సీఎం ఢిల్లీ పర్యటన అందుకేనా..!

by Disha Web Desk 7 |
సీఎం ఢిల్లీ పర్యటన అందుకేనా..!
X

దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్​ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా సీఎంవో నుంచి ఒక్కటే వినిపిస్తుంది. పెండింగ్​విభజన అంశాలు, ప్రత్యేక హోదా, పోలవరం, రెవెన్యూలోటు గురించి చర్చించడానికేనని చెబుతుంటారు. ఈ దఫా విశాఖ నుంచి పాలన కొనసాగించేందుకు న్యాయపరమైన చిక్కులేమైనా ఉన్నాయా అనేది కేంద్ర మంత్రులతో చర్చిస్తారంటున్నారు. ప్రస్తుతం బడ్జెట్‌పై అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇంత అత్యవసరంగా వెళ్లి ప్రధాని, హోం మంత్రిని కలవాల్సిన అవసరం ఏమొచ్చిందనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఓ వైపు వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్​రెడ్డి అరెస్టు తప్పదనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు మరో ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు రాఘవ రెడ్డి ఢిల్లీ లిక్కర్​కేసులో నిందితుడిగా జైల్లో ఉన్నాడు. తాజాగా 18న విచారణకు రావాలని మాగుంటకూ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇవే సీఎంను కలవరపెడుతున్నాయని విపక్షాల్లో చర్చ జరుగుతోంది. అందుకోసమే సీఎం హఠాత్తుగా ఢిల్లీ పెద్దలను కలవడానికి వెళ్తున్నట్లు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

గ్రాంట్లపై ప్రధానికి నివేదన

జూలై నుంచి విశాఖ కేంద్రంగా పాలన చేపడతామని సీఎం జగన్​అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించారు. రాజధాని కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఎదురయ్యే న్యాయపరమైన చిక్కుల గురించి కేంద్ర హోం, న్యాయ శాఖలతో చర్చించడానికి సీఎం ఢిల్లీ వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. బడ్జెట్‌లో రెవెన్యూలోటు, రావాల్సిన కేంద్ర గ్రాంట్ల గురించి ప్రధానికి నివేదించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇవిగాకుండా చివరి ఏడాదిలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టులున్నాయి. వాటిని అసంపూర్తిగా వదిలేసి ఎన్నికలకు పోతే ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతుందోమేనన్న గుబులు ఉంది. వీటన్నింటి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వానికి మరిన్ని నిధులు, అప్పులు కావాలి. ఆమేరకు ప్రధానికి వివరించే అవకాశాలున్నాయి.

గెజిట్‌లోకి ఎక్కితేనే రాజధాని

వాస్తవానికి సీఎం ఎక్కడ ఉండి పాలన చేసినా దానికి ప్రత్యేక చట్టం అవసరం లేదు. విశాఖ, తాడేపల్లి, పులివెందులలో ఉండి అయినా అధికారులకు ఆదేశాలు ఇవ్వొచ్చు. సమావేశాలు జరపొచ్చు. విశాఖ రాజధానిగా గెజిట్‌లోకి ఎక్కితేనే ఆ ప్రాంతంలో అధికార పార్టీ నేతల ప్రయోజనాలు నెరవేరతాయి. ఈ నాలుగేళ్లలో వాళ్లు కొన్న భూములకు విలువ పెరగాలన్నా.. ఆస్తులకు గిరాకీ రావాలన్నా రాజధాని అనే రాజముద్ర తప్పనిసరి. అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నామని ఇప్పటికే కేంద్రం పలుమార్లు వెల్లడించింది. రాజధాని వివాదంపై సుప్రీం కోర్టులో కేసు ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇప్పటికిప్పుడు విశాఖ పేరును గెజిట్‌లో చేర్చే అవకాశం లేదు. అయినా దీని గురించి అత్యవసరంగా అసెంబ్లీ సమావేశాలను వదిలేసి సీఎం వెళ్లారంటే హస్యాస్పదంగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

డ్యామేజీ కంట్రోల్ కోసమే..

ప్రస్తుతం వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్​రెడ్డితోపాటు అతని తండ్రిని సీబీఐ అరెస్టు చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్​స్కాం కేసులో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు రాఘవరెడ్డిని ఈపాటికే ఈడీ అరెస్టు చేసింది. ఇప్పుడు మళ్లీ 18న విచారణకు రావాలని ఎంపీ మాగుంటకు నోటీసులు జారీ చేసింది. ప్రధానంగా ఈ రెండు అంశాలు సీఎం జగన్​ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వీటిపై ప్రధాని మోడీ, అమిత్​షాతో మాట్లాడే అవకాశాలున్నాయి. ఇద్దరు ఎంపీలు అరెస్టు అయితే ముందు పార్టీ ప్రతిష్ట పాతాళానికి పోతుంది. ఆ తర్వాత ఎప్పుడో నిజానిజాలు తేలినా డ్యామేజీని పూడ్చలేవు. అందుకే సీఎం జగన్​హుటాహుటిన ఢిల్లీ పెద్దలను కలవడానికి వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


Next Story