మారిన సీన్​ .. వైసీపీ ప్రభుత్వంపై షా, నడ్డా ఆరోపణల తర్వాత గందరగోళం​

by Dishanational2 |
మారిన సీన్​ .. వైసీపీ ప్రభుత్వంపై షా, నడ్డా ఆరోపణల తర్వాత గందరగోళం​
X

నిన్న మొన్నటిదాకా అత్యంత విశ్వాసపాత్రుడైన సామంత రాజుగా మెలిగిన సీఎం జగన్​పై కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అవినీతి ఆరోపణలు గుప్పించారు. అప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో సీన్​ మారిపోయింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను.. పొత్తు అనివార్యమని చెప్పిన జనసేనాని ప్లేటు ఫిరాయించినట్లు కనిపిస్తోంది. సీఎంగా రెండు దఫాలు అవకాశమిస్తే తానేంటో నిరూపిస్తానంటున్నారు. ఎన్నికలకు ఒంటరిగా వస్తానా.. పొత్తులతో వస్తానో ఇంకా తేల్చుకోలేదని చెప్పేశారు. వారాహి యాత్రలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాలను మరింత వేడెక్కించాయి. ఉత్తుత్తి అవినీతి ఆరోపణలు కాదు.. చేతల్లో చూపాలని చంద్రబాబు కేంద్ర పెద్దలకు చురకలు వేశారు. ఈ పార్టీలన్నీ తనను ఒంటరి చేసి దండయాత్రకు వస్తున్నాయని.. మీరే నాకు అండ అంటూ సీఎం జగన్​ ప్రజల్లోకి వెళ్తున్నారు. బీజేపీ, జనసేన పార్టీలు ఇంతటి గందరగోళం సృష్టించడం వెనుక మతలబేంటని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.

దిశ, ఏపీ బ్యూరో : జగన్ సర్కారు మీద బీజేపీ పెద్దలు చేసిన ఆరోపణలపై వైసీపీ నేతలు స్పందించారు. ఎన్నికల ఏడాది కాబట్టి పార్టీ పరంగా బీజేపీ నేతలు రాజకీయ ఆరోపణలు చేయడం మామూలేనని వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డి కొట్టిపారేస్తున్నారు. ఏవైనా ఆధారాలు చూపితే అప్పుడు ఆలోచిస్తామంటున్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు యథావిధిగానే ఉంటాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనికి భిన్నంగా సీఎం జగన్​ వ్యాఖ్యలు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఎవరి అండదండలు లేకున్నా మిమ్మల్నే నమ్ముకున్నానంటూ ప్రజల్లో సానుభూతిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా సీఎం జగన్​, ప్రధాని మోడీ వ్యూహంలో భాగమై ఉండొచ్చంటూ పలు ఊహాగానాలు నెట్టింట హల్​చల్​ చేస్తున్నాయి.

తూటాలు.. తుస్సు..

వారాహి యాత్ర తొలిరోజున జనసేనాని కత్తిపూడి బహిరంగ సభలో కొన్ని తూటాలు పేల్చారు. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెడతానన్నారు. ఎన్నికలకు ఒంటరిగా వెళ్తామా.. పొత్తులతోనా అనేది ఇంకా నిర్ణయించుకోలేదని స్పష్టం చేశారు. తర్వాత చేబ్రోలు రైతుల సమావేశంలో మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు దఫాలు సీఎంగా అవకాశమిస్తే తానేంటో నిరూపిస్తానన్నారు. అభివృద్ధి చేయలేకపోతే తానే స్వచ్ఛందంగా తప్పుకుంటానని వ్యాఖ్యానించారు. ఇటీవల పార్టీ ఆవిర్భావ సమావేశంలో పవన్​ తనకు సీఎంగా అవకాశం వచ్చేంత బలం లేదన్న విషయాన్ని స్పష్టం చేశారు. ముక్కోణపు పోటీలో తాను పావుగా త్యాగం చేయలేనన్నారు. అనివార్యంగా పొత్తులు తప్పవన్న సంకేతాలు ఇచ్చారు.

ఇది బీజేపీ వ్యూహమా..?

ఆ తర్వాత జనసేనాని నిర్ణయాల్లో మార్పునకు కారణం ఏమై ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో హాట్​ టాపిక్​ అయ్యింది. బీజేపీ పెద్దలు పవన్​కు ఏదైనా రూట్​ మ్యాప్​ ఇచ్చారా ! అందులో భాగంగానే ఆయన నిర్ణయాలను మార్చుకున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నిజంగానే వైసీపీని టార్గెట్​ చేస్తున్నట్లు జనసేనాని విశ్వసించారా ! లేక టీడీపీతో పొత్తు ప్రచారం వల్ల పార్టీ డ్యామేజీ అవుతుందని ఇలా మాట మారుస్తున్నారా అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. అసలు ఇంతటి గందరగోళానికి ఆయన గురవుతున్నారా లేక బీజేపీ ఎత్తుగడలో భాగంగా ప్రజల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నారా అంటూ సామాజిక మాధ్యమాల్లో విశ్లేషణలు వెలువడుతున్నాయి. జనసేనాని వారాహి యాత్ర ముగిసే నాటికి ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది.

Next Story

Most Viewed