనియర్లు మాత్రమే కేబినెట్‌లో కొనసాగుతారని తెలుస్తోంది.

ఈ సారి ఐదుగురు డిప్యూటీ సీఎంలే

కొత్త మంత్రివర్గంలో కూర్పులు గతంలో మాదిరిగానే ఉంటాయని తెలుస్తోంది. గతంలో మాదిరిగానే సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తారని తెలుస్తోంది. ఈసారి కూడా మహిళకే హోంశాఖ కట్టబెడతారని గుసగుసలు వినిపిస్తు్న్నాయి. అలాగే ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారని కూడా స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఈ కేబినెట్‌లో వచ్చే ఎన్నికలను ప్రభావితం చేయగల వారికి అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. మంత్రిగా తన శాఖలపై పట్టుండటంతోపాటు అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ప్రయోగించాల్సిన అస్త్రశస్త్రాలు సంధించే వారే కీలకంగా ఉంటారని వైసీపీ కార్యవర్గాల నుంచి సమాచారం అందుతోంది.

ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసిన సీఎం

ఇదిలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష సమావేశంలో మంత్రి వర్గ విస్తరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రకటించారు. అయితే కొందరు మంత్రులను కొనసాగిస్తానని ప్రకటించేశారు. గతంలో 100శాతం మంత్రులను మార్చేస్తారంటూ వార్తలు వినిపించాయి. ఈసారి మంత్రివర్గ విస్తరణ కాదని పునర్వ్యవస్థీకరణేనంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే వీటన్నింటిని పటాపంచెలు చేస్తూ సీఎం జగన్ తన నిర్ణయాన్ని ప్రకటించేశారు. 100శాతం మంత్రివర్గం మార్చడం లేదని కొందరు మంత్రులు ఉంటారని తేల్చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సందర్భంగా సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ ఇచ్చేశారు. మంత్రి పదవి నుంచి తప్పించిన వాళ్లు పార్టీ కోసం పని చేయాలని దిశానిర్దేశం చేశారు. మంత్రి పదవులు కోల్పోయిన వారు రెస్ట్ మోడ్‌లోకి వెళ్లొద్దని పార్టీ కోసం శ్రమించాలంటూ హితబోధ చేశారు. మంత్రి పదవి నుంచి తప్పించిన వారికి ఆయా జిల్లా ఇన్ చార్జి బాధ్యతలను అప్పగించనున్నట్లు సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇకపోతే పాతమంత్రులలో కొందరిని కొనసాగించే అవకాశం ఉందని సీఎం వైఎస్ జగన్ పేర్కొనడంతో ఉండేదెవరు? ఊడేదెవరంటూ చర్చ జరుగుతుంది. సీఎం వ్యాఖ్యలతో మంత్రుల్లో టెన్షన్ మెుదలైంది. ఎవరికి పదవీగండం ఉంటుందోనన్న ఆందోళన నెలకొంది. ఎవరు ఇన్.. ఎవరు ఔట్.. అంటూ సరికొత్త చర్చకు తెరలేపారు. ఆశావాహులు మాత్రం మంత్రి పదవుల కోసం అప్పుడే పైరవీలు మొదలుపెట్టేశారు. ఇంకొందరైతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం జగన్‌పై పోటీపడి మరీ ప్రశంసలు కురిపించారు. మెుత్తానికి ఏప్రిల్ 11న మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అప్పుడు కూడా వాయిదా పడితే ఇక జూలైలో మంత్రివర్గ విస్తరణ తథ్యం అని తెలుస్తోంది.

Next Story

Most Viewed