CM Jagan: వైసీపీని గెలిపించడంలో ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు కావాలి: గుడివాడ ‘మేమంతా సిద్ధం’ సభలో సీఎం జగన్ ఫైర్

by Disha Web Desk 1 |
CM Jagan: వైసీపీని గెలిపించడంలో ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు కావాలి: గుడివాడ ‘మేమంతా సిద్ధం’ సభలో సీఎం జగన్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీని గెలిపించడంలో ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు కావాలని సీఎం జగన్ అన్నారు. ఇవాళ గుడివాడలో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుడివాడ సభ ఓ మహా సముద్రంలో కనిపిస్తోందని అన్నారు. మంచి వైపు నిలబడిన మహా సముద్రమే ఇది అని జగన్ చమత్కరించారు. పథకాలను కొనసాగించేందుకు సమరశంఖం పూరిద్దామని ఆయన పిలుపునిచ్చారు. నిరుపేదల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ.. పెత్తందార్లపై యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పేదల కోసం ఇప్పటికే 130 సార్లు బటన్ నొక్కామని అన్నారు.

వైసీపీని గెలిపించడంలో ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మంచి చేస్తున్న జగన్ ఒకవైపు ఉంటే.. కుట్రలతో అవతలి వైపు విపక్ష కూటమి తనపై దాడి చేస్తుందని అన్నారు. పద్మవ్యూహం పన్ని తనపై బాణాలను వదులుతున్నారని ధ్వజమెత్తారు. తాను ప్రజలు అనే కృష్ణుడు అండ ఉన్న అర్జునుడినంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. తనపై ఓ రాయి విసిరినంత మాత్రాన గెలుపును ఆపలేరని స్పష్టం చేశారు. ఒకవేళ అలా చేస్తున్నారంటే విజయానికి తాము మరింత దగ్గర అవుతున్నామని అర్థం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష కూటమి విజయానికి దూరంగా ఉన్నారు కాబట్టే ఇలా రాళ్లతో దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాంటి చర్యలకు తాను జగన్ అనేవాడు అదరడు.. బెదరడంటూ కౌంటర్ ఇచ్చారు. తన మీద ఆ దేవుడు పెద్ద స్క్రిప్టే రాశాడని, అందుకే పెద్దగా గాయం కాలేదని అన్నారు. పేదలకు చంద్రబాబు చేసిన గాయాలు ఎన్నటికీ మరిచిపోలేమని గుర్తు చేశారు. గాయాలు, మోసాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, మంచి చేయడమే జగన్ వ్యక్తిత్వమని ఆయన అన్నారు. పెదలకు మంచి చేయొద్దు అన్నది టీడీపీ అధినేత పిలాసఫీ అంటూ ఎద్దేవా చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దన్నది చంద్రబాబే అని, చివరికి ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన రూ.2 కిలో బియ్యం పథకాన్ని తీసేసింది చంద్రబాబు కాదా.. అని ప్రశ్నించారు.

నిరుపేదలకు ఇళ్లు ఇస్తుంటే కేవలు వేసింది, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తుంటే అడ్డుకున్నది ఆయనే అంటూ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మరుగున పడేశారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు టీడీపీ అవమానించిందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబేనని అన్నారు. సొంత మామ ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించి ఆయన చావుకు కారణమయ్యాడని, చంద్రబాబుకు మనసు, మానవత్వం లేదంటూ జగన్ ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వానిది 58 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ అని, ప్రతి గ్రామంలో సర్కార్ ఏర్పాటు చేసిన 7 వ్యవస్థలు, జగన్ మార్క్ కనిపిస్తాయని అన్నారు.

Next Story