శరవేగంగా తిరుపతి స్టేషన్ ఆధునీకరణ పనులు

by Disha Web Desk 16 |
శరవేగంగా తిరుపతి స్టేషన్ ఆధునీకరణ పనులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ స్పష్టం చేశారు. రూ.300 కోట్లతో ఆధునీకరణ నిర్మాణ పనులు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఇది టెంపుల్ టౌన్ యొక్క స్టేషన్ కాంప్లెక్స్‌ను రెండు వైపుల నుండి కలుపుతూ ప్రయాణీకులకు ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించేందుకు వీలు కల్పిస్తుందని తెలిపారు. ఈ ఆధునీకరణ పనుల వల్ల స్టేషన్ రూపురేఖలు మారిపోతాయన్నారు. రాబోయే 40 ఏళ్లలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్టేషన్‌ను అత్యున్నతంగా ఆధునీకరించడం జరుగుతోందని వెల్లడించారు.


దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ బుధవారం తిరుపతి రైల్వే స్టేషన్‌లో పనుల పురోగతిని సమీక్షించారు. ఈ స్టేషన్ అభివృద్ధికి సంబంధించిన పనులను మెస్సర్స్ వరింద్రా కనస్ట్రక్షన్స్ లిమిటెడ్ న్యూఢిల్లీ సంస్థకు 30 మే 2022న ఇంజినీరింగ్ ప్రొక్యూరింగ్ అండ్ కనస్ట్రక్షన్ విధానంలో పనులను అప్పజెప్పడం జరిగిందని తెలిపారు. రాబోయే 33 నెలల్లో అంటే ఫిబ్రవరి 2025 నాటికి ఈ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అలాగే కార్యాలయాల స్థలాలు , కాంక్రీట్ ల్యాబ్, సామాగ్రిని నిల్వచేసేందుకు ఉపయోగించే స్టోరేజ్ షెడ్‌ల నిర్మాణం పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు.

జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్‌తో పాటు స్టేషన్ మొత్తం సర్వే పూర్తైనట్లు అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. దక్షిణం వైపు కార్యసముదాయాల తరలింపు పూర్తి కాగా..ఉత్తరం వైపు బిల్డింగ్‌లో 70శాతం తరలింపు పూర్తైనట్లు వెల్లడించారు. అలాగే కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్ పూర్తి చేసినట్లు తెలిపారు. పునాదులలో కాంక్రీట్ పనులు 80 శాతం మేర పూర్తికాగా బేస్‌మెంట్ ఫ్లోర్ సంబందించిన పనులు 30 శాతం పూర్తైనట్లు తెలిపారు. కొత్త స్టేషన్ సముదాయం పూర్తయిన తర్వాత, రైలు ప్రయాణికులు స్టేషన్‌లో అత్యాధునిక సౌకర్యాలతో అపూర్వమైన ఆహ్లాదాన్ని పొందుతారని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ స్పష్టం చేశారు.


Next Story

Most Viewed