Cpi Ramakrishna: ఫిబ్రవరి 22న చలో విజయవాడ

by Disha Web Desk 16 |
Cpi Ramakrishna: ఫిబ్రవరి 22న చలో విజయవాడ
X
  • 22న చలో విజయవాడ
  • మార్చి 22 ఉగాది నాటికి గృహ ప్రవేశాలు
  • - సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ

దిశ, తిరుపతి: జగనన్న ఇళ్ళ లబ్ధిదారులకు ఐదు లక్షలు ఇచ్చే వరకు పోరాడతామని, ప్రభుత్వానికి ఎర్రజెండా సత్తా చూపిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్త కలెక్టరేట్ల వద్ద ఆందోళనల్లో భాగంగా తిరుపతి కలెక్టర్ కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల ఇళ్లు ఇచ్చామని ప్రగల్బాలు పలుకుతున్న ముఖ్యమంత్రి వాటి నిర్మాణ దశను కళ్ళు తెరిచి చూడాలని హితవు పలికారు. ప్రభుత్వం ఇస్తున్న 1.80 లక్షల రూపాయలు కనీసం పునాదులకు కూడా సరిపోదన్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక 8 వేలు, లారీ ఇసుక 40 వేల రూపాయలు అమ్ముతున్నారని మండిపడ్డారు. దీంతో ఇళ్లను నిర్మించుకోలేక పేదలు అప్పుల పాలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేదలకు సెంటు స్థలం కేటాయించిన జగన్ తాను మాత్రం పులివెందుల, విజయవాడ హైదరాబాదు, బెంగళూరు, విశాఖలో విలాసవంతమైన ఇళ్ళు నిర్మించుకున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎద్దేవా చేశారు. జగనన్న ఇళ్లకు మూడు సెంట్ల స్థలం, నిర్మాణ ఖర్చుల కింద ఐదు లక్షలు డిమాండ్ చేస్తుంటే కమ్యూనిస్టు నాయకులపై ప్రభుత్వం నిర్బంధాలు విధించి, కేసులు బనాయించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. జగనన్న ఇళ్ళ నిర్మాణానికి ఉచితంగా ఇసుక, సిమెంటు సరఫరా చేసి ఐదు లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వీటి సాధన కోసం ఫిబ్రవరి 22న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని రామకృష్ణ ప్రకటించారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లబ్ధిదారులు అందర్నీ ఏకం చేసి పోరాడతామన్నారు. అప్పటికీ స్పందించకపోతే మార్చి 22 ఉగాది నాటికి లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయిస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు



Next Story