ధర్మవరంలో కబ్జా రాజ్యం?

by Dishanational1 |
ధర్మవరంలో కబ్జా రాజ్యం?
X

దిశ, అనంతపురం: గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే మాట నియోజకవర్గంలోనే కాదు దాదాపు తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్. ఉదయాన్నే నియోజకవర్గంలోని వార్డులు, మండలాలు, పల్లెల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం ఆ నేత స్పెషాలిటీ. అందరి దగ్గరికి వెళ్తూ.. అవ్వా, తాత మీకు పెన్షన్ అందిందా.. రోడ్లు ఎలా ఉన్నాయి అని ఆరా తీస్తారు. అందరితోనూ కలుపుగోలుగా మాట్లాడుతూ వారి సమస్యలకు కారణమైన అధికారులను అందరిముందే కడిగిపారేస్తూ.. అవినీతిరహిత పాలన అంటూ ప్రసంగించేస్తారు. ఈ తతంగాన్ని అంతా ఫేస్​బుక్​లో లైవ్​కవర్ చేసే యంత్రాంగం ఉండనే ఉంది.. ఇదంతా చూసిన వారు ఆయనో నిఖార్సైన నిజాయితీపరుడు అనుకుంటారు. కానీ, అక్కడే పప్పులో కాలు వేసినట్టే. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే మరొకవైపు నుంచి ఆయనను చూస్తే అసలు స్వరూపం, నిజ రూపం బట్టబయలవుతుంది. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో చేస్తున్న పర్యటనల్లో అక్కడక్కడా స్థానికంగా ఉన్న సమస్యలను తనకు అనుకూలంగా మార్చుకుని వాటిని ఆదాయమార్గంగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతోపాటు ధర్మవరం నియోజకవర్గం పరిధిలో భూముల్ని ఆక్రమించినట్లు విమర్శలు వస్తున్నాయి. ధర్మవరం, ముదిగుబ్బ మండలాల్లో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు పదుల ఎకరాల ప్రభుత్వ భూములను మింగేసినట్లు స్థానికంగా చర్చ జరుగుతున్నది. ధర్మవరం చెరువు సమీపంలో ఆనుకొని ఉన్న గుట్టను సైతం కబ్జా చేశారని.. ఆ గుట్ట మీదకు వెళ్లేందుకు రోడ్డు కోసం అక్కడ సాగు చేసుకుంటున్న పేద రైతులను బెదిరించి అసైన్డ్ భూములను సైతం బలవంతంగా లాక్కున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు పొలాలకు ఆనుకుని ఉన్న గుట్ట, చెరువు పోరంబోకు భూములను కలిపేసుకుని పంటలు పండించేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇదంతా బహిరంగంగానే జరుగుతూ ఉన్నా అటు రెవెన్యూ యత్రాంగం కానీ, ఇటు జలవనరుల శాఖ అధికారులు కానీ నోరు మెదపడంలేదు.

రిటైర్డ్ ఉద్యోగి సహకారం...

ధర్మవరం సమీపంలోని ఎర్ర గుట్టపై ఉన్న పొలాలను లాగేసుకోవడానికి రెవెన్యూ రికార్డులను తారుమారు చేసినట్లు తెలుస్తున్నది. ఇందుకు ధర్మవరం పట్టణానికి చెందిన ఓ రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగి సహకారం తీసుకున్నట్లు సమాచారం. ఇలా 902 నుంచి 909 వరకు ఉన్న సర్వే నెంబర్లలోని సుమారు 20 ఎకరాల పొలాన్ని స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరుగుతున్నది. గుట్టను ఆనుకుని ఉన్న పట్టా భూముల కోసం వాటి యజమానులను బెదిరించి తక్కువ ధరకు తీసుకున్నట్లు తెలిసింది.

దర్జాగా చెరువు కబ్జా

ఎర్రగుట్టకు ఆనుకుని ఉన్న చెరువును సుమారు 15 ఎకరాల వరకు పూడ్చి వేసి తన స్వాధీనంలోకి తెచ్చుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అక్కడికి బయట వ్యక్తులు ఎవరూ వెళ్లకుండా పటిష్ట బందోబస్తును సైతం ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఆయన ఎర్ర గుట్టపై గుర్రాలపై తిరుగుతూ సేదతీరుతూ ఉంటారు. దీనికి తోడు ఆయన పడవ ప్రయాణం సరదా కోసం రెండేళ్లు ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గడిచిన మూడు సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే నీళ్లు విడుదల చేసినట్లు రైతులు వాపోతున్నారు.

