పేరుకే మూడు పార్టీల కూటమి.. జనసేన, బీజేపీలకూ వారే అభ్యర్థులు

by Disha Web Desk 2 |
పేరుకే మూడు పార్టీల కూటమి.. జనసేన, బీజేపీలకూ వారే అభ్యర్థులు
X

రాష్ర్టంలో పొత్తులు పొద్దుపొడిచాయి. మూడు పార్టీల కూటమి ఎట్టకేలకు ఏర్పాటైంది. రోజుల తరబడి చర్చల తరువాత విడతల వారీగా అభ్యర్థుల జాబితాలు వెలువడ్డాయి. ఎంతో కష్టపడి ఇంకెన్నో త్యాగాలు చేసి పొత్తులు కుదిర్చామని, ఇక తమకు తిరుగేలేదని నాయకులు భావిస్తున్న తరుణంలో.. కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా పెద్దన్న పాత్ర పోషించిన టీడీపీ.. ఈ కూటమిలోని చిన్న పార్టీలైన జనసేన , బీజేపీలకు న్యాయం చేయాల్సింది పోయి తమ నేతలను ప్యూహాత్మకంగా పార్టీ మార్పించి టికెట్లు మంజూరు చేయించి తమ పార్టీ పీక కోసిందని ఆయా పార్టీల నేతలు మండి పడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి మేలు చేసే పొత్తు కోసం తమ పార్టీలను ఎందుకు చంపుకోవాలని ప్రశ్నిస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీ సిద్ధాంతాలు నమ్మి జండాలు మోసిన వారిని పక్కన పడేసి టీడీపీ నుంచి చివరి నిముషంలో వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడమేమిటని మండిపడుతున్నారు.

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: పొత్తులో భాగంగా జనసేనకు 21 సీట్లు దక్కాయి. ఒక్క పాలకొండ మినహా అన్నింటికీ అభ్యర్దులను ప్రకటించారు. ఇందులో ఐదు సీట్లను దర్జాగా తెలుగుదేశం నేతలే దక్కించుకొన్నారు. భీమవరం నుంచి పులపర్తి వీరాంజనేయులు, ఉంగుటూరు నుంచి పి.ధర్మరాజు, రైల్వేకోడూరు నుంచి అరవ శ్రీధర్, అవనిగడ్డ నుంచి మండలి బుధ్ద ప్రసాద్‌లకు టికెట్లు దక్కాయి. పాలకొండ టికెట్ నిమ్మక జయకృష్ణకు కేటాయించనున్నారు. వీరంతా టికెట్ కేటాయించే ముందురోజు తెలుగుదేశం పార్టీకి ఉత్తుత్తి రాజీనామా చేసి జనసేనలో చేరిన వారే. అలాగే, వైసీపీ నుంచి కేవలం టికెట్ ఆశతో వచ్చిన పంచకర్ల రమేష్ బాబు (పెందుర్తి), వంశీకృష్ణ శ్రీనివాస్ (విశాఖ దక్షిణ), కొణతాల రామకృష్ణ (అనకాపల్లి), బత్లుల బలరామకృష్ణ (రాజానగరం), ఆరణి శ్రీనివాస్ (తిరుపతి), బాలశౌరి (మచిలీపట్నం ఎంపీ) టికెట్లు దక్కాయి. వైసీపీ నుంచి వలసలు రెండు మూడు రోజుల ముందు గాక నెలల ముందు జరగడం, వారు కాస్తో కూస్తో పార్టీ పనిచేయడం, పార్టీ క్యాడర్ తో కలవడం జరిగాయి.

ఇది తెలుగు బీజేపీ..!

ఇప్పుడు బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాను చూసిన తరువాత సంఘ్ పరివార్ నేతలు దీనిని తెలుగు బీజేపీగా అభివర్ణిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు స్వయానా వదిన అయిన పురందేశ్వరి అధ్యక్షతన బీజేపీ పూర్తిగా టీడీపీలో మునిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అరకు సీటు పొందిన కొత్తపల్లి గీత 2014లో వైసీపీ నుంచి గెలిచి తెలుగుదేశం మద్దతుదారుగా వ్యవహరించారు. ఇప్పటికీ ఆ పార్టీతో మంచి సంబంధాలే ఉన్నాయి. అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు హార్డ్ కోర్ టీడీపీ అనే ముద్ర వుంది. వైసీపీ దాడులను తట్టుకొనేందుకు అప్పట్లో బీజేపీలో చేరారు. చంద్రబాబు చెప్పినట్లే ఆయన చేస్తారని, ఇప్పటికీ మంచి సంబంధాలు వున్నాయనేది అందరికీ తెలిసిందే.

బద్వేలు అభ్యర్థి టీడీపీ నేతే..

బద్వేలు నుంచి శానససభకు పొత్తులో భాగంగా పోటీ చేస్తున్న బొజ్జా రోషన్న ఐదేళ్లుగా తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జి. కేవలం టికెట్ కోసం టీడీపీ ఆయనతో పార్టీ మార్పించింది. కైకలూరు నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ కామినేని శ్రీనివాస్ 2014 ఎన్నికల సమయంలో ఇలాగే తెలుగుదేశం నుంచి వచ్చి గెలిచి మంత్రి అయ్యారు. ఆ తరువాత పార్టీలో ఎక్కడా కనిపించలేదు. విచిత్రంగా 2019లో పోటీకి కూడా దిగలేదు. టీడీపీతో పొత్తు అనగానే ఇపుడు సిద్ధమైపోయారు. తెలుగుదేశం మద్దతుతో టికెట్ వచ్చేసింది. విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేస్తున్న సుజనా చౌదరి ఎవరో ? ఎక్కడ నుంచి వచ్చారో అందరికీ తెలిసిందే. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి కూడా 2019 వరకూ తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి. రాయలసీమ రక్షణ కోసం బీజేపీలో చేరారని అంటారు. దశాబ్ధాల నుంచి పార్టీకి సేవలందించిన వారికి గాక వీరికే టికెట్లు దక్కాయి.

ఓటు బదిలీ అవుతుందా?

జనసేన, బీజేపీ నేతలను మాయచేసి, మేనేజ్ చేసి తమ పార్టీ వారికి , తమ అనుకూలురకు టీడీపీ అధిష్టానం టికెట్లు అయితే ఇప్పించుకొంది కానీ ఆ పార్టీల ఓటు బదిలీ అవుతుందా? అన్న సందేహం ఇప్పుడు వెంటాడుతోంది. రాష్ర్టంలో మూడు పార్టీల కూటమి కాదని, కేవలం తెలుగుదేశం కూటమి ఇదని జనసేన, బీజేపీ నేతలు కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటు బదిలీ ఎంత మేరకు అవుతుందో చెప్పలేని పరిస్ధితులు నెలకొన్నాయి. ఓటు మార్పిడి సంగతి తర్వాత, చాలా నియోజకవర్గాల్లో జనసేన, బీజేపీ కింది స్థాయి నేతలు, కార్యకర్తలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదు. తెలుగుదేశం నేతలూ వారిని కలుపుకోవడం లేదు.

Next Story