ఎన్నికలకు ప్రత్యేక సైన్యాన్ని సిద్ధం చేసిన సీఎం జగన్​

by Disha Web Desk 12 |
ఎన్నికలకు ప్రత్యేక సైన్యాన్ని సిద్ధం చేసిన సీఎం జగన్​
X

దిశ, ​ఏపీ బ్యూరో: మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం సీఎం జగన్​ ఇప్పటిదాకా అనేక అస్త్రాలు సంధించారు. ఎన్నికలకు నెలల వ్యవధి ముందుగా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేతలను అవినీతి కేసులుతో ఉక్కిరిబిక్కిరి చేశారు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు టీడీపీ శ్రేణులు కేవలం కోర్టులు, తీర్పులపై దృష్టి సారించేట్లు చేశారు. ఆపాటికే ఓటరు జాబితాలను జల్లెడ పట్టారు. వలంటీర్ల ద్వారా సేకరించిన సమాచారంతో ప్రతి కుటుంబంలోని ఓటర్లు ఏ పార్టీకి మద్దతుగా ఉన్నారో తెలుసుకున్నారు. అందుకు అనుగుణంగా వైసీపీకి అనుకూలంగా ఓట్ల చేర్పులు, విపక్షాలకు చెందిన వాటి తొలగింపునకు సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. ఓట్ల అవకతవకలను సరిచేయలేక ఎన్నికల సంఘమే తల పట్టుకున్న దాఖలాలున్నాయి.

అన్నీ ఒంటెత్తు పోకడలే..

తరాల నుంచి నియోజకవర్గాల్లో సామంతరాజుల్లా వ్యవహరిస్తున్న నేతలకు సీఎం జగన్​ ఝలక్​ ఇచ్చారు. కొందరికి స్థానభ్రంశం కల్పించారు. కొన్నిచోట్ల మండల స్థాయి నేతలకు ఇన్​చార్జులుగా అవకాశమిచ్చారు. అసలు నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలున్నాయో కూడా అవగాహన లేని వాళ్లను సైతం బరిలో దింపేందుకు సిద్దమయ్యారు. ఇంకొందరు సిట్టింగులకు ఈ దఫా టిక్కెట్​ లేదని నిర్మొహమాటంగా చెప్పేశారు. ఇలా దాదాపు 85 నియోజకవర్గాల్లో వివిధ సామాజిక వర్గాల సమతుల్యత ఆధారంగా సమన్వయకర్తలను నియమించారు. ఎన్నికల బరిలో వీరే ఉంటారన్న గ్యారెంటీ లేదు. ఏ క్షణమైనా ఎవరిని అయినా మార్చేయొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నిరంతర పర్యవేక్షణ..

అంతిమంగా పోల్​ మేనేజ్మెంట్ పై జగన్ దృష్టి సారించారు. ఇప్పటిదాకా 47 వేల బూత్​ కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతి కమిటీలో 15 మంది సభ్యులుంటారు. అందులో యువత, మహిళలకూ ప్రాతినిధ్యం కల్పించారు. బూత్​ కమిటీల పని విధానాన్ని జిల్లా కేంద్రంగా పర్యవేక్షించే బృందాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి రాష్ట్ర కేంద్రంలో మానిటరింగ్​ చేసే వార్​ రూమ్​ ఉంటుంది. బూత్​ కమిటీ సభ్యులు నిరంతరం ప్రజల్లో ఉండేట్లు ప్రణాళిక సిద్దం చేశారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని అందుకనుగుణంగా కమిటీల పని విధానాన్ని పర్యవేక్షిస్తారని తెలుస్తోంది.

విశ్లేషకులు ఏమంటున్నారంటే..

ఎన్నికల్లో సీఎం జగన్​ అనుసరిస్తున్న ఈ విధానం విఫలమవ్వొచ్చని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యూడల్​ సంబంధాలు ఇంకా సజీవంగా ఉన్నందున వైసీపీ ప్రయోగం విజయం సాధించడం కష్టమంటున్నారు. వ్యవసాయం, భూసంబంధాల్లో మార్పులు, చేతి వృత్తుల వాళ్లు అసంఘటిత కార్మికులుగా మారినందున ఫ్యూడల్​ శక్తుల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని మరికొందరు రాజకీయ పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కార్పొరేట్​ కల్చర్​ కు అలవాటు పడుతున్న జనం నుంచి జగన్​ రాజకీయాలకు ఆమోదం లభించవచ్చని అభిప్రాయపడుతున్నారు.


Next Story

Most Viewed