వైసీపీ ఓడింది ఇందుకేనా..?

by samatah |   ( Updated:2023-03-23 02:47:11.0  )
వైసీపీ ఓడింది ఇందుకేనా..?
X

ఈపాటికే చేసిన పనులకు బిల్లులు రావడం లేదు. కేంద్రం నుంచి వచ్చే నిధులనూ ఏదో పేరుతో రాష్ట్ర ప్రభుత్వమే వాడేసుకుంటోంది. ఇటీవల విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి కరెంటు బిల్లుల కింద జమ చేయాలని పంచాయతీ కార్యదర్శులకు సర్క్యులర్లు పంపారు. రాష్ట్రం ఇచ్చేదేమీ లేకున్నా కేంద్రం ఇచ్చే నిధులనూ లాగేసుకోవడంతో సర్పంచులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అందుకే మొన్నటి గ్రాడ్యుయేట్ ఎన్నికలను అధికార పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు పట్టించుకోలేదు...’ అని ప్రకాశం జిల్లా సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జీ వీరభద్రాచారి వ్యాఖ్యనించారు. 90 శాతానికిపైగా సర్పంచులు, ఎంపీటీసీలు అధికార పార్టీ వాళ్లే. స్థానిక ప్రజాప్రతినిధులు సర్కారు తీరుపై ఆక్రోశంతోనే ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్​గా తీసుకోలేదని తెలుస్తోంది.

దిశ, ఏపీ బ్యూరో : కర్ణుడి చావుకు సవాలక్ష శాపాలు కారణం అన్నట్లు అధికార వైసీపీ గ్రాడ్యుయేట్​ఎన్నికల్లో ఘోర వైఫల్యం చెందడానికి బోలెడు కారణాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పంచాయతీ సర్పంచులు ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలప్పుడు తప్ప మిగతా సమయంలో తమ సమస్యలు పట్టించుకోవడంలేదనే ఉక్రోషంతో ఉన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు హడావుడి చేసినా ఏదో మొక్కుబడిగా సమావేశాలకు హాజరయ్యారు. ఓటర్లను పోలింగ్​బూతు వరకు తీసుకెళ్లే బాధ్యతను వదిలేసినట్లు స్పష్టమవుతోంది. కేంద్రం నుంచి వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు జమ చేయలేదు. పైగా కరెంటు బిల్లుల కింద సుమారు రూ.300 కోట్లు రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని డీపీవోల ద్వారా కార్యదర్శులకు సర్క్యులర్లు జారీ చేశారట. దీనిపై కన్నెర్రజేస్తున్న సర్పంచులు ఎన్నికలను పట్టించుకోలేదని తెలుస్తోంది.

ఉక్రోషం, ఆక్రోశం..

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికార వైసీపీ వలంటీర్ల మీదనే ఎక్కువగా ఆధారపడినట్లు క్షేత్ర స్థాయి పరిశీలనలో వెల్లడవుతోంది. కుటుంబాల్లోని గ్రాడ్యుయేట్లను గుర్తించి వాళ్లను ఓటర్లుగా నమోదు చేయించడం వరకు పనిచేశారు. ఆ తర్వాత వాళ్లను అధికార పార్టీవైపు మళ్లించి పోలింగ్​బూత్​వరకు తీసుకెళ్లే బాధ్యతను పార్టీ క్యాడర్​తీసుకుంది. ద్వితీయ శ్రేణి నాయకుల్లోని అసంతృప్తులు ఈ బాధ్యతను సక్రమంగా నెరవేర్చలేదని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. కొన్నిచోట్ల నాలుగేళ్ల నుంచి చేసిన పనులకు బిల్లులు రాలేదనే అసంతృప్తి ఉంది. ఇంకొన్ని చోట్ల తమకు ఒక్క పనీ ఇవ్వలేదనే ఉక్రోషంగా ఉన్నారు. ఎక్కువ చోట్ల పార్టీ క్యాడర్​ను ఇప్పటిదాకా పట్టించుకోలేదనే ఆవేదన నెలకొంది. పార్టీలో సరైన గుర్తింపునివ్వడం లేదనే ఉక్రోషం ఓ కారణంగా కనిపిస్తోంది. అంతర్గత కుమ్ములాటలు కూడా ఓటమికి దారితీశాయని సమాచారం.

బెడిసికొట్టిన కులసమ్మేళనాలు..

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో కొన్ని కులాల వారీ సమ్మేళనాలు నిర్వహించారు. సాధారణ ఎన్నికల్లో అయితే ఇలాంటివి దోహదపడతాయి. విద్యావంతులు పాల్గొనే ఈ ఎన్నికలకు సంబంధించి యూనివర్శిటీలు, కాలేజీలు, యువజన సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించి వాళ్లలో సానుకూలత తీసుకురావాలి. ఈ పనిచేయకుండా కులాల సమ్మేళనాలు పెట్టడంతో రివర్స్​కొట్టినట్లు తెలుస్తోంది. పార్టీకి కళ్లూ చెవులుగా పనిచేస్తోన్న ఐ ప్యాక్ బృందం సైతం గ్రాడ్యుయేట్ల మూడ్​ను పసిగట్టలేకపోయింది. ఇలా చేస్తే సర్దుకుపోవడమేనంటూ సీఎం జగన్​హెచ్చరించినట్లు తెలుస్తోంది.

సీఎం శ్రమించినా..

ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం జగన్​నిరంతరం సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికలను తలపించేలా రాజకీయ ప్రచారం చేశారు. ఘోర ఓటమిని చవిచూడడం వెనుక లోపాలు ఎక్కడున్నాయనే దానిపై ఆత్మావలోకనం చేసుకున్నట్లు లేదు. పైగా ఇదొక హెచ్చరిక కూడా కాదనే నిర్లిప్తతను అధిష్టానం ప్రదర్శిస్తోంది. ఇది అతి విశ్వాసమా లేక క్యాడర్​లో ఆత్మస్థయిర్యం నింపడం కోసమా అనే కోణంలో రాజకీయ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.

Also Read: టీడీపీలోకి వైసీపీ నేత గిరిధర్ రెడ్డి.. అన్న కోసమే(నా) ?

Advertisement

Next Story