Tirupati: ప్రత్యేకహోదా, పొత్తులపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
Tirupati: ప్రత్యేకహోదా, పొత్తులపై  సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీతో పొత్తుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వంపై పొగడ్తలు కురిపిస్తూ బీజేపీకి దగ్గర కావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన పప్పులు ఉడకవని అన్నారు. టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని క్లారిటీ ఇచ్చారు.

తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం పారిచెర్లవారిపాళెంలో ఉపాధి హామీ పథకం పనులను కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి దేవూసిన్హ్ చౌహాన్‌‌తో కలిసి సోము వీర్రాజు పరిశీలించారు. అనంతరం సోము వీర్రాజు విలేకరులతో మాట్లాడారు. గతంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీని ముప్పు తిప్పలు పెట్టారని, ఆ అనుభవాలను తాము ఇంకా మరచిపోలేదని చెప్పారు. బీజేపీ అగ్రనాయకత్వంతోపాటు కేంద్రంలోని పెద్దలు కూడా చంద్రబాబుతో పొత్తుకు నిరాకరిస్తున్నారని క్లారిటీ ఇఛ్చారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 35 వేల కోట్లు ఇస్తే ఆ నిధులను మళ్లించి చంద్రన్న బాట పేరుతో ఖర్చు పెట్టారని సోము వీర్రాజు ఆరోపించారు. నిధులు మళ్లించుకోవడమే కాకుండా బీజేపీ ఏమీ ఇవ్వలేదని ఎదురుదాడికి దిగారని గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని, కేవలం ప్యాకేజీ చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది చంద్రబాబు నాయుడేనని సోము వీర్రాజు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నా చంద్రబాబు అమరావతిలో తాత్కాలిక రాజధాని నిర్మించారని, అందువల్లే ఇప్పుడు రాజధాని లేకుండా రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సోము వీర్రాజు అన్నారు.

వచ్చే ఎన్నికల్లో తమ పొత్తు జనసేన పార్టీతోనే ఉంటుందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. జనసేనతోనే కలిసి ఎన్నికలకు వెళ్తామని అంతే తప్ప టీడీపీతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. కేంద్రంలోని బీజేపీ రాష్ట్ర అభివృద్ధికి నిధుల వరద కురిపిస్తుందని.. ఈ అభివృద్ధిని ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తమను ఆదరిస్తారనే నమ్మకం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story

Most Viewed