జగన్ కోటకు బీటలు.. ఎమ్మెల్యేల తీరుతో తలలు పట్టుకునే పరిస్థితి

by Dishanational2 |
AP CM Jagan Disburse Interest free loan to 3.95 Lakh Vendors Under Jagananna Thodu Scheme
X

దిశ, నెల్లూరు: నెల్లూరు జిల్లా వైసీపీ నేతల నుంచి ఆ పార్టీ అధిష్టానానికి తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెలూరు జిల్లా నుంచే ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి వ్యతిరేకంగా క్రాస్ ఓటింగ్ చేయడం చర్చనీయాంశమైంది. దీంతో వైసీపీ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. టీడీపీకి సరిపోయేంత బలం లేక పోయినా వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో టీడీపీకి కలిసొచ్చి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుంది. వైసీపీ తమ ఎమ్మెల్యేలతో క్యాంప్ రాజకీయాలు జరిపినా క్రాస్ ఓటింగ్ జరగకుండా అరికట్టలేక పోయింది. క్రాస్ ఓటింగ్ చేసిన వారిలో నెల్లూరు జిల్లా నుంచే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండడం గమనార్హం. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారని తెలిసింది. వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లా నుంచే తమ ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపించడంతో వైసీపీ అధిష్టానానికి తలలుపట్టుకునే పరిస్థితి తలెత్తింది.

గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్

గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో నెలూరు ఒకటి. ఈ జిల్లా మొదటి నుంచి వైసీపీకి కంచుకోటగా ఉంది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం వైసీపీనే దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. అటువంటి జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి ధిక్కార స్వరం వినిపించడంతో నేతల్లో గుబులు మొదలైంది. తమకు ఎంతో అనుకూలమైన జిల్లా నుంచే తమకు అసమ్మతి మొదలైందని వైసీపీ అధిష్టానానికి భయం పట్టుకుంది. మొన్న జరిగిన తూర్పు రాయలసీమ ఎన్నికల్లో కూడా నెల్లూరు జిల్లా పట్టభద్రులు వైసీపీపై ఉన్న వ్యతిరేకతను బయటపెట్టారు. దీనికి తోడు వరుసగా తమ ఎమ్మెల్యేలు కూడా దూరం కావడం వైసీపీకి మైనస్‌గా మారింది. ఇకనైనా పార్టీ అధిష్ఠానం నెల్లూరు విషయంలో జాగ్రత్త పడకపోతే కంచుకోట లాంటి నెల్లూరు జిల్లాలో పార్టీ నామరూపాల్లేకుండా పోయే చాన్స్ ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు.

ముగ్గురు నెల్లూరు ఎమ్మెల్యేలు సస్పెండ్

క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారిపై పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని అనుమానించిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంతర్గత విచారణలో వీరు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు నిర్ధారణ అయ్యిందని అందుకే వారిని సస్పెండ్ చేయడం జరిగిందని వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. సస్పెండ్ అయిన వారిలో నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. మరొకరు గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు.

ఎంతటి వారైనా ఎదురు నిలవడం నెల్లూరు నైజం

నెల్లూరు జిల్లా నేతలకు ధిక్కార స్వరాలు వినిపించడం కొత్తేంకాదు. వారెంతటివారైనా సరే చివరికి రాజకీయంగా జీవితం ఇచ్చినవారైనా సరే తిరగబడి ఎదురు నిలవడం నెల్లూరు నేతలకు వెన్నతోపెట్టిన విద్య. ఇప్పటి వరకు కాంగ్రెస్‌, టీడీపీలు నేతల తిరుగుబాట్ల ప్రభావాన్ని చవిచూడగా చాలా ఏళ్ల తరువాత ఇప్పుడు అధికార వైసీపీ ఆ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. 1952లో బెజవాడ గోపాల్‌రెడ్డి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నాయకుల నుంచే తిరుగుబాటు ఎదురైంది. అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చి ఉదయగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1972 ఎన్నికల్లో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డికి కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి గట్టి దెబ్బే తగిలింది. గూడూరు డివిజన్‌లో తిరుగులేని నాయకుడిగా ఉన్నా ఆయనకు వ్యక్తిగత రాజకీయ కారణాలతో అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు గూడూరు టిక్కెట్‌ను శ్రీనివాసులురెడ్డికి ఇవ్వకుండా శారదాంబ అనే మహిళకు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్‌ అధిష్ఠానంపై నల్లపరెడ్డి శ్రీనివాసులు తిరుగుబాటు చేశారు. ఇండిపెండెంట్‌గా నిలబడి విజయం సాధించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రులకే ఎదురుతిరిగిన నేతలు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు వైసీపీ ఏకంగా ముగ్గురు నేతల నుంచే తిరుగుబాటును ఎదుర్కొంటోంది.

Also Read..

టీడీపీలో 'జోష్'.. క్షేత్రస్థాయిలో సందడి

Next Story