ఆ తప్పే మళ్లీ జరుగుతుందా! అభ్యర్థుల ఖరారులో క్లారిటీ ఇవ్వని బాబు

by Disha Web Desk 7 |
ఆ తప్పే మళ్లీ జరుగుతుందా! అభ్యర్థుల ఖరారులో క్లారిటీ ఇవ్వని బాబు
X

దిశ ప్రతినిధి, కడప: మొదటి ఓటా.. రెండో ఓటా.. అన్నది పక్కన పెడితే పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం కనిపిస్తోంది. ఇదే ఉత్సాహంతో సాధారణ ఎన్నికల వరకు వెళితే పార్టీకి మెరుగైన ఫలితాలు ఉంటాయన్న ధీమా ఆ పార్టీలో ఉంది. పార్టీ అధిష్టానం కూడా మండలి గెలుపు ప్రభావాన్ని రానున్న సాధారణ ఎన్నికల గెలుపునకు సంకేతమన్న అభిప్రాయాలను పార్టీ శ్రేణులు, ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉంది.

ఇంతవరకు బాగానే ఉన్నా.. చివరకు అభ్యర్థుల ఖరారులో గతంలో చేసిన తప్పే అధినేత చంద్రబాబు మళ్ళీ చేస్తారేమోనన్న ఆందోళన ఆ పార్టీ శ్రేణులను తొలుస్తోంది. ఒకటి రెండు చోట్ల అభ్యర్థుల ఖరారు ఇబ్బంది ఉన్నా అలాంటి పరిస్థితి లేని చోట్ల కూడా అభ్యర్థుల ఖరారులో నాన్చుడు ధోరణి ఎందుకన్న ప్రశ్నలు ఆ పార్టీ శ్రేణులు నుంచే వినిపిస్తున్నాయి. అందునా సీఎం జగన్ రెడ్డి సొంత జిల్లా అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఎంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేస్తే అంత త్వరగా ఇప్పటి నుంచే అసెంబ్లీలో గెలుపు కార్యాచరణకు వర్గాలు, ఓట్లను కూడగట్టుకునేందుకు అవకాశం ఉంటుందన్నది ఆ పార్టీ నేతలతో పాటు రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్న అంశం.

ఆ రెండూ తప్ప..

సీఎం సొంత జిల్లాలో హోరాహోరీ తలపడి మెరుగైన ఫలితాలు సాధించాలన్న ప్రయత్నాల్లో టీడీపీ ఉంది. జిల్లాలో ఇంతవరకు పులివెందులలో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని, జమ్మలమడుగు నుంచి మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి కుమారుడు భూపేష్ రెడ్డిలను తప్ప మిగిలిన 8 చోట్ల అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఈ నియోజకవర్గాల నుంచి టికెట్ రేసులో ఉన్న చాలామంది ఆశావహులు చంద్రబాబు నుంచి క్లారిటీ రాకపోవడంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు.

నెలల తరబడి వారు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రాకపోవడం, టికెట్లు తమకే అన్న ధీమా కొందరిలో ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గాల నుంచి మరికొందరు టికెట్లు ఆశిస్తూ ప్రయత్నాలు చేస్తుండడంతో ఆశావహులు బయటపడని అసహనానికి గురవుతున్నారు. వారికి అత్యంత దగ్గరగా ఉన్న వారితో చర్చించేటప్పుడు ఇలాంటి అసహనం మాటలు బయటపడుతున్నాయి

వెన్నుపోట్లు భయం

ఎన్నికలు సమీపించే వరకు ఇలాగే అభ్యర్థులు ఎవరో తేల్చకుండా చివరిలో ఎవరో ఒకరి పేరు ఖరారు చేస్తే మిగిలిన వారి నుంచి బరిలో ఉండే అభ్యర్థులకు సహాయ నిరాకరణ, వెన్నుపోట్లు ఎదురవుతాయేమోనన్న ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఉమ్మడి కడపలో టీడీపీకి అపారమైన కార్యకర్తల బలం ఉంది. వారి కోసం శ్రమించే క్యాడర్ ఉంది. అయినా ఆ పార్టీ టికెట్ల కేటాయింపులో అధిష్టానం చివరి నిమిషంలో తీసుకునే నిర్ణయమే పార్టీకి నష్టం చేకూరుస్తుందన్న ఆందోళన వారిలో వ్యక్తం అవుతోంది. అంతేకాదు చివరిలో ఎవరికి టిక్కెట్లు వస్తాయో స్పష్టత లేకపోవడంతో అప్పటిదాకా ఏ నాయకుడి దగ్గరికి వెళితే ఏ నేతకు కోపం వస్తుందోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.

చివరికి ఎవరికి

తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కడప జిల్లాలో కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, కమలాపురం, రాయచోటి, రైల్వే కోడూరు, రాజంపేట అసెంబ్లీ స్థానాలు నుంచి అభ్యర్థులకు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నియోజకవర్గాల నుంచి ఇద్దరు, ముగ్గురు, నలుగురు చొప్పున టిక్కెట్ బరిలో ఉన్నారు. వీరిలో ఎవరికి టికెట్ ఇస్తారో! ఎవరిని నిరాశ పరుస్తారో! నిరాశకు గురైన వారు పార్టీ వైఖరి పట్ల ఏ విధంగా ప్రతిస్పందిస్తారో అన్నది ఎన్నికల ముందు ఆ పార్టీ శ్రేణులను కలవర పరిచే అంశంగా మారింది.


Next Story

Most Viewed