- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Tadipatri: ఇసుక అక్రమ రవాణా.. వెనుక కీలక నేత

- అనుమతులు ఒకచోట.. తవ్వకాలు మరోచోట
- ఆయన బంధువుల కనుసన్నుల్లోనే దందా
దిశ, అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ఇసుక దోపిడీ ఏ మాత్రం ఆగడం లేదు. పెన్నా నది నుంచి యదేచ్ఛగా ఇసుకను తవ్వి దోచుకుంటున్నారు. ఇందుకుగాను వీరికి ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ ఇసుక తవ్వకాలు చేపడుతున్నా అధికారులు మాత్రం అడ్డుకోవడం లేదు. పైపెచ్చు వారికి అన్ని అనుమతులు ఉన్నాయని వత్తాసు పలుకుతూ ఉండడం గమనార్హం. ఇలా ఇసుక దోపిడీ దారులకు అధికారులు అండదండలు పుష్కలంగా ఉండడంతో అధికార పార్టీ నాయకులు మరింత రెచ్చిపోతున్నారు. ఇలా రోజుకు సుమారుగా 100 నుంచి 150 టిప్పర్‌ల ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకుగాను వీరు ఒకచోట అనుమతులు తీసుకోవడం ... మరొక చోట తవ్వకాలు చేపడుతుండడం గమనార్హం. తాడిపత్రి నియోజకవర్గంలోని కీలక నాయకుడి అండదండలతోనే ఇసుక అక్రమ రవాణా యదేచ్ఛగా సాగుతుందన్న ప్రచారం సాగుతోంది. తాడిపత్రి సమీపంలో నదిలోకి వెళ్లే దారిలో గేట్లు ఏర్పాటు చేసి మరీ ఇసుకను తరలించిన ఉదంతాలు అందరికీ తెలిసిన విషయమే. కొన్ని పత్రికల్లో ఇవి వార్తలుగా రావడంతో అక్కడ ఆపివేసిన ఇసుక దోపిడిదారులు మిగతా ప్రాంతాలలో తవ్వడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఎంతో విలువైన సహజ సంపదగా మారిన ఇసుకను అధికార పార్టీ నాయకులు డబ్బుల రూపంలో జేబుల్లో నింపుకుంటున్నారు.
ఒకచోట అనుమతి తీసుకుని ...
తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని పెద్దపప్పూరు మండలం ధర్మపురం పరిధి పెన్నా నదిలో ఇసుక రీచ్ ఏర్పాటుకు అనుమతులు ఉన్నాయి. ఇక్కడ సర్వే నంబరు ఒకటిలోని నాలుగు ఎకరాల్లో ఇసుకను తవ్వుకునేందుకు మైనింగ్ అధికారులు అనుమతులు ఇచ్చారు. ఇక్కడ ఉన్న ఇసుక రీచ్ నుంచి 61,500 టన్నుల ఇసుకను తవ్వుకునేందుకు ఈనెల 22 వరకు గడువు విధించారు. అయితే అనుమతి ఇచ్చిన చోట కాకుండా పెద్ద పప్పూరు గ్రామ పరిధిలోని సర్వే నంబరు ఒకటిలో ఇసుకను తవ్వుతున్నారు. ధర్మపురంతో పోలిస్తే పెద్దపప్పూరు వద్ద ఇసుక నాణ్యతగా ఉండడంతో ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఇసుకను తవ్వి తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలోనే ఇక్కడ కొందరు వైసీపీ నాయకులు తవ్వకాలు చేపట్టారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో అధికారులు వెళ్లి దానిని నిలిపివేశారు. కొన్ని రోజులు మౌనంగా ఉన్న ఇసుక దోపిడీదారులు ఇప్పుడు అక్కడికి వెళ్లి మళ్లీ తవ్వడం మొదలుపెట్టారు. దీని వెనుక తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన కీలక నాయకుడితో పాటు పెద్దపప్పూరు మండలానికి చెందిన అధికార పార్టీ నాయకుడి అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక నాయకుడు, తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన కీలక నాయకుడికి మధ్య బంధుత్వం ఉండడం మూలంగానే మీరు యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు సాగిస్తున్నట్లు సమాచారం.
రోజుకు పది లక్షల ఆదాయం
ఇక్కడ బహిరంగంగానే ప్రొక్లెయిన్‌లతో ఇసుకను తవ్వి టిప్పర్లలో నింపి జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్నూలు, కడప జిల్లాలకు సైతం సరఫరా చేస్తున్నారు.గడచిన కొన్ని రోజులుగా ఇలా పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తున్నారు. రోజుకు సుమారు వంద నుంచి 150 టిప్పర్లలో ఇసుక తరలి వెళ్ళిపోతోంది. తెల్లవారుజామున నాలుగు గంటలకు మొదలుపెట్టి రాత్రి 10 గంటల వరకు ఈ ప్రక్రియ యదేచ్ఛగా కొనసాగుతోంది. కొన్ని టిప్పర్లను బెంగళూరుకు సైతం తరలిస్తున్నట్లుగా సమాచారం. ఇలా ఒక్కో టిప్పర్ ఇసుకకు పదివేల నుంచి 30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన సుమారు రోజుకు కనీసం 10 లక్షల వరకు వసూలు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో నియోజకవర్గ నాయకులకు పెద్ద మొత్తంలో వాటాలు చేరుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిని ఒక అవకాశంగా తీసుకున్న స్థానిక అధికార పార్టీ నాయకులు కూడా ట్రాక్టర్ ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. ఇలా తరలించుకు వెళ్లిన ఇసుకను ఒక్కొక్క ట్రాక్టర్ 1800 నుంచి 2000 వరకు సమీప గ్రామాలలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది.
ఒక్కొక్కరిది ఒక్కో మాట
పెద్దపప్పూరులో ఇసుక అక్రమ తవ్వకాలపై అధికారులు ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతూ ఉండడం గమనార్హం. పెద్దపప్పూరు మండలం ధర్మపురం గ్రామంలోనే ఇసుక రీచ్‌కు అనుమతి ఉన్నట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. పెద్దపప్పూరు మండల కేంద్రంలో ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతి లేదని మైనింగ్ అధికారులు చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇక్కడ అనుమతులు ఉన్నాయని చెబుతున్నారు. ఇక ధర్మపురం నుంచి పెద్దపప్పూరుకు ఐదు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చిన సర్వే నెంబర్ లోనే తవ్వకాలు జరపాల్సి ఉంది. ధర్మపురంలోనూ కేవలం నాలుగు ఎకరాల్లోనే తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. కానీ కొందరు అధికారుల అండతో వైసీపీ నాయకులు పెద్దపప్పూరులో రోజుకు వందలాది టిప్పర్ల ద్వారా ఇసుకను తరలించి వేస్తున్నారు. కొన్ని రోజులు పెద్దపప్పూరులో తవ్వకాలు జరిపిన తర్వాత అధికారులు అడ్డుకునే నేపథ్యంలో తిరిగి ధర్మపురం రీచ్‌కు వెళ్లొచ్చని ముందస్తుగా ఎత్తుగడ వేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన సెబ్ అధికారులు కూడా ఈ వ్యవహారాన్ని చూసీ చూడనట్లుగానే వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా ఇక్కడ ఇసుక అక్రమ రవాణాపై అధికారులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతూ ఉండడంతో ఇసుక దోపిడీదారులకు కలిసి వచ్చింది. దీంతో యదేచ్ఛగా ఇసుకను జిల్లా సరిహద్దులు దాటించి వేసి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.