Breaking: బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్ ఆత్మహత్య

by srinivas |   ( Updated:2023-11-25 16:57:20.0  )
Breaking: బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్  ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్ ఆత్మహత్య చేస్తున్నారు. లంచం తీసుకుంటుండగా మూడు రోజుల క్రితం శ్రీనివాస్ నాయక్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే అధికారుల కళ్లు గప్పి శ్రీనివాస్ నాయక్ అక్కడి నుంచి పారిపోయారు. తాజాగా ఆయన చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని ఓ లాడ్జిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. శ్రీనివాస్ ఆత్మహత్యను చెన్నై పోలీసులు బుక్కంపట్నం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందజేశారు. దీంతో శ్రీనివాస్ ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది.

కాగా ఈ నెల 22న సత్యసాయి జిల్లాలో ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపించారు. దస్తావేజు రిజిస్ట్రేషన్‌కు స్టాంప్ డ్యూటీ తక్కువగా చెల్లించారని సురేందర్ రెడ్డి అనే వ్యక్తిని డాక్యుమెంట్ రైటర్ శ్రీహరి ద్వారా సబ్ రిజిస్ట్రార్‌ లంచం డిమాండ్ చేశారు. దీంతో బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా డాక్యుమెంట్ రైటర్ శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీహరితో పాటు సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస నాయక్‌ను విచారించారు. పుట్టపర్తితో పాటు హిందూపురంలో శ్రీనివాస నాయక్ ఇల్లు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అయితే అధికారులు నుంచి శ్రీనివాస్ నాయక్ తప్పించుకుని పారిపోయారు. దీంతో ఆయన కోసం పోలీసులు, ఏసీబీ అధికారులు గాలింపు చేపట్టారు. ఇంతలో శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నట్లు చెన్నై పోలీసుల నుంచి సమాచారం అందింది.

Next Story