రికార్డులు లేకుండానే రిజిస్ట్రేషన్లు

ధర్మవరం పరిధిలోని ఎర్రగుట్ట విస్తరించి ఉన్న సర్వే నెంబర్లు 904, 905, 908, 909, పోతుల నాగేపల్లి పరిధిలోని 42, 43 సర్వే నెంబర్లు, మల్లా కాలువ పరిధిలోని 1, 4 సర్వే నెంబర్లలోని భూములను ఎవరికి ఎప్పుడు అసైన్డ్ చేశారనే వివరాలను మాత్రం రెవెన్యూ అధికారులు వెల్లడించడం లేదు. దీనిపై కొందరు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరగా వీటికి సంబంధించి తమ వద్ద ఎలాంటి రికార్డులు లభ్యం కావడం లేదని రెవెన్యూ అధికారులు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇలా రికార్డులు లేని భూములను ఎలా రిజిస్ట్రేషన్ చేశారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

రైతులను బెదిరించి భూములను లాక్కొని ...

ధర్మవరం రెవెన్యూ డివిజన్​పరిధిలోని మోటుమర్ల, కత్యే కొట్టాల గ్రామాలకు సంబంధించిన పేద రైతులకు 1976, 1977 సంవత్సరాల్లో డీ పట్టాలు మంజూరు చేశారు. దీంతో ఆ కుటుంబాలు ఎర్రగుంట- చెరువుకు మధ్యలో ఉన్న భూములను తరతరాలుగా సాగు చేసుకుంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక స్థానిక నాయకుడి కన్ను వాటిపై పడింది. అక్కడ భూములు ఉన్న పేద రైతులను బెదిరించి ఎకరాకు రూ. లక్ష ఇచ్చి పొలాలు బలవంతంగా రాయించుకున్నట్లు తెలిసింది. ఇలా పేద రైతులకు చెందిన సుమారు 45 ఎకరాల వరకు భూములను భయపెట్టి, బలవంతంగా లాక్కున్నట్టు సమాచారం. దీనిపై ప్రశ్నించిన కొంతమంది యువకులపై తప్పుడు కేసులు బనాయించి పోలీసులతో బెదిరింపులకు దిగినట్లు విశ్వసనీయ సమాచారం.

పిత్రార్జితంగా మార్చేశారు..

ఎర్ర గుట్ట సర్వే నెంబర్​లో సుమారు 20 ఎకరాలను తన కుటుంబంలోని మహిళ పేరుతో ఆన్ లైన్ లో నమోదు చేయించారు. ఇందులో పది ఎకరాలను కొనుగోలు చేయగా మరో ఎనిమిది ఎకరాలు ఆమెకు పిత్రార్జితంగా వచ్చినట్లు రికార్డుల్లో చూపించారు. సదరు మహిళ పుట్టిల్లు కర్నూలు జిల్లా కాగా, మరి ఆ జిల్లాకు చెందిన మహిళ తండ్రినుంచి అనంతపురంలోని భూమి ఎలా వారసత్వంగా వచ్చిందనే విషయం.. జుట్టు పీక్కున్నా అర్థం కాని ప్రశ్నగా మారింది.

రుణాల పేరుతో డాక్యుమెంట్లు

ఎర్ర గుట్టపై భూములను రిజిస్ట్రేషన్ చేయించడానికి నకిలీ, అక్రమంగా లింకు డాక్యుమెంట్లు సృష్టించారని ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్​కు చెందిన ఒక ఫైనాన్స్ కంపెనీ నుంచి సదరు సర్వే నెంబర్లపై రుణాలు తీసుకున్నట్లు డాక్యుమెంట్లు తయారు చేశారు. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో వాటిని సదరు ఫైనాన్స్ కంపెనీ వేలం వేయగా.. సదరు నాయకుడి కుటుంబ సభ్యులు కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టించారు. వాటి ఆధారంగానే అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ చేయించినట్టు విశ్వసనీయ సమాచారం. 1980 తరువాత ఎక్కడా ఫైనాన్స్ కంపెనీలు కానీ, బ్యాంకులు కానీ అసైన్డ్ భూములను వేలం వేసినట్లు కానీ వాటిని ఎవరైనా కొనుగోలు చేసిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. అయితే వాటికి రికార్డులు సృష్టించడానికి వేలం, ఫైనాన్స్ తతంగం నడిపినట్లు ప్రచారం జరుగుతున్నది.


Next Story

Most Viewed