నడిరోడ్డుపైనే వ్యాపారాలు.. ట్రాఫిక్‌లో నరకం చూస్తున్న జనం

by Jakkula Mamatha |   ( Updated:2024-10-01 14:45:54.0  )
నడిరోడ్డుపైనే వ్యాపారాలు.. ట్రాఫిక్‌లో నరకం చూస్తున్న జనం
X

దిశ, పల్నాడు: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చిరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డు పైనే అడ్డదిడ్డంగా బండ్లు బడ్డి కొట్లు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. ఒకరినొకరు పోటీతత్వం వల్ల మా దుకాణమే కనిపించాలని వ్యాపారులు రోడ్డుపైనే దుకాణం పెట్టేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో వెళ్లే పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. నిత్యం ఈ మార్గంలో అధికారులు, రాజకీయ నాయకులు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ పట్టించుకోక పోవడంతో స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జామ్ జామ్ ట్రాఫిక్ జామ్..

రోజు రోజుకి పట్టణ జనాభా పెరగడం. దీనికి తోడు వాహనాల సంఖ్య కూడా పెరుగుతున్నాయి. అయితే ఆ మేరకు రహదారుల విస్తరణ కూడా జరగకపోవడంతో పట్టణంలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య జటిలంగా మారింది. దీనికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా కొంతమంది వ్యాపారులు ఆక్రమణలు వలన రహదారులు, అంతర్గత రోడ్లు కుచించుకుపోయాయి. ప్రధానంగా ఆర్‌సిఎం చర్చి నుంచి నరసరావుపేట రోడ్డు చెక్కపోస్టు వరకు గుంటూరు - హైదరాబాద్ రహదారికి ఇరువైపులా ఈ సమస్య నెలకొంది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న గోశాల వ్యాపార దుకాణ దారులైతే అయితే మరీ రహదారిపైకి వచ్చేశారు.

రోడ్డుకు అడ్డంగా దుకాణాలు..

దుకాణంలో కొనుగోలు చేసేందుకు వచ్చే వారు ప్రధాన రహదారి పైన నిలబడాల్సిన పరిస్థితి తలెత్తటంతో నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ప్రమాదాలకు నిలయంగా మారింది. దుకాణాలు పక్కనే నాగార్జున నగర్‌కు వెళ్లే మార్గం కావటం కాలనీ నుంచి రోడ్డు మీదకు వచ్చే వారికి ఈ దుకాణాలు అడ్డంగా ఉండటంతో రోడ్డు దాటే వారికి వివిధ రకాల వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అదేవిధంగా రహదారికి ఇరువైపులా చెక్ పోస్ట్ వరకు ఇదే సమస్య తీవ్ర స్థానికులను వేధిస్తుంది.

ఈ సెంటర్లు సహనానికి..

ఇక పట్టణంలో రైల్వే స్టేషన్ రోడ్డు, వెంకటరత్నం ఆస్పత్రి రోడ్డు, ఎల్ఐసి రోడ్డు, లక్ష్మీ థియేటర్ సెంటర్, స్టేట్ బ్యాంక్ రోడ్డు, గార్లపాడు సెంటర్, ఐదు లాంతర్ల సెంటర్, మద్ది వారి బావి సెంటర్, గాంధీ చౌక్ తదితర చోట్ల అంతర్గత రోడ్లు కూడా వివిధ రకాల వ్యాపారులు ఆక్రమించుకున్నారు. ఆ మార్గంలో ఎదురెదురు వాహనాలు రాకపోకలు సాగించాలంటే వాహన చోదకులు భయాందోళన గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గోశాల గాంధీ బొమ్మల సెంటర్ తదితర ప్రాంతాల్లో నెలకొన్న ఈ జఠిలమైన సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story