TTD: చిన్నారి లక్షిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా

by Disha Web Desk 16 |
TTD: చిన్నారి లక్షిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా
X

దిశ, తిరుపతి: తిరుమల నడక దారిలో శుక్రవారం రాత్రి చిరుత దాడికి గురై మరణించినట్లు భావిస్తున్న బాలిక లక్షిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. మృతురాలి కుటుంబసభ్యులకు ఆయన సానుభూతి తెలిపారు. టీటీడీ రూ. 5 లక్షలు, అటవీ శాఖ రూ. 5 లక్షలు కలిపి మొత్తం రూ. 10 లక్షలు లక్షిత కుటుంబానికి అందజేస్తామని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.

తిరుమల నడకమార్గంలో చిన్నారి లక్షిత మృతి చెందడంతో టీటీడీ అప్రమత్తం అయ్యింది. ఈ ఘటనపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందిస్తూ.. తిరుమల నడకదారిలో చిన్నారిపై చిరుత దాడి చాలా బాధాకరం తెలిపారు. తిరుమల నడకమార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ ఘటనపై సీసీఎఫ్‌ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయించాం. చిరుతను బంధించడం కోసం బోన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గతంలో బోన్‌లు ఏర్పాటు చేసి చిరుతను బంధించామని గుర్తుచేశారు. నడకదారిలో ఫారెస్ట్‌, పోలీసు, టీటీడీ కలిసి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు.

తిరుమల ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల నిలిపివేత ఉంటుందని, నడకదారుల్లో 2 గంటలకే భక్తులను అనుమతించే అంశాలపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. నడకమార్గంలో ప్రతి 40 అడుగులకు సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, టీటీడీ నుంచి రూ. 5 లక్షలు, అటవీశాఖ నుంచి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని.. ఎక్స్‌పర్ట్‌ కమిటీని ఏర్పాటు చేసి నివేదిక అందిన తర్వాత చర్యలు చేపడతామని వెల్లడించారు.

కాగా తిరుమలలో చిరుత దాడి కలకలం రేపింది. అలిపిరి కాలినడక మార్గంలో బాలికపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో బాలిక మృతి చెందింది. మృతి చెందిన బాలికను లక్షిత(6)గా పోలీసులు గుర్తించారు. తిరుమలకు కాలినడకన వెళ్తుండగా లక్ష్మీ నరసింహస్వామి గుడి వద్ద ఘటన చోటు చేసుకుంది.

ఇటీవల ఓ బాలుడిపై సైతం చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. తిరుమల మెట్ల మార్గంలో మొత్తం 3550 మెట్లు ఉన్నాయి. అలిపిరి మార్గంలో ప్రతి రోజు 25వేల మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారు. వరుసగా చిరుతల దాడులతో శ్రీవారి భక్తులు వణికిపోతున్నారు.

Next Story