బాలినేని ఎఫెక్ట్: ప్రకాశం ఎస్పీకి సీఎంవో నుంచి పిలుపు

by Disha Web Desk 21 |
బాలినేని ఎఫెక్ట్: ప్రకాశం ఎస్పీకి సీఎంవో నుంచి పిలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రకాశం జిల్లా ఒంగోలులో సంచలనం సృష్టించిన భూ కుంభకోణం కేసు పంచాయతీ సీఎంకు చేరింది. ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌కు సీఎంవో కార్యాలయం నుంచి శుక్రవారం పిలుపువచ్చింది.భూ కుంభకోణంపై పూర్తి వివరాలతో రావాలని సీఎంవో అధికారులు ఎస్పీ మలికా గార్గ్‌ను ఆదేశించారు. దీంతో సంబంధిత దస్త్రాలతో మలికా గార్గ్‌ అమరావతి బయలు దేరారు. ఫేక్ డాక్యుమెంట్లు, స్టాంపులతో ప్రైవేటు భూములపై అక్రమ లావాదేవీలు జరిగాయని బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం దర్యాప్తు నిమిత్తం సిట్‌ను నియమించింది. స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ ఈ ఫేక్ డాక్యుమెంట్ల కుంభకోణంపై దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురును సిట్ బృందం అరెస్ట్ చేసింది. అయితే ఈ ఘటనలో మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వినిపించాయి. బాలినేని కేంద్రంగా ఫేక్ డాక్యుమెంట్ల కుంభకోణం జరిగిందని విపక్షాలు ఆరోపించాయి. దీంతో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. ఈ కేసుతో సంబంధం ఉన్నవారు వైసీపీ వారైనా సరే వదిలిపెట్టొద్దని సిట్ దర్యాప్తు బృందం, ఎస్పీని బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ ఫేక్ డాక్యుమెంట్ల వ్యవహారంలో వైసీపీ నేతలు ఉన్న సమాచారం తెలిసిందే. అక్రమాలకు పాల్పడిన వారి పేర్లను సైతం మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం సిట్ బృందానికి సూచించినా స్పందించలేదు..

బాలినేని సీఎంవోలో ఫిర్యాదు

ఈ భూ కుంభకోణం వ్యవహారంలో పొలీసులు, సిట్ దర్యాప్తు బృందం తీరును నిరసిస్తూ మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన గన్‌మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ మేరకు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి లేఖ రాశారు. అయితే డీజీపీ బాలినేనికి ఫోన్ చేసి ఈ కేసు విచారణ జరుగుతుందని.. దర్యాప్తు బృందాలు విచారణ చేపట్టాయని హామీ ఇచ్చారు. అయినప్పటికీ మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శాంతించలేదు. గన్‌మెన్లను తిప్పి పంపించి వేశారు. అనంతరం గురువారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డిని కలిసి ఫేక్ డాక్యుమెంట్ల కుంభకోణం కేసుపై చర్చించారు.‘నా పక్కనుండేవారైనా, పార్టీ మనుషులైనా.. కేసులో ఎవరున్నా సరే అరెస్టు చేయండి. జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు చెప్పినా వారు స్పందించడం లేదు. ఎస్పీని, కలెక్టర్‌ను బదిలీ చేయండి. అనవసరంగా నేను విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. పోలీసుల తీరుకు నిరసనగానే నేను నా గన్‌మెన్‌లను సరెండర్ చేశాను’ అని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. అయితే ఈ కేసు విషయంలో జోక్యం చేసుకోవద్దని బాలినేని సీఎంవో అధికారి సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఎస్పీ, కలెక్టర్‌లను బదిలీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. పార్టీకి ఇబ్బందికర పరిస్థితి తీసుకువస్తున్నారని ఇకపై అలాంటి పరిస్థితి తీసుకురావద్దని ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎంవోను కలిసిన అనంతరం జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌కు సీఎంవో నుంచి పిలుపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.



Next Story

Most Viewed