మంత్రి గుమ్మనూరుకు బిగ్ షాక్.. కర్నూల్ వైసీపీ MP అభ్యర్థిగా కీలక నేత ఫిక్స్..!

by Satheesh |
మంత్రి గుమ్మనూరుకు బిగ్ షాక్.. కర్నూల్ వైసీపీ MP అభ్యర్థిగా కీలక నేత ఫిక్స్..!
X

దిశ, కర్నూలు ప్రతినిధి: కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు వైసీపీ అధిష్టానం షాకిచ్చింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఇష్టం లేని మంత్రి అజ్ఞాతంలోకెళ్లారు. వైసీపీ అధిష్టానం ఎంత ప్రయత్నించినా అందుబాటులోకి రాకపోవడంతో ఆ ఎంపీ టికెట్‌ను కర్నూలు నగర మేయర్ బీవై రామయ్యకు ఖరారు చేసింది. ఇప్పటికే ఎమ్మిగనూరు టికెట్‌ను మాజీ ఎంపీ బుట్టా రేణుకకు ఖరారు చేసింది. ఈ సీట్ల కేటాయింపులకు సంబంధించి నేడో, రేపో వైసీపీ అధిష్టానం ఐదో జాబితాలో అధికారిక ప్రకటన చేయనుంది.

అయితే మంత్రి గుమ్మనూరు మాత్రం ఆలూరు టికెట్ కేటాయించకుంటే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు లేకపోలేదు. దీంతో కర్నాటకలో మంత్రిగా ఉన్న ఆయన సోదరుడు, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవైపు ఆయన అందుబాటులోకి రాకపోవడం, మరోవైపు వైసీపీ ఐదో జాబితాను సిద్ధం చేయాల్సి ఉండడంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఎమ్మిగనూరు ఇంచార్జిగా ఉన్న మాచాని వెంకటేష్‌ను మార్చి మాజీ ఎంపీ బుట్టా రేణుకకు సీటు ఖరారు చేసింది.

కర్నూలుపై మంగళగిరి ప్రభావం

2019 పాదయాత్ర సమయంలో జగన్ చేనేత వర్గానికి ఒక టికెట్ ఇస్తానని హామీచ్చారు. అందులో భాగంగా చివర్లో కర్నూలు ఎంపీ, మంగళగిరి ఎమ్మెల్యే స్థానాలు మిగలగా మంగళగిరిలో నారా లోకేష్‌ను ఢీకొట్టడం ఆళ్ల రామకృష్ణారెడ్డికే సాధ్యమని సర్వేలో తేలడంతో ఆ ప్రభావం కర్నూలు పార్లమెంటు స్థానంపై పడింది. ఆ స్థానంపై ఆశలు పెట్టుకున్న వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన రామయ్యను జగన్ పక్కన పెట్టారు.

ఈ సారి కూడా మొదట ఈయనకు కాకుండా మంత్రి గుమ్మనూరు జయరాంకు ఎంపీ టికెట్ కేటాయించారు. కానీ మంత్రి ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు సుముఖత చూపలేదు. ప్రస్తుతం వైసీపీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న బీవై రామయ్య నగర మేయర్‌గా ఉన్నారు. రాజకీయ చాణక్యుడుగా పేరున్న బీవై రామయ్య నగర మేయర్‌గా ఉంటూ నగరాన్ని అభివృద్ధి చేసి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. అలాగే జిల్లా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

Next Story