అందరికీ ఇళ్లు.. ఎక్కడ ఇచ్చావో చూపించు జగన్?

by Jakkula Mamatha |
అందరికీ ఇళ్లు.. ఎక్కడ ఇచ్చావో చూపించు జగన్?
X

దిశ ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి నిరుపేదలకు ఇంటి పట్టాలు అందజేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితి ఏంటో తెలుసా అని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరం రూరల్ మండలం సీసీ కొత్తకోట గ్రామంలో ఆయన బాబు సూపర్-6 కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి వచ్చిన శ్రీరామ్ కు నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి ఇంటింటికీ వెళ్లి బాబు సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఆ పథకాల ద్వారా కలిగే లబ్ధి గురించి వివరించారు

ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయన దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు. గ్రామంలో తాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్య ఉన్నాయన్నారు. గ్రామంలో కొంత మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ చాలామందికి ఇంకా అవి అందలేదన్నారు. ప్రభుత్వం చెప్పేది బారెడు.. చేసేది మూరెడన్న విధంగా పరిస్థితి తయారైందని విమర్శించారు. ఎవ్వరికీ ఇళ్లు లేకపోయినా తాము ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మిస్తున్నామని చెబుతున్న మాటలు పచ్చి అబద్దాలన్నారు. తాము ఏ గ్రామానికి వెళ్లినా ఇల్లు లేదని చెబుతున్నారని.. దీనికి ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుందని నిలదీశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులందరికీ ఇంటి పట్టాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు గ్రామంలో తాగునీరు, డ్రైనేజీ సమస్యలు కూడా తీర్చలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు.

Next Story