దివంగత సీఎంను తక్కువ చేసి మాట్లాడేవారు ఈ దేశంలోనే ఉండరు: సీఎం జగన్

by Disha Web Desk 22 |
దివంగత సీఎంను తక్కువ చేసి మాట్లాడేవారు ఈ దేశంలోనే ఉండరు: సీఎం జగన్
X

దిశ, ఏపీ బ్యూరో : డా. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును డా.వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరుగా మార్చడాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర్థించుకున్నారు. అసెంబ్లీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుపై సీఎం జగన్ ప్రసంగించారు. దివంగత ఎన్టీఆర్‌ అంటే నాకెంతో గౌరవం. ఎన్టీఆర్‌ని తక్కువ చేసి మాట్లాడే వారు మన దేశంలోనే ఉండరు అని సీఎం జగన్ అన్నారు. బిల్లుపై చర్చించకుండా అనవసరంగా గొడవలు చేసి టీడీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోవడం బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పేరు మార్పునకు గల కారణాలను సీఎం జగన్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. 'ఎన్టీఆర్‌‌పై నాకు ఎలాంటి కోపం లేదు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు నాయుడు కంటే నేనే ఎక్కువ గౌరవం ఇస్తాను. ఏపొద్దు కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేదు.

ఆయన్ని అగౌరవ పరిచే ఏ కార్యక్రమం చేపట్టలేదు. పాదయాత్రలో ఇచ్చిన హామీ కింద ఎన్టీఆర్‌ జిల్లాగా పేరు పెట్టాం. అయితే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇప్పించలేకపోయారు' అని సీఎం జగన్ వివరణ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎన్టీఆర్ పేరు పిలవడమే నచ్చదని విమర్శించారు. 'నటుడిగా, రాజకీయవేత్తగా గొప్పఖ్యాతి సంపాదించిన వ్యక్తి ఎన్టీఆర్‌. అయితే చంద్రబాబు వెన్నుపోటుపొడవడం తదనంతరం జరిగిన పరిణామాలతో మానసిక క్షోభకు గురై ఎన్టీఆర్‌ అకాల మరణం చెందారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉంటే.. చాలాకాలం బతికి ఉండేవారు. అసలు చంద్రబాబు సీఎం అయ్యి ఉండేవారు కాదు' అని జగన్ నాటి పరిణామాలను గుర్తు చేశారు.

పేరు మార్పునకు నన్ను నేను ప్రశ్నించుకున్నాకే నిర్ణయం : సీఎం జగన్

దివంగత సీఎం వైఎస్ఆర్‌.. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి. ఖరీదైన వైద్యాన్ని పేదలకు అందించిన మానవతావాది. ప్రాణం విలువ తెలిసిన వైద్యుడు. వైద్య రంగంలో సంస్కరణలకర్త. పేదవాడి సమస్యలు, జీవితాలు అర్థం చేసుకున్న వ్యక్తి. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆరోగ్యశ్రీ పథకంతో పాటు ప్రజావైద్యం కోసం 108, 104 సర్వీసులు తెచ్చారు. రాష్ట్రంలో11 మెడికల్‌ కాలేజీలకు ఎనిమిది.. టీడీపీ ఆవిర్భావం కంటే ముందే ఉన్నాయి. 1983 నుంచి ఈరోజువరకు టీడీపీ చరిత్రలో ఒక్క మెడికల్‌ కాలేజీ పెట్టలేదు. మూడు మెడికల్‌ కాలేజీలు వైఎస్ఆర్ హయాంలో వచ్చాయి. ప్రస్తుతం మరో 17 మెడికల్‌ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. మొత్తంగా ఏపీలో ఉన్న 28 మెడికల్‌ కాలేజీల్లో 20 కాలేజీలు వైఎస్ఆర్, వైఎస్ జగన్ హయాంలోనే వచ్చినవి.

అలాంటప్పుడు హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టకూడదనడం న్యాయమేనా? అని సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఎవరూ అడగకపోయినా ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేశాం. టీడీపీ హయాంలో ఏదైనా కట్టి ఉంటే.. దానికి ఎన్టీఆర్‌ పేరు పెట్టమని వాళ్లు అడిగితే సానుకూలంగా స్పందిస్తాం. బాగా ఆలోచించే ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పుపై నిర్ణయం తీసుకున్నాం. మార్పు ముందు ఎన్టీఆర్‌ పేరు మార్చడం కరెక్టేనా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నా' అని సీఎం వైఎస్ జగన్‌ అసెంబ్లీలో స్పష్టం చేశారు.


Next Story

Most Viewed