విశాఖ వైసీపీకి బిగ్‌షాక్.. ఎంవీవీ, జీవీ జంప్?

by Rajesh |
విశాఖ వైసీపీకి బిగ్‌షాక్.. ఎంవీవీ, జీవీ జంప్?
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: వైసీపీ పాలనా కాలంలో ఉత్తరాంధ్రాలో విజయసాయిరెడ్డితో పోటీ పడి వేల కోట్ల లబ్ధి పొందిన మాజీ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన సహచరుడైన విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ)లు పార్టీ మారేందుకు తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభించారని తెలిసింది. ఎంవీవీ సత్యనారాయణ విశాఖ తూర్పు నియోజక వర్గం నుంచి పోటీ చేసి తెలుగుదేశం ప్రత్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు చేతుల్లో 70 వేలకు పైగా ఓట్ల తేడాతో దారుణంగా ఓడిపోయారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సంపాదించిన వేల కోట్ల ఆస్తులను కాపాడుకోవడంతో పాటు వాటికి సంబంధించి కేసులు, విచారణల నుంచి తప్పించుకొనేందుకు యుద్ధప్రాతిపదికన కోట్ల రూపాయలు కానుకగా సమర్పించి మరీ పార్టీ మారే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ఆ కారణంగానే గురువారం విశాఖ వచ్చిన పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఉత్తరాంధ్రా ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డిని కూడా కలవలేదు.

సీఎం రమేశ్‌తో డీల్‌కు రెడీ?

రాష్ర్టంలో కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం నుంచి తమను కాపాడమంటూ గత శనివారం నాడే ఎంవీవీ, జీవీలు హైదరాబాద్‌లో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ను కలిశారని తెలిసింది. వీరి వ్యవహారాలు తెలుసుకొన్న సీఎం రమేష్ జీవీకి ఫోన్ చేసి పరోక్షంగా సంగతేమిటన్నారని, దీంతో కంగారు కంగారుగా వెళ్లి ఆయనను కలిశారని తెలిసింది. బీజేపీ నుంచి సీఎం రమేష్ ఎంపీగా ఎన్నికైనప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు వున్నందున, ఆయన వ్యాపారవేత్త అయినందున ఆయనతో డీల్‌కు ప్రయత్నించారని తెలిసింది. అయితే సీఎం రమేష్ ఎటువంటి హామీ ఇవ్వకుండా మూడు నెలల తరువాత మాట్లాడదామని చెప్పి పంపించినట్లు తెలిసింది.

లింగమనేనితోనూ రాయబారం

తెలుగుదేశం పార్టీలో సన్నిహితంగా వుంటూ జనసేన కార్యకలాపాల్లో చురుగ్గా వున్న మరో పారిశ్రామిక వేత్త, సొంత సామాజిక వర్గానికి చెందిన లింగమనేని రమేష్‌ను కూడా కలసి తమపై ఎటువంటి కేసులు, విచారణలు, అరెస్టులు లేకుండా చూడాల్సిందిగా రాయ‘బేరాలు’ నడిపినట్లు తెలిసింది. అయితే, ఆయన నుంచి స్పష్టమైన హామీ ఏమీ లభించలేదని తెలిసింది. తాము చేపట్టే వందల కోట్ల ప్రాజెక్టుల్లో ఉచితంగా వాటాలు ఇస్తామంటూ వీరు రాయబారాలు చేస్తున్నారని తెలిసి సాటి వైసీపీ నేతలు షాక్‌కు గురయ్యారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న తమను కాదని కేవలం డబ్బు కోసం ఎంవీవీ, జీవీలను విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డిలకు సమానంగా చూసిన, ప్రోత్సహించిన జగన్, వైఎస్ భారతి, తలశిల రఘురాంలకు తగిన శాస్తి జరిగిందని వైసీపీ నేతలే ఇప్పుడు తిట్టుకొంటున్నారు.

హయిగ్రీవ, సీబీసీఎంసీ ప్రాజెక్టులు

వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో వృద్ధులు, వికలాంగుల కోసం హయగ్రీవ సంస్థకు కేటాయించిన అత్యంత విలువైన 12 ఎకరాల భూమి ప్రభుత్వ పెద్దల సహకారం, జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున లాలూచీ వ్యవహారాల కారణంగా ఎంవీవీ చేతికి వచ్చింది. ఆయన అందులో భూమి కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. స్వాతంత్ర్యం రాకపూర్వం నుంచి క్రైస్తవ సంస్థ సీబీసీఎన్‌సీ చేతుల్లో వున్న నగరం నడిబొడ్డు అయిన సిరిపురంలోని వందల కోట్ల విలువైన భూములను వైఎస్ జగన్ క్రైస్తవుల ప్రయోజనాలను పణంగా పెట్టి మరీ ఎంవీవీకి అప్పగించారు. ఇందులో బహుళ అంతస్థుల నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశాలుండడమే ఇప్పుడు ఎంవీవీ, జీవీలను వేధిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీబీసీఎంసీ స్థలం వద్దకు వచ్చి తమ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత దీనిపై చర్యలు తీసుకొంటామని స్పష్టం చేశారు.

మళ్లీ షీట్ ఓపెన్ చేస్తే

గత తెలుగుదేశం ప్రభుత్వంలో భూవివాదాల కారణంగానే మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై రౌడీ షీటు తెరిచారు. తిరిగి ఈ ప్రభుత్వంలో ఆయనపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా షీట్ తిరిగి తెరిచే అవకాశం వుందనే ప్రచారం జరుగుతోంది. గత ఏడాది ఇదే నెలలో ఎంవీవీ కుటుంబం కిడ్నాప్‌కు గురైంది. ఆ సమయంలో అది కిడ్నాప్ కాదని, వ్యాపార లావాదేవీల్లో జరిగిన గొడవంటూ ఆరోపణలు వచ్చాయి. కిడ్నాపర్లుగా ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లిన వారే ఎంవీవీ తరపున పలు సెటిల్మెంట్లు చేయడం గమనార్హం.Next Story

Most Viewed