2024 Elections చంద్రబాబు ప్లాన్ ఇదే..!

by Disha Web Desk 16 |
2024 Elections చంద్రబాబు ప్లాన్ ఇదే..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్లామర్ ఎప్పుడూ అవసరమే. సినిమా, వ్యాపార వాణిజ్య రంగాలలో తారల తళుకు బెళుకులు సహజంగా ఉంటాయి. అనంతరం ఈ గ్లామర్ రాజకీయాల్లోకి ప్రవేశించింది. దివంగత సీఎం ఎన్టీఆర్ సాక్షాత్తు సినీ వినీలాకాశంలో నుంచి వచ్చి టీడీపీని స్థాపించి తొమ్మిది నెలలలో అధికారంలోకి వచ్చారు. దీంతో అనేకమంది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు రాజకీయారంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి సినిమా-రాజకీయ రంగానికి మధ్య అవినాభావ సంబంధం ఏర్పడింది. ఆ బంధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినీ మద్దతు ఒకప్పుడు టీడీపీకి అత్యధికంగా ఉండేది కానీ 2019 ఎన్నికల్లో అదికాస్తా వైసీపీకి ఫేవర్‌గా మారింది. టీడీపీతో పోల్చుకుంటే వైసీపీకి టాలీవుడ్ ప్రముఖులు జై కొట్టి సూపర్ హిట్ ఇచ్చారు. దీంతో వైఎస్ జగన్ సీఎం పీఠం అధిరోహించిన సంగతి తెలిసిందే. మరో 16 నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమను తమవైపునకు తిప్పుకునేందుకు.. టీడీపీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సినీ ప్రముఖుల మద్దతుతో ఖచ్చితంగా ఓటర్లను ప్రభావితం చేయవచ్చని బలంగా నమ్ముతున్న చంద్రబాబు ఇటీవల పర్యటనలలో సినీ ఇండస్ట్రీకి వైఎస్ జగన్ ద్రోహం చేశారంటూ పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. టికెట్ ధరలు, ఆన్ లైన్ టికెటింగ్ విధానం, బెనిఫిట్ షోలపై ఆంక్షలు వంటి అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తు్న్నారు. అంతేకాదు సినీ హీరోలపాలిట జగన్ విలన్ అంటూ కూడా స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు దృష్టి టాలీవుడ్ వైపు మళ్లిందంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

అలా మొదలైంది గ్లామర్

రాజకీయాలకు-సినీ రంగానికి మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఎన్నికలు సమీపిస్తు్న్నాయంటే చాలు రాజకీయ పార్టీలన్నీ టాలీవుడ్‌పైనే ఫోకస్ పెడతాయి. గ్లామర్ మద్దతు కోసం ఎగబడతారు. తమ పార్టీ తరపున ప్రచారం చేసే వారి కోసం వేటాడతారు. ఇది గత కొంతకాలంగా జరుగుతూ ఉన్నదే. ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేట్రం నుంచి సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మరికొందరైతే కొన్ని పార్టీలకు మద్దతు పలుకుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందుకే గత ఎన్నికల్లో అయినా.. అంతకుముందు ఎన్నిక లైనా.. పార్టీలకు సినిమా హీరోలు.. క్యారెక్టర్ నటులు కూడా తోడుగా నిలిచి ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి పార్టీని స్థాపిస్తే సూపర్ స్టార్ కృష్ణ, దాసరి నారాయణ రావు, కృష్ణంరాజు, జయప్రదలు జాతీయ పార్టీల్లో కీలకంగా మారారు. అనంతరం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీని సైతం స్థాపించి ఇప్పుడు ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా రాజకీయాల్లో సినిమా రంగం ప్రవేశించి కీలకంగా మారింది. అప్పటి నుంచి రాజకీయాల్లో సినీ గ్లామర్ డోసు కంటిన్యూ అవుతూనే ఉంది.

