శ్రీశైలంలో ‘డేంజర్ బెల్స్’ సాగు, తాగు నీటికి ఇక్కట్లే

by Disha Web Desk 6 |
శ్రీశైలంలో ‘డేంజర్ బెల్స్’ సాగు, తాగు నీటికి ఇక్కట్లే
X

ఏపీ, తెలంగాణ ప్రాంతాలకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చే బహుళార్ధక సాధక ప్రాజెక్టులో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. పాలకుల పుణ్యమాని ప్రాజెక్టులో నీరు అడుగంటి డెడ్ స్టోరేజీకి చేరుకుంది. ఫలితంగా సాగు నీరేమోగానీ కనీసం తాగునీటికి కూడా ఇబ్బందులు పడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. విద్యుత్ ఉత్పత్తి పేరుతో ఇరు రాష్ట్రాలు ప్రాజెక్టులోని నీటిని తోడేయడంతో జలాశయంలో నీటి మట్టం క్రమంగా అడుగంటుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో రానున్న ఖరీఫ్ సీజన్ లో పంటలకు నీరందుతుందో ? లేదోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

దిశ, కర్నూలు ప్రతినిధి : శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంది. విద్యుత్ ఉత్పత్తి పేరుతో అటు తెలంగాణ, ఇటు ఏపీ ప్రభుత్వాలు ఇష్టానుసారంగా నీటిని తోడేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. పదేళ్లుగా ఇదే తంతు కొనసాగడంతో ఇరు రాష్ట్రాల రైతులు ఆందోళన చెందుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 805.90 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.810 టీఎంసీలు కాగా ప్రస్తుతం 31.97 టీఎంసీలే ఉంది. ప్రతి ఏడాదీ ప్రాజెక్టులో 854 అడుగుల నీటి మట్టాన్ని మెయింటెన్ చేయాలని బచావత్ ట్రిబ్యునల్ ఆదేశించింది. కనీసం 53 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా చూడాలని నిర్ణయించింది. కానీ రాష్ట్ర విభజన సమయం నాటి నుంచి ఏనాడు ప్రాజెక్టులో 854 అడుగుల నీటి మట్టం లేదు.

వరద నీరు సముద్రం పాలు

ప్రతి ఏటా 600 టీఎంసీల నుంచి 2 వేల టీఎంసీల వరకు వరద నీరు సముద్రంలో కలుస్తుంది. రాయలసీమ ప్రాంత పరిధిలో కృష్ణా నది వెంట ఎక్కడా నీటిని నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్లు లేకపోవడమే దీనికి కారణం.

రాయలసీమ ప్రాజెక్టులపై ప్రభావం

శ్రీశైలం జలాశయంపై ఆధారపడి రాయలసీమ ప్రాజెక్టులు గాలేరు నగరి, తెలుగుగంగ, హంద్రీనీవా, కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ కింద లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ముచ్చుమర్రి నుండి నీటిని నిలిపివేయగా, సుంకేసుల బ్యారేజీ నుంచి నీటిని అందిస్తున్నారు. రైతులు సుంకేసులలో 1.20 టీఎంసీల నీటి నిల్వలకుగాను, కర్నూలు దాహం నివారణ నిమిత్తం ఒక టీఎంసీ నీటిని నిల్వ చేశారు. ఇక ఎగువ నుంచి ప్రతి రోజూ 1200 క్యూసెక్కుల నీరు సుంకేసుల నుంచి వస్తుండగా కేసీ కాలువకు రబీలో పంటల కోసం అందిస్తున్నారు. ఈ నీరు నుంకేసుల నుంచి 140 కి.మీ బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు ప్రవహిస్తుంది. ఈ ఏడాది కేసీ కింద పంటలు దెబ్బతిన్న రైతులు శ్రీశైలం, తుంగభద్ర జలాల వినియోగంతో రెండో పంట ద్వారా గట్టెక్కవచ్చని భావించారు. ఉన్న నీటి నిల్వల లభ్యతను లెక్కించి ప్రణాళికతో ముందుకు వెళితే ఏప్రిల్ 15 వరకు నీరందే అవకాశం ఉంది. కానీ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తక్కువగా ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.



Next Story

Most Viewed