Mlc Elections: ఓటర్లు, ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

by srinivas |
Mlc Elections: ఓటర్లు, ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరచిన అభ్యర్థులను గెలిపించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు, ఓటర్లకు కొన్ని అంశాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యం నిరంతర దాడికి గురవుతూ వస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 13న జరగనున్న పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికను కూడా ఒక ప్రహసనంగా మార్చాలని సీఎం వైఎస్ జగన్ కనుసన్నల్లో అధికార పార్టీ అన్ని అడ్డదారులు తొక్కుతోందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

‘అధికారం అంటే ఒక ఉన్నతమైన బాధ్యత. ప్రభుత్వం అంటే ప్రజలకు మంచి చేసేందుకు లభించిన అవకాశం అని భావించే పార్టీ టీడీపీ. ప్రజల అవసరాలు, యువత భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పాలన చేసిన పార్టీ తెలుగుదేశం. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత అనేక క్లిష్ట పరిస్థితులను, సవాళ్లను అధిగమించి రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తెచ్చాం. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోనే దాదాపు 10 లక్షల ఉద్యోగాలు కల్పించి యువత భవితకు బాటలు వేశాం. 6 లక్షల మందికి ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చి వారికి అండగా నిలిచాం’ అని చంద్రబాబు బహిరంగ లేఖలో ప్రస్తావించారు. అయితే ‘నేడు ప్రభుత్వ టెర్రరిజంతో పరిశ్రమలు పారిపోతున్నాయి. నిరుద్యోగం పెరిగిపోయింది. యువత భవిష్యత్‌ అంధకారం అయ్యింది. నేడు ఈ ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ గురించి, డీఎస్సీ గురించి మోసం చేసింది.’ అని లేఖలో చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

ఉద్యోగులకు అండగా నిలిచాం

విభజన కష్టాలు ఉన్నా ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చామని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులకు అడిగినంత ఫిట్‌మెంట్‌ కాదు కదా... కనీసం ఏ నెల జీతం ఆ నెల ఇచ్చే పరిస్థితి కూడా కల్పించడం లేదని విమర్శించారు. టీచర్లను లిక్కర్‌ షాపుల వద్ద పెట్టి అవమానించారని మండిపడ్డారు. ఈ అన్ని అంశాలను యువత, పట్టభద్రులు, ఉద్యోగులు, టీచర్లు గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు కోరారు. ఎన్నికల్లో అక్రమాలు అనే విధానానికి అలవాటుపడిన ఈ ప్రభుత్వం... ఇప్పుడు ఆదే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు, ఫోర్జరీలకు తెరతీసింది. అడ్డదారులతో పట్టభద్రుల, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తోంది. దీనిపై ప్రజలు, ఓటర్లు చైతన్యంతో వ్యవహరించి కుట్రపూరిత వైసీపీకి బుద్ది చెప్పాలి అని చంద్రబాబు ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో విజ్ఞప్తి చేశారు.

Next Story