నాడు మెజారిటీ వర్గం టీడీపీవైపే

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్రమ ఏదో ఒక పార్టీకి ప‌రోక్షంగా మ‌ద్దతు తెలియ‌జేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. టీడీపీ అధికారంలో ఉన్నంత‌వ‌ర‌కు ఎన్నిక‌లు జ‌రిగే స‌మ‌యంలో ప్రముఖ క‌థానాయ‌కులు బాల‌కృష్ణ, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, క‌ల్యాణ్ రామ్‌, తారకరత్నతోపాటు ద‌ర్శకుడు రాఘ‌వేంద్రరావు, నిర్మాత అశ్వనీద‌త్‌, ముర‌ళీమోహ‌న్, నారా రోహిత్ త‌దిత‌రులు టీడీపీ పక్షాన నిలిచారు. వీరిలో బాలకృష్ణ ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా.. కే రాఘవేంద్రరావు టీటీడీ బోర్డు మెంబరుగా పని చేశారు. ఇకపోతే మురళీ మోహన్ రాజమహేంద్రవరం ఎంపీగా పనిచేసిన సంగతి తెలిసిందే. వీరే కాదు మ‌రికొంద‌రు ప‌రోక్షంగా మ‌ద్దతు సైతం తెలియజేశారు. అయితే 2009 ఎన్నిక‌ల త‌ర్వాత నుంచి జూనియ‌ర్ ఎన్టీఆర్ రాజ‌కీయాల‌కు దూరమయ్యారు. అయినప్పటికీ నైతికంగా మాత్రం టీడీపీకే మద్దతు అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా చూస్తే ఇండస్ట్రీలో మెజారిటీ వర్గం మాత్రం టీడీపీ వైపే ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు. 2019 ఎన్నికల్లో టీడీపీలో కొందరు సినీ తారలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తన బావమరిది అయిన సూపర్ స్టార్ మహేశ్ బాబు మద్దతు తీసుకోగా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సమంత మద్దతు కోరిన సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో నారా రోహిత్, తారకరత్నలు కూడా టీడీపీ తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

చంద్రబాబు ప్లాన్ ఇదే..

ఇకపోతే 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే పరమావధిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. గెలుపుకు కలిసొచ్చే ఏం అంశం అందివచ్చినా వదలడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా సినీ ఫంక్షన్లకు హాజరవుతున్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన వారితో మమేకమవుతున్నారు. వాస్తవానికి సినిమాలపై చంద్రబాబు అంతగా దృష్టి పెట్టరు. చంద్రబాబు చూసే సినిమాలు కూడా చాలా అరుదుగానే ఉంటాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు వంటి సినిమాలు చూశారు. అధికారంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా బిజీబిజీగా గడిపేశారు. నిత్యం రాజకీయాల్లో ఉండేవారు. అలాంటి చంద్రబాబు ఒక్కసారిగా టర్న్ అయ్యారు. సినీ రంగానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అంతేకాదు వైసీపీ హయాంలో టికెట్ల ధరలు, ఆన్ లైన్ టికెటింగ్ విధానంపైనా ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ సినీ ఇండస్ట్రీకి మద్దతుగా నిలిచారు చంద్రబాబు నాయుడు. వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల సినీ ఇండస్ట్రీ గుర్రుగా ఉంది. అయితే సినీ ప్రముఖులు వైఎస్ జగన్‌తో భేటీ అయిన తర్వాత అవి కాస్త కుదుటపడ్డాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆపుండును గెలుకుతున్నారు. ఇటీవల కాలంలో అటు కర్నూలు.. ఇటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల పర్యటనలలో మానిన గాయాన్ని మరీ గుర్తు చేసి చెప్తున్నారు. సినీ హీరోల పాలిట విలన్ అంటూ తీవ్ర విమర్శలు చేస్తు్న్నారు. ఈ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు పెద్ద ప్లానే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ వైసీపీ సర్కారు తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో చంద్రబాబు చిత్ర పరిశ్రమను తమవైపునకు తిప్పుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అందుకు తాను మొదటి అడుగు వేస్తే మరింతగా కెమిస్ట్రీ కుదురుతుందని చంద్రబాబు భావించినట్టు రాజకీయ వర్గాల్లో వినికిడి.

బాలయ్య పక్కా వ్యూహం

ఇకపోతే తెలుగుదేశం పార్టీ అంటేనే నందమూరి ఫ్యామిలీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ కూడా టీడీపీ వైపే ఉంటుంది. అలాగే దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు, అశ్వనీదత్, మురళీమోహన్ వీరంతా టీడీపీకి వీర విధేయులు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీళ్ళందరిలో నందమూరి బాలకృష్ణ మాత్రమే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అగ్రనటుడు, హీరో కావడంతో ఆయనకు అటు రాజకీయ రంగం.. ఇటు గ్లామర్ రంగం ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఆ రెండు అంశాలను బాలయ్య పార్టీకి ఉపయోగించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన ఆహాలో ప్రసారమయ్యే అన్ స్టాపబుల్‌ ద్వారా చంద్రబాబు, లోకేశ్‌లను తీసుకువచ్చి తెలుగుదేశం సంక్షోభంపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేసే ప్రయత్నం చేశారు. అలాగే మెగా ఫ్యామిలీని దగ్గర చేర్చే ప్రయత్నం కూడా చేశారు. అంతేకాదు గెస్ట్‌లు ఎవరు వచ్చినా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలతో లింకులు పెడుతూ కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే నందమూరి బాలకృష్ణ టాలీవుడ్‌ను టీడీపీవైపునకు తిప్పే ప్రయత్నాలను ఇప్పటి నుంచే మొదలు పెట్టేశారనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Read more:

Cm Jagan అహంవీడి నేలకు దిగాడు: Varla Ramaiah


Next Story

Most Viewed