టెన్షన్..టెన్షన్ నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

by Dishanational2 |
టెన్షన్..టెన్షన్ నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
X

పట్టభద్రులు, ఉపాధ్యాయులు, స్థానిక సంస్థల ఎన్నికల ఘట్టం చివరి అంకానికి చేరుకుంది. పెద్దల సభకు ఎవరిని పంపాలో ఓటర్లు నిర్ణయించారు. బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉంచిన నేతల భవితవ్యం నేడు తేలనుంది. ఈ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓటు గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపనుంది. వైసీపీ నాయకులు రూ.5 వేల నుంచి రూ.10 వేలు పంచి ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే అంతిమంగా ఓటర్లు ఎవరికి పట్టం కడతారనే విషయం సందిగ్ధంగా మారింది. ఈ ఎన్నికలు అధికార పార్టీకి రానున్న ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

దిశ, కర్నూలు ప్రతినిధి : పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అధికార పార్టీ మద్దతుతో అనంతపురం జిల్లాకు చెందిన వెన్నపూస రవీంద్రారెడ్డి, టీడీపీ మద్దతుతో కడప జిల్లా పులివెందులకు చెందిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, పీడీఎఫ్, వామపక్షాల మద్దతులో పోతుల నాగరాజు, బీజేపీ మద్దతుతో నగరూరు రాఘవేంద్ర సహా 49 మంది పోటీలో ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికిఅధికార పార్టీ మద్దతుతో ఎంవీ రామచంద్రారెడ్డి, పీడీఎఫ్ మద్దతుతో కత్తి నరసింహారెడ్డి, ఏపీటీఎఫ్ మద్దతుతో ఒంటేరు శ్రీనివాసులరెడ్డి సహా 12 మంది పోటీలో ఉన్నారు. పీడీఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డికి టీడీపీ మద్దతు ఇచ్చింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో పట్టభద్రుల ఓటర్లు 3,30,367 మంది ఉన్నారు. 2,43,220 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 73.62 శాతం పోలింగ్ నమోదైంది. 87,117 మంది పట్టభద్రులైన యువత ఓటింగ్ కు దూరంగా ఉంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 28,043 మందికి నూ 25,884 మంది ఓటు వేశారు. 9230 శాతం పోలింగ్ నమోదైంది. 841 మంది ఉపాధ్యాయులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు

రెండో ప్రాధాన్యత ఓటు కీలకం

రెండో ప్రాధాన్యత ఓటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములకు అత్యంత కీలకం కానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పోలైన మొత్తం ఓట్లలో తొలి ప్రాధాన్యం కింద 50 శాతం ఓట్లు అదనంగా వస్తే ఆ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటిస్తారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 49 మంది బరిలో ఉన్నారు. 2,43,220 ఓట్లు పోలయ్యాయి. అందులో మొదటి ప్రాధాన్యం కింద 1,21,611 ఓట్లు వస్తేనే ఆ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. ఆ ఓట్లు రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను పరిగణనలోకి తీసుకొని ఎలిమినేషన్ పద్ధతిలో ఓట్లు లెక్కిస్తారు. 50 శాతంపైన అదనంగా ఒక ఓటు వచ్చేవరకు ఎలిమినేషన్ విధానంలో లెక్కించి విజేతను ప్రకటిస్తారు.

ఇప్పటి వరకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటుతో ఏ అభ్యర్థి కూడా గెలవలేదని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. నేడు చేపట్టనున్న ఓట్ల లెక్కింపులో రెండో ప్రాధాన్యత ఓటే గెలుపోటములకు కీలకం కానుందని అంటున్నారు. దీంతో టీడీపీ రెండో ప్రాధాన్యత ఓటు పీడీఎఫ్ అభ్యర్థికి వేయాలని చివరి క్షణంలో నిర్ణయం తీసుకోవడంతో ఆ ఓటే కీలకం కానుందని భావిస్తున్నారు. ఇది వైసీపీ నాయకులను ఆ భయం వెంటాడుతోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. పీడీఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఓట్ల లెక్కింపు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ను కర్నూలు జిల్లా కేంద్రంలోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో నిర్వహించనున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎన్నికల కౌంటింగ్ ను అనంతపురం జిల్లాలో చేపట్టనున్నారు.

జోరుగా బెట్టింగులు

కర్నూలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గెలుపు గుర్రాలపై బెట్టింగుల జోరు సాగుతోంది. ఒక పక్క నేతల్లో ఉత్కంఠ నెలకొంది. మరో వైపు గెలుపుపై ఎవరికి వారు బెట్టింగులకు పాల్పడుతున్నారు. అయితే ఎవరికి వారే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed