కేవలం రూ.2కే చికెన్ బిర్యానీ.. ఎగబడిన జనం

by srinivas |
కేవలం రూ.2కే చికెన్ బిర్యానీ.. ఎగబడిన జనం
X

దిశ, హిందూపురం : కేవలం రెండు రూపాయలకే స్వీటు, కోడిగుడ్డుతో పాటు చికెన్ బిర్యానీని వడ్డించడం అసాధ్యం అనుకుంటున్నారా?. అభిమానం ఉంటే చాలు అది ఎంత పెద్ద సమస్య అయినా అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చునని అభిమానులు చెబుతున్నారు. ఇలా హిందూపురంలోని ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానులు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. కేవలం రెండు రూపాయలకే స్వీటు, కోడి గుడ్డుతో చికెన్ బిర్యానీని వడ్డించి అందరిని ఆనందింపజేశారు. నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని గడచిన 200 రోజులుగా హిందూపురంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు అన్నార్తులకు, ఆకలితో బాధ పడేవారికి,పేదలకు రెండు రూపాయలకే భోజనం పెడుతున్నారు. గతంలో ఇక్కడ అన్న క్యాంటీన్ ఉండగా ప్రస్తుత ప్రభుత్వం దానిని గ్రామ సచివాలయానికి కేటాయించడంతో ప్రభుత్వ ఆసుపత్రి మెయిన్ గేటు ముందే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

గడచిన 2019 ఎన్నికలలో బాలకృష్ణ ఉపయోగించిన ప్రచార రథంలో బయటనుంచి వండిన ఆహార పదార్థాలను అక్కడికి తీసుకుని వచ్చి కేవలం రెండు రూపాయలకే రోజుకు 200 నుంచి 300 మందికి రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారు. నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలకు నేటితో 200 రోజులు పూర్తయిన సందర్భంగా అందరికీ గుర్తుండిపోయేలా అన్నార్తులకు, పేదలకు రెండు రూపాయలకే స్వీటు కోడిగుడ్డుతో పాటు చికెన్ బిర్యానీని వడ్డిస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగానే మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వ ఆసుపత్రి ముందు బిర్యానీ వడ్డించారు.

సుమారుగా 300 మంది వరకు బిర్యానీని అందిస్తామని పేర్కొన్న నిర్వాహకులు అక్కడకు 500 మంది పైబడి రావడంతో అందరికీ సరిపోయేలా బిర్యానీని వడ్డించారు. రెండు రూపాయలకే బిర్యానీ ఇస్తున్నారు అని తెలియడంతో అన్నార్తులతో పాటు పేదలు, ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్సకు వచ్చిన రోగుల బంధువులు, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలతో పాటు పెద్ద ఎత్తున నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ అభిమానులు అందులో పాల్గొని సందడి చేశారు. రేపటి నుంచి యథావిధిగా రెండు రూపాయలకే అన్నం, సాంబార్, పప్పు, రసం, ఊరగాయ, మజ్జిగతో కూడిన రుచికరమైన భోజనాన్ని అందిస్తామని నిర్వాహకులు పేర్కొంటున్నారు.

Next Story

Most Viewed